టీ20 వరల్డ్‌కప్ 2026కు ముందు టీమిండియాలో చోటు కోసం ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి పడింది. ముఖ్యంగా వికెట్ కీపర్-బ్యాటర్ సంజూ శాంసన్‌పై ప్రస్తుతం భారీగా విమర్శలు వినిపిస్తున్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ భారత జట్టుకు వరల్డ్‌కప్ ముందు చివరి పరీక్షగా మారింది. అయితే ఈ సిరీస్‌లో సంజూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఐదు మ్యాచ్‌ల్లో మొత్తం 46 పరుగులకే పరిమితమయ్యాడు. అంతకు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.ఈ ప్రదర్శనతో సంజూ స్థానం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణిస్తూ తన స్థానం మరింత బలపర్చుకున్నాడు. చివరి మ్యాచ్‌లో 103 పరుగులతో సెంచరీ సాధించి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రదర్శనతో జట్టులో తన చోటును దాదాపు ఖరారు చేసుకున్నాడు. ఇషాన్‌కు భారీ ప్రశంసలు అందుతుండగా, సంజూపై విమర్శలు పెరిగాయి. అవకాశాలను సరిగా వినియోగించుకోలేకపోయాడనే అభిప్రాయం క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం వరల్డ్‌కప్ జట్టులో ఇషాన్‌కు ప్రాధాన్యం దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇలాంటి సమయంలో సంజూ భార్య చారులత రమేశ్ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడయితే అంతా ముగిసిపోతుందో.. అప్పుడు తల వంచుకుని జీవితాన్ని స్వీకరించాలి. కొన్ని సందర్భాల్లో వివరణ ఇవ్వడం కంటే అంగీకరించడమే ముఖ్యం అని ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంజూ ఎదుర్కొంటున్న ఒత్తిడికి ఇది పరోక్ష మద్దతుగా అభిమానులు భావిస్తున్నారు.వాస్తవానికి మొదట టీ20 వరల్డ్‌కప్ కోసం ఎంపికైన జట్టులో సంజూకు ప్రధాన వికెట్‌కీపర్‌గా స్థానం దక్కింది.
ఇషాన్‌ను బ్యాకప్‌గా మాత్రమే ఎంపిక చేశారు. అయితే గాయం కారణంగా తిలక్ వర్మ దూరమవ్వడంతో ఇషాన్‌కు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఇషాన్ పూర్తిగా ఉపయోగించుకున్నాడు. నెంబర్ 3లో బ్యాటింగ్ చేస్తూ ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ సాధించాడు అంతేకాకుండా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా అద్భుతంగా రాణించి జార్ఖండ్‌కు టైటిల్ అందించాడు.ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్ ముందు ఇప్పుడు కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వరల్డ్‌కప్‌కు ముందు ఎవరి మీద నమ్మకం ఉంచాలన్నది కీలకంగా మారింది. ఇక రాబోయే రోజుల్లో సంజూ తన ఫామ్‌ను తిరిగి సంపాదించుకుంటాడా లేక ఇషాన్‌కే పూర్తి అవకాశాలు దక్కుతాయా అన్నది ఆసక్తిగా మారింది.