భారత్‌తో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న బాయ్‌కాట్ నిర్ణయం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి , పాకిస్తాన్ బోర్డు, బంగ్లాదేశ్ బోర్డు మధ్య లాహోర్‌లో జరిగిన త్రైపాక్షిక సమావేశం తర్వాత ఈ అంశం నేరుగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ టేబుల్‌పైకి వెళ్లింది.ఈ సమావేశం అనంతరం పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ ప్రధాని షరీఫ్‌ను కలవనున్నట్లు సమాచారం. ఆ భేటీ తర్వాతే భారత్‌తో మ్యాచ్‌పై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఈ మ్యాచ్‌కు వారం కూడా సమయం లేకపోవడంతో, ఇక ఆలస్యం జరిగితే అభిమానులు, నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.
ఐసీసీ మాత్రం ఇప్పటికే పాకిస్తాన్ సంతకం చేసిన మెంబర్స్ పార్టిసిపేషన్ అగ్రిమెంట్ ప్రకారం మ్యాచ్ ఆడాల్సిందేనని స్పష్టంగా తెలిపింది. 2024 డిసెంబర్‌లో కుదిరిన హైబ్రిడ్ మోడల్ ఒప్పందం ప్రకారం భారత్-పాక్ మ్యాచ్‌లు న్యూట్రల్ వేదికలలో నిర్వహించేందుకు అంగీకారం ఉంది.ఈ నేపథ్యంలో పీసీబీ, బంగ్లాదేశ్ బోర్డు కలిసి భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్ పునరుద్ధరణ, ద్వైపాక్షిక సిరీస్ నిర్వహణ వంటి డిమాండ్లను ఐసీసీ ముందు ఉంచాయి. అయితే భారత్‌కు సంబంధించిన ద్వైపాక్షిక సిరీస్‌లపై నిర్ణయం తీసుకునే అధికారం పూర్తిగా బీసీసీఐ చేతిలోనే ఉందని ఐసీసీ స్పష్టం చేసింది.
ప్రస్తుతం భారత్-బంగ్లాదేశ్ మధ్య సెప్టెంబర్‌లో సిరీస్ షెడ్యూల్ అయినప్పటికీ, రెండు దేశాల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా దానిపైనా అనుమానాలు నెలకొన్నాయి. ఈ చర్చల్లో ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా లాహోర్‌లో పాల్గొనగా, యూఏఈ ప్రతినిధి ముబాషిర్ ఉస్మానీ ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారు. ముఖ్యమైన చర్చలు దుబాయ్, ముంబై కేంద్రంగా జరిగాయని సమాచారం. ఈ వివాదం వల్ల ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులు, ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నవారు అయోమయంలో ఉన్నారు. త్వరలోనే ప్రభుత్వ ఆమోదంతో ఈ సమస్యకు ముగింపు పడే అవకాశం ఉందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు ఉండే అవకాశాలు మెరుగయ్యాయని పాక్ మీడియా కూడా పేర్కొంది. దీనిపై 24 గంటల్లో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.