నన్ను టీ20 ప్లేయర్ లా చూడలేదు… కెఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు…!

ఢిల్లీ క్యాపిట‌ల్స్ వికెట్ కీప‌ర్ కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ సెలక్షన్ కమిటీపై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. తనను టీ20 క్రికెటర్ లా ఎప్పుడూ చూడకపోవడం బాధ కలిగించిందన్నాడు.

Post Published By: dialnews
Updated : 6 May 2026, 7:50 PM IST

ఢిల్లీ క్యాపిట‌ల్స్ వికెట్ కీప‌ర్ కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ సెలక్షన్ కమిటీపై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. తనను టీ20 క్రికెటర్ లా ఎప్పుడూ చూడకపోవడం బాధ కలిగించిందన్నాడు. టీ20 క్రికెట్‌లో త‌న‌కు ప‌రిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉండేవి కావ‌ని తెలిపాడు. బీసీసీఐ త‌న‌ను టీ20 క్రికెట్‌లో ఎప్పుడూ ఆట‌గాడిగా ప‌రిగ‌ణించ‌లేదని, కేవ‌లం ఒక టెస్టు ప్లేయ‌ర్‌గానే త‌న‌పై ముద్ర వేశారంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. జియో హాట్‌స్టార్‌కు చెందిన సూప‌ర్‌స్టార్స్ షోలో కేఎల్ రాహుల్ మాట్లాడాడు. ప‌దేళ్ల క్రితం టీ20 జ‌ట్టులో భాగం కావ‌డానికి ఎంతో ప్ర‌య‌త్నించాననీ, కానీ తనను ఎప్పుడూ ఒక టీ20 ఆట‌గాడిగా ప‌రిగ‌ణించ‌లేదన్నాడు. క‌నీసం ఒక మంచి వైట్‌బాల్ ఆట‌గాడిగా కూడా చూడ‌లేదన్నాడు. కేవ‌లం ఒక టెస్టు ప్లేయ‌ర్‌గానే తనపై ముద్ర‌ను వేశారనీ రాహుల్ వ్యాఖ్యానించాడు.

అయితే ఐపీఎల్‌ ద్వారా టెస్టు ప్లేయ‌ర్ అనే ముద్ర నుంచి బ‌య‌ట‌ప‌డ్డానని తెలిపాడు. వైట్‌బాల్ క్రికెట్‌లో ఆట‌ను మ‌రింత మెరుగుప‌రుచుకొని ఇవాళ ఈ స్థాయికి చేర‌డం గ‌ర్వంగా ఉందన్నాడు అయితే ఈ ప్ర‌యాణంలో ఎన్నో త‌ప్పులు చేసిన‌ప్ప‌టికీ వాటిని సరిదిద్దుకునే ప్ర‌య‌త్నం కూడా చేశాననీ చెప్పుకొచ్చాడు జ‌ట్టుకు ఆడిన‌ప్పుడ‌ల్లా సాధ్య‌మైనంత వ‌ర‌కు అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉంటానన్నాడు. ఫ‌లితంతో సంబంధం లేకుండా తన ఆట‌ను తాను ఆడుకుంటూ స‌మ‌తుల్యంగా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉంటానన్నాడు.తన వంతుగా జ‌ట్టుకు త‌ర‌ఫున మ్యాచ్‌లు ఆడుతూ స్కోర్లు చేయ‌డం ల‌క్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించాడు.

ఇక గ‌తేడాది తండ్రి కావ‌డం సంతోషాన్ని ఇచ్చిందనీ, ఈ కొత్త పాత్ర తన క్రికెట్ కెరీర్‌కు కూడా ఎంతో స‌హాయ‌ప‌డిందన్నాడు. కేఎల్ రాహుల్ ప్ర‌స్తుతం ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌ఫున ఆడుతున్నాడు. సూప‌ర్‌ఫామ్‌లో ఉన్న రాహుల్ ఈ సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఓట‌మి పాలైన‌ప్ప‌టికీ 64 బంతుల్లోనే 152 ప‌రుగులతో రికార్డు సృష్టించాడు. అంతేకాదు సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌ఫున కేఎల్ రాహుల్ 9 మ్యాచ్‌ల్లో 433 ప‌రుగులు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో రాహుల్ రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. 2022లో టీమిండియా త‌ర‌ఫున చివ‌రి టీ20 మ్యాచ్ ఆడిన రాహుల్ అప్ప‌టినుంచి కేవ‌లం టెస్టులు, వ‌న్డేల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యాడు.

Published : 
  • 6 May 2026, 7:50 PM IST