పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ క్రికెటర్లకు భారీ షాకిచ్చింది. టీ20 ప్రపంచకప్ లో విఫలమైన ఆటగాళ్ళపై కఠిన చర్యలకు సిద్ధమైంది. బాగా ఆడినపుడు రివార్డులు తీసుకున్నట్లే.. చెత్త ప్రదర్శన కనబరిచినప్పుడు జరిమానా కట్టాల్సిందేనని అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మెగాటోర్నీలో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన పాక్ జట్టు తర్వాత చిన్న జట్లపై గెలిచి సూపర్ 8లోకి వచ్చింది. అయితే ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయి, తర్వాత లంకపై గెలిచినా రన్ రేట్ లేకపోవడంతో ఇంటిదారి పట్టింది.గత ఎడిషన్‌లోనూ పాక్ సెమీస్ చేరకుండా లీగ్ దశలోనే నిష్క్రమించింది.
ఈసారి సూపర్-8కు చేరినా.. సెమీస్ రేసులో మాత్రం వెనుబడిపోయి తీవ్రంగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ తమ జట్టుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దీంతో విఫలమైన ఆటగాళ్లకు భారీ జరిమానా విధించినట్టు తెలుస్తోంది. ఒక్కో ఆటగాడికీ పాక్ కరెన్సీలో యాభై లక్షల రూపాయలు జరిమానా విధించనున్నట్లు సమాచారం. పీసీబీ వార్షిక కాంట్రాక్టులో అత్యధిక వేతనం అందుకుంటున్న ఆటగాళ్లకు జరిమానా ఇంకాస్త ఎక్కువే ఉండవచ్చని పాక్ క్రికెట్ బోర్డు వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం చూస్తే బాబర్ అజామ్ , షాహీన్ అఫ్రిది, రిజ్వాన్ వంటి ప్లేయర్స్ మరింత ఎక్కువ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే త్వరలో పాక్ టీ20 జట్టుకు సంబంధించి భారీ ప్రక్షాళన జరగడం ఖాయమైంది.
బాబర్ అజామ్, కెప్టెన్ సల్మాన్ అఘాతో పాటు షాహీన్ అఫ్రిది వంటి ఆటగాళ్లకు టీ20 జట్టులో ఇకపై చోటు దక్కడం కష్టమేనని భావిస్తున్నారు. ఈ మెగా టోర్నీలో వీరెవ్వరూ స్థాయికి తగినట్టు ఆడలేకపోయారు.బాబర్ అజామ్, షాహీన్ అఫ్రిది, కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, ఉస్మాన్ ఖాన్ తదితరులకు అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని పీసీబీ వర్గాలు చెబుతున్నాయి. కాగా గ్రూప్ దశలో నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలిచిన పాకిస్తాన్ జట్టు సూపర్ 8కు చేరుకుంది. కానీ సూపర్ 8లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి చవిచూసింది.. దీంతో సెమీఫైనల్ ఆశలు నిలుపుకోవాలంటే శ్రీలంకను 147 పరుగులకే కట్టడి చేయాల్సిన పరిస్థితి ఉండగా కేవలం 5 పరుగుల తేడాతో గెలిచినా సెమీస్ నుంచి ఔట్ అయింది.