Top story: ఒక గెలుపు….10 లోపాలు…! ఇలా అయితే ఫైనల్లో కష్టమే…!

సెమీ ఫైనల్లో గెలిచాం...ఇంగ్లాండ్‌పై విజయం సాధించాం...కానీ...గెలిచాం అంటే గెలిచాం అంతే. చచ్చీ చెడీ గెలిచాం. మనస్ఫూర్తిగా విజయాన్ని ఆస్వాదించలేకపోతున్నాం

Post Published By: dialnews
Updated : 9 March 2026, 2:17 PM IST

సెమీ ఫైనల్లో గెలిచాం...ఇంగ్లాండ్‌పై విజయం సాధించాం...కానీ...గెలిచాం అంటే గెలిచాం అంతే. చచ్చీ చెడీ గెలిచాం. మనస్ఫూర్తిగా విజయాన్ని ఆస్వాదించలేకపోతున్నాం. అంత పెద్ద స్కోరును కూడా కాపాడుకోలేక అవస్థలు పడ్డామెందుకు? ఎన్ని తప్పులు చేశారా? ఎన్ని లోపాలు వెంటాడాయి? మరి ఫైనల్లో కూడా ఇలాగే ఆడితే పరిస్థితి ఏంటి? సరిదిద్దుకోవాల్సిన లోపాలేంటి?సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ ముందు భారత్ నిర్దేశించిన టార్గెట్ 254 పరుగులు. టీ 20లో ఇంత పెద్ద లక్ష్యాన్ని చేధించడం అంత సులువు కాదు. కానీ ఇంగ్లాండ్ బ్యాటర్లు దుమ్మురేపారు. మన బౌలర్లను ఒకరకంగా చీల్చి చెండాడారు. మొదట్లో అసాధ్యంలా కనిపించిన చేజింగ్‌ను, ఒకానొక దశలో ఇంగ్లాండ్‌ సులువుగానే పూర్తి చేస్తుందేమోనని అందరి మదిలో గింగిరాలు తిరిగింది.

బుమ్రా 18వ ఓవర్‌ వేయడానికి ముందు విజయంపై వుండాల్సినంత కాన్ఫిడెన్స్ లేదు. ఓటమి భయం వెంటాడింది. మన బౌలింగ్‌ లోపాలను ఈ మ్యాచ్‌ మరోసారి బయటపెట్టింది. ఒక్క బుమ్రా తప్ప, మిగతావారంతా రన్స్ సమర్పించుకోవడంలో పోటీ పడ్డారు. సరైన బౌలింగ్‌ ప్రత్యామ్నాయం కనిపించక, ఎవరికి ఓవర్‌ ఇస్తే ఏమవుతుందోనన్న టెన్షనే కనిపించింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి దారుణంగా విఫలమయ్యాడు. మిస్టరీ స్పిన్నర్‌గా అందరూ మెచ్చుకున్నా, టోర్నీలో మాత్రం తేలిపోయాడు. సెమీస్‌లో మరీ దారుణంగా బంతులు విసిరాడు. 4 ఓవర్లలో ఏకంగా 64 పరుగులు సమర్పయామీ అనేశాడు. ఏమాత్రం ఫామ్‌లో లేని బట్లర్‌ను బౌల్డ్‌ చేయడం తప్పితే, అతని బౌలింగ్‌ లో పస కనిపించలేదు.

వరుణ్ బంతి వెయ్యడానికి రావడమే ఆలస్యం, క్రీజులోకి వచ్చిన బెతెల్‌ వరుసగా మూడు సిక్సర్లు ఉతికి ఆరేశాడు. ఇదే ఊపులో మిగతా బౌలర్లనూ చీల్చి చెండాడాడు. అక్షర్ పటేల్ కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. అర్ష్‌దీప్‌ అప్పుడప్పుడూ పదునైన బంతులు విసిరినా, పెద్ద ఎత్తున వైడ్లు వేశాడు. ఈజీగా షాట్లు కొట్టే బంతులు వేసి, పరుగులు సమర్పించుకున్నాడు. బుమ్రా ఒక్కడు చివరి రెండు ఓవర్లలో సూపర్ బౌలింగ్ వేసి, మ్యాచ్‌ను గెలిపించాడు కానీ, వీరిని నమ్ముకుని వుంటే మ్యాచ్‌పై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి.ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో ఏకంగా 13 ఎక్స్‌ట్రాలు వేశారు మన బౌలర్లు. అందులో వైడ్లు 10. టీమిండియాను ఆదుకునే నమ్మకదగ్గ మరో బౌలర్ లేడని ఈ మ్యాచ్‌ తేల్చింది.

ఇక ఫైనల్లో భారత్ తలపడబోయేది న్యూజిల్యాండ్‌తో. ఈ జట్టులో ఓపెనర్లు ఫిన్‌ అలెన్, టిమ్‌ సీఫర్ట్‌ సహా చాలామంది పించ్‌ హిట్టర్స్ వున్నారు. బంతిని ఎలా వేసినా బౌండరీ తరలించే సత్తా వీరికుంది. వీరిని మన బౌలర్లలో ఎవరు అడ్డుకుంటారన్నది అర్థంకావడం లేదు. వరుణ్‌ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతుండటంతో అతని ప్లేస్‌లో కుల్‌దీప్‌ను ఎంచుకోవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు.ఇక మన బ్యాటర్ల కథే వేరు.

ఒక్క సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ తప్ప....మిగతా వారంతా మెరుపుతీగలా వచ్చిపోతున్నారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతున్నా, ఎందుకు తుది జట్టులో వుంచుతున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్ని అవకాశాలు ఇచ్చినా, ఏమాత్రం బాధ్యత లేకుండా క్యాచ్‌లు ఇచ్చి పెవిలియన్‌కు వెళ్లిపోతున్నాడు. త్వరగా ఓపెనింగ్ వికెట్ పడిపోతుండటంతో తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి పెరుగుతోంది. ఫైనల్‌లోనైనా అభిషేక్ ఆడాలని అందరూ కోరుకుంటున్నారు.ఇలా అటు బౌలర్లు, ఇటు బ్యాటర్లు సమిష్టిగా ఆడితేనే ఫైనల్‌లో కివీస్‌ను ఓడించగలం.

 

Published : 
  • 8 March 2026, 10:10 PM IST