ఇంగ్లాండ్ తో సెమీ ఫైనల్ యుద్ధం… ఆ నలుగురినీ కట్టడి చేయాల్సిందే…!

టీ20 ప్రపంచకప్ 2026 రసవత్తర దశకు చేరుకుంది. మార్చి 5వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న రెండో సెమీఫైనల్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి.

Post Published By: dialnews
Updated : 4 March 2026, 6:19 PM IST

టీ20 ప్రపంచకప్ 2026 రసవత్తర దశకు చేరుకుంది. మార్చి 5వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న రెండో సెమీఫైనల్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. గ్రూప్ దశలో తడబడినప్పటికీ, సూపర్-8 రౌండ్‌లో అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్ సెమీస్‌కు దూసుకొచ్చింది. 2024 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ పట్టుదలతో ఉంది. జోస్ బట్లర్ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నా, జట్టులోని ఇతర కీలక ఆటగాళ్లు ఫామ్‌లోకి రావడం భారత్‌కు ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా నలుగురు ఆటగాళ్లు టీమ్ ఇండియా ట్రోఫీ కలను ముక్కలు చేసే అవకాశం ఉంది.

ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫామ్‌లో ఉన్నాడు. సూపర్-8 దశలో పాకిస్థాన్‌తో జరిగిన కీలక పోరులో బ్రూక్ అద్భుత సెంచరీతో చెలరేగి జట్టును గెలిపించాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లాడిన అతను 161 స్ట్రైక్ రేట్‌తో 228 పరుగులు సాధించాడు. ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల సామర్థ్యం బ్రూక్‌కు ఉంది. మిడిల్ ఓవర్లలో భారత స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోగల ఆటగాడు కావడంతో, అతని వికెట్ తీయడం టీమ్ ఇండియాకు అత్యంత కీలకం కానుంది.ఓపెనర్ ఫిల్ సాల్ట్ తన మెరుపు బ్యాటింగ్‌తో పవర్ ప్లేలో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడటంలో దిట్ట. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో సాల్ట్ 125 పరుగులు మాత్రమే చేసినప్పటికీ, అతని డేంజర్ లెవల్ తక్కువ కాదు. ఇంగ్లాండ్‌కు గనుక సాల్ట్ శుభారంభాన్ని అందిస్తే, భారీ స్కోరు సాధించడం వారికి సులభమవుతుంది.

భారత పేసర్లు ఆరంభంలోనే సాల్ట్‌ను కట్టడి చేయకపోతే వాంఖడే వంటి చిన్న స్టేడియంలో పరుగుల వరద పారడం ఖాయం.లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌కు భారత బ్యాటర్ల బలహీనతలు బాగా తెలుసు. టీ20 ఫార్మాట్‌లో భారత్‌పై రషీద్ రికార్డు అత్యద్భుతంగా ఉంది. అతను టీమ్ ఇండియాపై కేవలం 7.50 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. భారత్-ఇంగ్లాండ్ టీ20 పోరులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రషీద్ మూడో స్థానంలో ఉన్నాడు. 18 అంతర్జాతీయ టీ20ల్లో అతను 14 మంది భారత బ్యాటర్లను అవుట్ చేశాడు.

ఈ ప్రపంచకప్‌లో భారత బ్యాటర్లు స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతుండటం రషీద్‌కు కలిసివచ్చే అంశం.యంగ్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ ఈ టోర్నీలో ఇంగ్లాండ్ జట్టుకు ప్రధాన బలంగా మారాడు. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ అతను అద్భుతాలు చేస్తున్నాడు. ఇప్పటివరకు 7 మ్యాచ్‌ల్లో 176 స్ట్రైక్ రేట్‌తో 191 పరుగులు చేసిన జాక్స్, బౌలింగ్‌లో 7 వికెట్లు పడగొట్టాడు. అతని ఆఫ్ స్పిన్ బౌలింగ్ భారత బ్యాటర్లకు ఒక సవాల్‌గా మారనుంది. ముఖ్యంగా వాంఖడే పిచ్‌పై విల్ జాక్స్ తన వేగవంతమైన స్పిన్‌తో ప్రభావం చూపే అవకాశం ఉంది.భారత జట్టు సెమీఫైనల్లో గెలవాలంటే ఈ నలుగురు ఆటగాళ్లకు ప్రత్యేక వ్యూహాలు రచించాల్సి ఉంటుంది.

Published : 
  • 4 March 2026, 6:19 PM IST