వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం క్రికెట్ లో పెను సంచలనంగా నిలిచాడు. ఈ సీజన్ ఐపీఎల్ 2026 రాజస్తాన్ రాయల్స్ తరఫున ఓపెనర్ గా బరిలో దిగిన వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభతో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. కేవలం 15 ఏళ్లకే అంతర్జాతీయ బౌలర్లను చితక్కొడుతూ.. వారిని ముప్ప తిప్పలు పెడుతున్నారు. తనదైన స్టైల్లో అలవోకగా బౌండరీలు, సిక్సర్లు బాదుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో బ్యాట్ తో రెచ్చిపోయిన సూర్యవంశీ.. శతక్కొట్టాడు. కానీ ఇప్పుడిదే సెంచరీ మీద కొందరు ఆసక్తికర ఆరోపణలు చేస్తున్నారు.
సూర్యవంశీ చేసిన సెంచరీపై పాకిస్తాన్ క్రికెట్ అనలిస్ట్ నౌమన్ నియాజ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్యవంశీని ఒకసారి వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ పరీక్షిస్తే బాగుంటుందన్నారు. అతడి బుర్రలో ఏదైనా ఏఐ చిప్ ఇన్‌స్టాల్ చేశారా అనే దాని గురించి తెలుసుకోవడానికి అతడిని ల్యాబ్ కి పంపాలన్నారు. వైభవ్ మామూలు మనిషిలా అనిపించడం లేదన్నారు.నిజంగానే వైభవ్ సూర్యవంశీ ఒక అద్భుతమైన ప్లేయర్ అనీ కితాబిచ్చారు. సూర్యవంశీ 18 ఏళ్లు నిండకుండానే అతడి దేహదారుఢ్యం బలంగా కనిపిస్తోందనీ, రాబోయే సంవత్సరాల్లో వైభవ్ ఆటలో మరింత రాటు దేలడం ఖాయమన్నారు.
అగ్రశ్రేణి బౌలర్లందరినీ ఉతికారేస్తున్న వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లో ఏమైనా స్ప్రింగులున్నాయా లేక అతడి మెదడులో ఏఐ చిప్ పెట్టారా.. టీనేజ్ వయసులోనే ఇన్ని భారీ సిక్సర్లు ఎలా బాదుతున్నాడో తనకు అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే సూర్యవంశీ 8 మ్యాచులు ఆడగా.. 234 స్ట్రైక్‌రేట్‌తో 357 పరుగులు చేసి.. ఆరెంజ్ క్యాప్ రేసులో 2వ స్థానంలో ఉన్నాడు. అతడు ఇదే జోరు కొనసాగిస్తే.. ఈసారి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు. ప్రస్తుతం సూర్యవంశీ వయసు 15 ఏళ్లు. త్వరలోనే టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసే అవకాశముంది.