విదేశీ పిచ్ లపై కూడా అదే వ్యూహమా? గంభీర్ పై విమర్శల వెల్లువ..!

ఇంగ్లాండ్ మూడో టీ ట్వంటీలో కేవలం 76 పరుగుకే ఆలౌటయ్యి.. 125 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం అనేది కేవలం ఓ సాధారణ వైఫల్యం కాదు. ఇది టీమిండియా క్రికెట్ చరిత్రలోనే ఓ తీరని అవమానంగా మిగిలిపోయింది.

Post Published By: dialnews
Updated : 10 July 2026, 11:36 AM IST

ఇంగ్లాండ్ మూడో టీ ట్వంటీలో కేవలం 76 పరుగుకే ఆలౌటయ్యి.. 125 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం అనేది కేవలం ఓ సాధారణ వైఫల్యం కాదు. ఇది టీమిండియా క్రికెట్ చరిత్రలోనే ఓ తీరని అవమానంగా మిగిలిపోయింది. జట్టును మారుస్తామనే నెపంతో టీమిండియా తప్పుడు దిశలో పయనిస్తోందా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక జట్టులో సరికొత్త మార్పులు, యువ ప్లేయర్లకు పెద్దపీట వేయడం శరవేగంగా జరిగింది. అయితే జట్టులో మార్పులు ఎంత వేగంగా వచ్చాయో.. అంతే వేగంగా సీనియర్ల అనుభవం దూరం అయిపోయింది. దీనివల్ల కష్ట సమయాల్లో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే, ఒత్తిడిని తట్టుకుని మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లే బ్యాటర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్ జట్టుతో మ్యాచ్‌లో ప్రారంభంలోనే వికెట్లు పడటంతో మిగతా బ్యాటింగ్ లైనప్ అంతా పేకమేడలా కుప్పకూలిపోయింది.

టీమిండియా కొత్తగా అగ్రెసివ్ క్రికెట్‌ను తన స్టైల్‌గా మార్చుకుంది. ఇందులో తప్పులేదు.. కానీ ప్రతి పిచ్, ప్రతి బౌలర్, ప్రతి పరిస్థితి ఒకేలా ఉండవు. ఇంగ్లాండ్‌లోని బౌన్స్, సీమ్ మూమెంట్ ఉండే పిచ్‌లపై కూడా టీమిండియా బ్యాటర్లు ఫ్లాట్ వికెట్లపై ఆడినట్లే ఆడారు. వికెట్లు పడుతున్నా తమ వ్యూహాన్ని మార్చుకోలేదు. క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయలేదు. ఫలితంగా కేవలం 11.4 ఓవర్లలోనే జట్టు మొత్తం పెవిలియన్ చేరాల్చి వచ్చింది. గత కొన్ని నెలల ఫలితాలను గమనిస్తే ఓ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆరంభంలోనే షాకులు తగిలితే టీమిండియా పుంజుకోవడానికి బదులు మరింత వేగంగా చేతులెత్తేస్తోంది. భాగస్వామ్యాలు నెలకొల్పాలనే ఓపిక బ్యాటర్లలో కనిపించడం లేదు. కంగారులో వికెట్లు పారేసుకోవడం అలవాటుగా మారిపోయింది. అందుకే పరాజయాలు సాధారణంగా ఉండట్లేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ఘోరమైన రికార్డులను మూటగట్టుకునేలా చేస్తున్నాయి.

స్టేడియంలో కోచ్ బ్యాటింగ్ చేయడు లేదా క్యాచ్‌లు వదిలేయడు. కానీ జట్టు ఏ మైండ్‌సెట్‌తో, ఎలాంటి వ్యూహంతో బరిలోకి దిగుతుందనేది కోచింగ్ స్టాఫ్ బాధ్యతే. గౌతమ్ గంభీర్ పదవి కాలంలో ఒకే రకమైన తప్పులు పదే పదే రిపీట్ అవుతున్నాయి. విదేశీ పిచ్‌లపై బ్యాటింగ్ తడబడటం, స్పిన్‌ను ఎదుర్కోవడంలో విఫలం కావడం, ఒత్తిడిలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం చూస్తుంటే వ్యూహాల్లో లోపాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.ఈ ఘోర పరాజయాలకు కేవలం గౌతమ్ గంభీర్ ఒక్కడే బాధ్యుడు కాడు. కెప్టెన్, ఆటగాళ్లు, సెలెక్టర్లకు కూడా ఇందులో సమాన భాగస్వామ్యం ఉంది. అయితే దశాబ్ధాల కాలంలో ఎన్నడూ లేని ప్రతికూల రికార్డులు ఒకే కోచ్ హయాంలో వరుసగా వస్తున్నప్పుడు ప్రశ్నలు తలెత్తడం సహజం. హెడ్ కోచ్ ప్రతిభను కేవలం గెలుపోటములతోనే కాకుండా జట్టు ఒత్తిడిలో ఎలా స్పందిస్తుంది. కష్టాల నుంచి ఎంత త్వరగా బయటపడుతుందనే విషయాల ఆధారంగా అంచనా వేస్తారు. ప్రస్తుతానికి టీమిండియా ఈ రెండు విషయాల్లో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది.

Published : 
  • 10 July 2026, 11:36 AM IST