ఆసీస్ మహిళలదే వన్డే సిరీస్… రెండో వన్డేలోనూ భారత్ ఓటమి…!

ఆస్ట్రేలియా పర్యటనను ఘనంగా ఆరంభించిన భారత మహిళా క్రికెట్‌ జట్టు అదే జోరు కొనసాగించలేకపోయింది. టీ20 సిరీస్‌లో ఆతిథ్య జట్టుపై 2-1తో ఆధిపత్యం కనబరిచిన మన జట్టు వన్డే సిరీస్‌లో

Post Published By: dialnews
Updated : 28 February 2026, 2:55 PM IST

ఆస్ట్రేలియా పర్యటనను ఘనంగా ఆరంభించిన భారత మహిళా క్రికెట్‌ జట్టు అదే జోరు కొనసాగించలేకపోయింది. టీ20 సిరీస్‌లో ఆతిథ్య జట్టుపై 2-1తో ఆధిపత్యం కనబరిచిన మన జట్టు వన్డే సిరీస్‌లో మాత్రం మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను ఆసీస్‌కు సమర్పించుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో గెలిచిన ఆస్ట్రేలియా.. రెండో వన్డేలోనూ భారత్‌ను ఓడించింది. హోబర్ట్‌ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసింది.

ఓపెనర్లు ప్రతీకా రావల్‌ 52, స్మృతి మంధాన 31 రన్స్ తో శుభారంభం అందించగా.. జెమీమా రోడ్రిగ్స్‌ మాత్రం విఫలమైంది. అయితే కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అర్ద శతకంతో రాణించగా.. రిచా ఘోష్‌ 22, కశ్వీ గౌతం 25 పరుగులతో చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో భారత్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 251 పరుగులు మేర మెరుగైన స్కోరు సాధించింది. ఆసీస్‌ బౌలర్లలో అనాబెల్‌ సదర్లాండ్‌, అలనా కింగ్‌, ఆష్లే గార్డ్‌నర్‌ రెండేసి వికెట్లు కూల్చగా.. మేగన్‌ షట్‌, నికోలా క్యారీ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.ఇక లక్ష్య ఛేదనలో ఆసీస్‌ ఆరంభంలో తడబడినా.. 36.1 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది.

టాపార్డర్‌లో కెప్టెన్‌ అలిసా హేలీ విఫలమవగా మరో ఓపెనర్‌ ఫోబే లిచిఫీల్డ్‌, వన్‌డౌన్‌ బ్యాటర్‌ జార్జియా వోల్‌ అదరగొట్టారు. లిచిఫీల్డ్‌ 62 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్‌ బాది 80 పరుగులు చేయగా.. జార్జియా శతక్కొట్టింది. మొత్తంగా 82 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్స్‌ తో 101 పరుగులు చేసింది. మిగిలిన వారిలో బెత్‌ మూనీ 31 పరుగులు చేయగా.. అనాబెల్‌ విఫలమైంది. తర్వాత ఆష్లే​ గార్డ్‌నర్‌ 19 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టు విజయాన్ని పూర్తి చేసింది. భారత బౌలర్లలో కశ్వీ గౌతం, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీయగా.. క్రాంతి గాడ్‌కు ఒక వికెట్‌ దక్కింది. ఇక భారత్‌- ఆసీస్‌ మధ్య నామమాత్రపు మూడో వన్డే హోబార్ట్ వేదికగా ఆదివారం జరుగుతుంది. తర్వాత ఇరు జట్లు ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడతాయి.

Published : 
  • 28 February 2026, 2:55 PM IST