Top story: ఏకంగా మసీదునే లేపేసిన యోగి బుల్డోజర్లు.. పురాతన బావి ఆ ఆలయానికి చెందినదేనా?

ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ మరో సంభాల్‌గా మారబోతోందా? సంభాల్‌లో ఆలయంపై మసీదు నిర్మించినట్టే, సహారన్‌పూర్‌లోనూ జరిగిందా? సహారన్‌పూర్‌‌లో మసీదు కూల్చివేత సందర్భంగా బయటపడ్డ పురాతన బావి ఆ అనుమానాలకే తావిస్తోంది.

Post Published By: dialnews
Updated : 8 September 2026, 2:30 PM IST

ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ మరో సంభాల్‌గా మారబోతోందా? సంభాల్‌లో ఆలయంపై మసీదు నిర్మించినట్టే, సహారన్‌పూర్‌లోనూ జరిగిందా? సహారన్‌పూర్‌‌లో మసీదు కూల్చివేత సందర్భంగా బయటపడ్డ పురాతన బావి ఆ అనుమానాలకే తావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడిన వేళ.. యూపీ రాజకీయాలను షేక్ చేస్తున్న అంశం కూడా ఇప్పుడు ఇదే. ఇంతకూ, యోగి ప్రహుత్వం ఏకంగా ఒక మసీదునే ఎందుకు కూల్చివేసింది? యూపీ రాజకీయాలను షేక్ చేస్తున్న బావి .ఈ పురాతన బావి ఎలా బయటపడిందో తెలియాలంటే.. యోగి బుల్డోజర్ యాక్షన్ గురించి మొదట తెలుసుకోవాలి. యూపీలోని సహారన్‌పూర్ జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఒక మసీదును అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య బుల్డోజర్లతో కూల్చివేశారు.

ఈ కూల్చివేత హఠాత్తుగా జరిగింది కాదు. దీని వెనుక సుదీర్ఘమైన చట్టపరమైన ప్రక్రియ ఉంది. బజరంగ్ దళ్ మాజీ ప్రాంతీయ కన్వీనర్ వికాస్ త్యాగి ఫిర్యాదు మేరకు కలెక్టరేట్‌లోని సుమారు 315 చదరపు మీటర్ల స్థలం ఆక్రమణకు గురైందని అధికారులు తేల్చారు. అత్యంత సున్నితమైన ప్రభుత్వ స్థలంలో అక్రమంగా మసీదును నిర్మించడమే కాకుండా, కమర్షియల్ కార్యకలాపాలు సాగిస్తూ అద్దెలు వసూలు చేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై విచారణ జరిపిన సిటీ మేజిస్ట్రేట్ కోర్టు, ఆ నిర్మాణాన్ని అక్రమంగా నిర్ధారించి తొలగించాలని ఆదేశించడమే కాకుండా, ఆక్రమణదారులకు ఏకంగా 6.41 కోట్ల జరిమానా విధించింది. ముస్లిం పక్షం జిల్లా కోర్టుకు వెళ్లినా, ఆ పిటిషన్‌ను న్యాయ స్థానం కొట్టివేయడంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది.

ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణ ఎక్కడ జరిగినా, అది ఎంతటి ప్రభావవంతమైన వర్గానికి చెందినదైనా సరే ఉపేక్షించేది లేదని యోగి సర్కార్ పదేపదే స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం వంటి అత్యున్నత భద్రత ఉండాల్సిన ప్రభుత్వ ప్రాంగణంలోనే ఒక అక్రమ కట్టడం ఉండటం పాలనాపరమైన భద్రతకే సవాల్ అని ప్రభుత్వం భావించింది. అందుకే కోర్టు తీర్పు వెలువడిన వెంటనే, క్షణం ఆలస్యం చేయకుండా యోగి సర్కార్ బుల్డోజర్లతో నేరుగా కార్యాచరణలోకి దిగింది. సెప్టెంబర్ 5న మసీదు కూల్చివేసింది. 6న శిథిలాలను తొలగించే ప్రక్రియ ప్రారంభించారు. అప్పుడే బుల్డోజర్లకు పటిష్టమైన ఒక స్లాబ్ లాంటిది తగిలింది. దాన్ని కట్టర్లతో పగులగొట్టి చూడగా అధికారులే విస్తుపోయారు. మసీదు శిథిలాల కింద సుమారు 20 అడుగుల లోతు, ఒకటిన్నర మీటర్ల వెడల్పున్న ఒక పురాతన బావి కనిపించింది. సంప్రదాయ ఇటుకల నిర్మాణంతో ఉన్న ఈ బావి బయటపడటంతో అధికారులు అలర్ట్ అమయ్యారు. తదుపరి పనులను వెంటనే నిలిపివేసి, ఆ బావిపై ఇనుప రేకుల్తో కప్పేశారు. ఇక్కడే సీన్‌లోకి హిందూ సంఘాలు ఎంటరయ్యాయి.

ఈ బావి బయటపడటంతో వివాదం ఒక్కసారిగా మతపరమైన, చారిత్రక కోణంలోకి మళ్లింది. ఇది శతాబ్దాల నాటి పురాతన హిందూ ఆలయానికి సంబంధించిన అవశేషమేనని హిందూ సంఘాలు, ఫిర్యాదుదారు వికాస్ త్యాగి గట్టిగా వాదిస్తున్నారు. పూర్వం ఇక్కడ ప్రముఖ ఆలయం ఉండేదని, దాన్ని కూల్చివేసి ఆ స్థలంలో మసీదు నిర్మించారని, ఇప్పుడు బయటపడ్డ బావి ఆ వాదనకు తిరుగులేని సాక్ష్యమని వారు అంటున్నారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా క్షుణ్ణంగా తవ్వకాలు జరిపి సర్వే చేయిస్తే, మసీదు కింద ఇంకా ఎన్ని చారిత్రక, ఆలయ ఆనవాళ్లు ఉన్నాయో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, బావి బయటపడటంలో ఎటువంటి వింత లేదా చారిత్రక రహస్యం లేదని ముస్లిం పక్షం వాదిస్తోంది. గతంలో పైపుల ద్వారా నీటి సరఫరా లేని రోజుల్లో ప్రార్థనా మందిరాలు, వ్యవసాయ క్షేత్రాల్లో ఇలాంటి బావులు తవ్వడం సర్వసాధారణమని వాదిస్తున్నారు. నమాజ్ చేయడానికి ముందు ముఖం, కాళ్లు, చేతులు శుభ్రం చేసుకునే 'వజూ'ప్రక్రియ కోసమే ఆ రోజుల్లో ఈ బావి నీటిని ఉపయోగించేవారని చెబుతున్నారు.

ఈ మొత్తం వ్యవహారంపై సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్, సహారన్‌పూర్ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ యోగిపై విరుచుకుపడ్డారు. యూపీలో చట్టాన్ని తుంగలో తొక్కి చట్టరాహిత్య వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోర్ట్ తుది ప్రక్రియలు ముగియక ముందే, హైకోర్టుకు వెళ్లే సమయం కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రే మసీదును నేలమట్టం చేయడం దారుణమని విపక్షాలు మండిపడ్డాయి. మొత్తంగా.. ఎవరు ఎన్ని రకాలుగా విమర్శిస్తున్నా.. సీఎం యోగి మాత్రం తన నిర్ణయాల్లో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఒకవైపు చట్టబద్ధమైన పాలన, మరోవైపు అక్రమ నిర్మాణాలపై కఠిన వైఖరి అనే విధానాన్ని యోగి సర్కార్ పక్కాగా అమలు చేస్తోంది. కలెక్టరేట్ ప్రాంగణంలోనే అక్రమంగా ఉన్న నిర్మాణాన్ని కూల్చివేయడం ద్వారా.. ఆక్రమణలు ఎవరివైనా వదిలే ప్రసక్తే లేదనే బలమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపడంలో యోగి ప్రభుత్వం సఫలమైంది. ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

 

Published : 
  • 8 September 2026, 2:30 PM IST