ఐపీఎల్ 2026 సీజన్లో సీఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పుడు స్టేడియంలో అడుగుపెడతాడా అంటూ కోట్లాది మంది ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఎంఎస్ ధోనీ తన రీఎంట్రీపై జట్టు యాజమాన్యానికి కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. తాను పూర్తిగా ఫిట్నెస్ సాధించినప్పటికీ.. కేవలం తనను జట్టులోకి తీసుకోవడం కోసం ప్రస్తుతం బాగున్న జట్టు కాంబినేషన్‌ను పాడు చేయవద్దని ధోనీ జట్టు యాజమాన్యానికి స్పష్టం చేసినట్లు తెలిసింది. టీమ్ సమతుల్యత దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే ధోనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా ఎంఎస్ ధోనీ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనే ధోనీ బరిలోకి దిగుతాడని అందరూ భావించినప్పటికీ.. ధోనీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఆ మ్యాచ్‌లో చెన్నై 103 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ ధోనీ గాయంపై స్పందించాడు. పూర్తి ఫిట్ నెస్ సాధించాకే అతను బరిలోకి దిగుతాడన్నాడు. తాజాగా చెపాక్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కూడా ధోనీ ఆడలేదు.జట్టు కాంబినేషన్ ను డిస్టర్బ్ చేయొద్దనే ఉద్దేశంతోనే ఫిట్ గా ఉన్నా కూడా బెంచ్ పైనే ఉంటానని చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు ధోనీ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
చెన్నై జట్టు నుంచి ఆటగాడిగా ధోనీ తప్పుకున్నట్టేననీ, రిటైర్మెంట్ పై అధికారిక ప్రకటన మాత్రమే మిగిలిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ధోనీ లేని జట్టును అభిమానులకు పరిచయం చేసే ఉద్దేశంతోనే ఆడించడం లేదంటున్నారు. అదే సమయంలో టీమ్ బ్రాండ్ వాల్యూ కూడా దెబ్బతినకుండా ధోనీపై సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంటేఆడిన 7 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, 4 ఓటములతో ఆరు పాయింట్లు సాధించింది. జట్టు ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే ప్రతి మ్యాచ్ కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో ధోనీ వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు జట్టులో ఉండటం అవసరం. కానీ సీఎస్కే మేనేజ్ మెంట్ వ్యూహం ఏంటనేది తెలియడం లేదు.