ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. శనివారం రాత్రి రెండో టీ20 జరగనుంది. ఐర్లాండ్‌తో సిరీస్ పరాజయం అనంతరం ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌లో మెరుగ్గా బ్యాటింగ్ చేసిన భారత్.. రెండో మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలనుకుంటుంది. అయితే తొలి టీ20కి కూడా దూరంగా ఉన్న టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ రెండో మ్యాచ్ ఆడటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి వంటి మాజీ క్రికెటర్లు వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోవాలని సూచిస్తుండగా.. టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం సీనియర్ ఆటగాళ్లకు అండగా ఉండాలనే ఉద్దేశంతో అతని అరంగేట్రాన్ని ఆలస్యం చేస్తోంది.
మరోవైపు మూడు మ్యాచ్‌ల్లో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ దారుణంగా విఫలమయ్యారు. ఈ ఇద్దరిలో ఒకరికి విశ్రాంతి ఇచ్చి వైభవ్ సూర్యవంశీని ఆడించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.కానీ ప్రపంచకప్ గెలిచిన ఆటగాళ్లను 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కోసం పక్కనపెడితే యువ ఆటగాళ్లకు తప్పుడు సందేశం అందుతుందనే భావనలో మేనేజ్మెంట్ ఉంది. దాంతోనే ఇంకొన్ని మ్యాచ్‌ల వరకు వైభవ్‌ను బెంచ్‌పైనే కూర్చోబెట్టాలనే ఆలోచన చేస్తోంది. రెండో టీ20లోనూ వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కకపోతే వాటర్ బాయ్‌గానే జట్టుకు సేవలందించనున్నాడు.ఒకవేళ అరంగేట్రానికి అవకాశం ఇస్తే మాత్రం.. సంజూ శాంసన్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి.
మిగతా కాంబినేషన్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. ఓపెనర్లుగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మ బరిలోకి దిగనుండగా.. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే మిడిలార్డర్లో ఆడనున్నారు.అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. మిగతా బ్యాటర్లు సత్తా చాటాల్సి ఉంది. హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తీ, అక్షర్ పటేల్ స్పిన్ బౌలర్లుగా బరిలోకి దిగనున్నారు. ఎక్స్ట్రా పేసర్‌ను ఆడించాలనుకుంటే రవి బిష్ణోయ్ ప్లేస్‌లో ప్రిన్స్ యాదవ్ బరిలోకి దిగుతాడు. ఇదిలా ఉంటే రెండో టీ20కి కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే మ్యాచ్ రదయ్యే పరిస్థితి ఉండదని , మధ్య మధ్యలో వరుణుడు అంతరాయం కలిగించే అవకాశముందని చెబుతున్నారు.