వుమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం వడోదర వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్ దూకుడైన బ్యాటింగ్, చిన్నెల్లే హెన్రీ, నందని శర్మ అసాధారణ బౌలింగ్ ప్రదర్శన ఢిల్లీకి విజయాన్ని అందించాయి. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 168 పరుగులు చేసింది. బెత్‌మూనీ 51 బంతుల్లో 6 ఫోర్లతో 62 రన్స్ తో రాణించగా.. జార్జియా వేర్‌హమ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఢిల్లీ బౌలర్లలో చిన్నెల్లే హెన్రీ మూడు వికెట్లు తీయగా.. నందని శర్మ రెండు వికెట్లు పడగొట్టింది. మిన్ను మణి ఒక వికెట్ తీసింది. తెలుగు తేజం శ్రీచరణి ఒక్క వికెట్ తీయలేకపోయింది.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 15.4 ఓవర్లలో 3 వికెట్లకు 169 పరుగులు చేసి మరో 28 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని కైవసం చేసుకుంది. లిజెల్లే లీ 24 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 43, షెఫాలీ వర్మ 21 బంతుల్లో 7 ఫోర్లతో 31 రన్స్ తో అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించారు. అనంతరం లారా వోల్వార్డ్ట్ 24 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 32 నాటౌట్ , జెమీమా రోడిగ్ర్స్ 23 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 41 మరింత దూకుడుగా ఆడారు. మూడో వికెట్‌కు 68 పరుగులు జోడించారు.
విజయానికి 9 పరుగుల దూరంలో జెమీమా ఔటవ్వగా.. మరిజన్నే కాప్ తో కలిసి లారా విజయలాంఛనాన్ని పూర్తి చేసింది. ఈ టోర్నీలో ఢిల్లీ ఫైనల్ చేరడం ఇది నాలుగోసారి. గత మూడు సీజన్లలో ఆ జట్టు ఫైనల్ చేరగా.. తృటిలో టైటిల్ మిస్సైంది.రెండు సార్లు ముంబై ఇండియన్స్, మరోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచింది. గురువారం జరిగే ఫైనల్లో మరోసారి ఆర్‌సీబీతో ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సారి ఎలాగైనా టైటిల్ అందుకోవాలనే కసితో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది.