భారత టీ20 జట్టులో సంజూ శాంసన్‌కు చోటు దక్కకపోవడంపై మరోసారి సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. బీసీసీఐ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సంజూ శాంసన్‌ను నిలకడలేని ప్రదర్శన కారణంగానే పక్కన పెట్టారని అభిమానులు పేర్కొంటూ, అందుకు విరుద్ధంగా గణాంకాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. సంజూ శాంసన్ చివరి పది ఇన్నింగ్స్‌లో చేసిన పరుగులను, మరో ముగ్గురు బ్యాటర్లు ఇషాన్ కిషన్ , తిలక్ వర్మ, అభిషేక్ శర్మ చేసిన పరుగులను పోల్చి చూస్తూ గంభీర్ పై మండిపడుతున్నారు. ఈ గణాంకాలను ఉదహరిస్తూ అసలు నిలకడ లేని బ్యాటర్ ఎవరని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
సంజూ శాంసన్‌కు పెద్ద ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం ఉందని, ఒకసారి క్రీజులో నిలదొక్కుకుని 30 పరుగుల మార్క్ దాటితే అతడు భారీ స్కోరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, సంజూ పెద్ద స్కోర్లు చేసిన మ్యాచ్‌ల్లో భారత జట్టు విజయాలు కూడా ఎక్కువగా వచ్చాయని పోస్టుల్లో పేర్కొంటున్నారు.ఇతర బ్యాటర్లు ఒక మ్యాచ్‌లో రాణించి, తర్వాత వరుసగా విఫలమవుతున్నారని వాదిస్తున్నారు.
అలాంటి పరిస్థితుల్లో సంజూ శాంసన్‌ను మాత్రమే 'నిలకడలేని ఆటగాడి'గా పరిగణించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో భారత బ్యాటింగ్ వైఫల్యాల నేపథ్యంలో ఈ చర్చ మరింత ఊపందుకుంది. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని జట్టు యాజమాన్యం సంజూ శాంసన్ విషయంలో మరోసారి పునరాలోచించాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. కాగా, తాజగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2తో వెనుకపడిపోయింది. సిరీస్‌లో నిలవాలంటే బ్రిస్టల్‌లో జరగనున్న నాలుగో టీ20లో భారత్ తప్పనిసరిగా విజయం సాధించాలి.