ఐర్లాండ్ టూర్ లో చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీని ఆడించకపోవడం చర్చనీయాంశమైంది. ఐపీఎల్ లోనూ తర్వాత ట్రై సిరీస్ ఫైనల్లోనూ దుమ్మురేపడంతో బుడ్డోడి అంతర్జాతీయ అరంగేట్రం ఖాయమని అంతా అనుకున్నారు. పైగా ఐర్లాండ్ లాంటి చిన్న జట్టుపై వైభవ్ విధ్వంసం చూసేందుకు ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూసారు. కేవలం వైభవ్ సూర్యవంశీ కోసమే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. తీరా చూస్తే వైభవ్ ను తుది జట్టులోకి తీసుకోలేదు. రెండో మ్యాచ్ లోనైనా ఆడిస్తారని ఫ్యాన్స్ ఎదురుచూడగా అది కూడా జరగలేదు. అయితే వైభవ్ విషయంలో కోచ్ గంభీర్ పూర్తి క్లారిటీతోనే ఉన్నట్టు తెలుస్తోంది. బుడ్డోడి విషయంలో కంగారుపడకూడదని గంభీర్ భావిస్తున్నాడు.
వ్యూహాత్మకంగానే గంభీర్ వైభన్ సూర్యవంశీని ఆడించలేదు. విదేశీ పిచ్‌లు, స్వింగ్ పరిస్థితుల్లో నేరుగా ఆడించడం సరికాదనీ గంభీర్ చెబుతున్నాడు. ఒకవేళ అక్కడి పిచ్ లపై విఫలమైతే అది వైభవ్ ఆత్మవిశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించాడు. అతనికి సరైన సమయం వచ్చినప్పుడు అవకాశం ఇస్తామని కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా స్పష్టం చేశాడు.మరోవైపు భారత జట్టులో ఇప్పటికే సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, మరియు ఇషాన్ కిషన్ వంటి అనుభవజ్ఞులైన, ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు ఉన్నారు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో మరియు గత సిరీస్‌లలో వీరంతా అద్భుతంగా రాణించారు. కేవలం ఒక కొత్త ఆటగాడికి అవకాశం ఇవ్వడం కోసం ఫామ్ లో ఉన్న సీనియర్ ఆటగాళ్లను తప్పించడం సరైంది కాదని టీమ్ మేనేజ్‌మెంట్ భావించింది.
బెల్‌ఫాస్ట్‌లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో భారత జట్టుకు సరైన ప్రాక్టీస్ కూడా లేదు. విదేశీ పిచ్‌లు, స్వింగ్ అయ్యే పరిస్థితుల్లో తగినంత ప్రాక్టీస్ లేకుండా 15 ఏళ్ల వైభవ్ ను ఆడిస్తే అతను ఇబ్బంది పడే అవకాశముంది. ఇదే కారణంతో తుది జట్టులోకి తీసుకోలేదు. అయితే ఐర్లాండ్ చేతిలో 0-2తో సిరీస్ ఓడిపోయిన నేపథ్యంలో వైభవ్ కు అవకాశమిస్తే ఫలితం వేరేలా ఉండేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ముందున్న ఇంగ్లాండ్ కీలక సిరీస్, ఆసియా క్రీడల దృష్ట్యా భవిష్యత్తులో వైభవ్‌కు త్వరలోనే భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.