టాలీవుడ్లో ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరోలుగా పేరొందిన కొందరు స్టార్స్.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాలు రాబట్టలేక సతమతమవుతున్నారు. ఆడియన్స్ అభిరుచి మారుతున్న కొద్దీ, రొటీన్ కంటెంట్‌ను తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలో గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాల్సిన ఐదుగురు హీరోలు, వాళ్ళ ప్రస్తుత పరిస్థితిపై ఒక లుక్ వేద్దాం. అందులో ముందుగా ఉస్తాద్ రామ్ పోతినేని గురించి మాట్లాడదాం. రామ్ అంటేనే ఎనర్జీకి మారుపేరు. అయితే ఆయన గత కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. ఆడియన్స్ ఇప్పటికే ఆయన రొటీన్ మాస్ కథలకు తగినన్ని అవకాశాలు ఇచ్చారని.. ఇకనైనా కొత్తగా ట్రై చేయకపోతే కష్టమని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. రామ్ తన తదుపరి చిత్రంతో కేవలం మాస్ ఆడియన్స్‌నే కాకుండా, సాధారణ ప్రేక్షకులను కూడా మెప్పించే బలమైన కథతో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఒకప్పుడు నిర్మాతలకు మినిమం గ్యారెంటీ హీరోగా ఉన్న మాస్ మహారాజా రవితేజ గ్రాఫ్ ఇప్పుడు ఆందోళనకరంగా ఉంది. ఆయన నటించిన రీసెంట్ సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి కొన్ని ఏరియాల్లో 2009 నాటి కిక్ సినిమా కలెక్షన్లను కూడా దాటలేకపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వరస పెట్టి సినిమాలు చేయడం కాకుండా, క్వాలిటీపై దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాబోయే ఇరుముడి సినిమాతో మళ్లీ మనందరికీ తెలిసిన ఆ పాత వింటేజ్ రవితేజను చూస్తామని ఆశిద్దాం. గద్దలకొండ గణేష్ వరకు వరుణ్ తేజ్ కెరీర్ గ్రాఫ్ ఎంతో ప్లాన్డ్ గా సాగింది. కానీ ఆ తర్వాత ఆయన ఎంచుకున్న కథలేవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య వచ్చిన మట్కా చిత్రం కొన్ని చోట్ల జీరో షేర్ నమోదు చేయడం అందరినీ షాక్‌కు గురిచేసింది. వైవిధ్యం కోసం వరుణ్ చేస్తున్న ప్రయత్నాలు మెచ్చుకోదగ్గవే అయినా, అవి బాక్సాఫీస్ విజయాలుగా మారకపోవడం ఆయన కెరీర్‌కు ఇబ్బందిగా మారింది. ఈసారి కచ్చితమైన కమర్షియల్ హిట్ కొట్టడం వరుణ్ కి అత్యవసరం.
యూత్ స్టార్ నితిన్‌కి ప్రేక్షకులు ఎన్నో అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. కానీ ప్రతిసారీ కథల ఎంపికలో ఆయన చేస్తున్న పొరపాట్లు ఆడియన్స్‌ను నిరాశపరుస్తున్నాయి. ఒక హిట్ వచ్చిన వెంటనే వరస ప్లాపులు రావడం నితిన్ కెరీర్లో సర్వసాధారణం అయిపోయింది. ఇకనైనా ఆడియన్స్ పల్స్ తెలుసుకుని, బలమైన కథనంతో కూడిన సినిమా చేస్తే తప్ప, పూర్వ వైభవం రావడం కష్టం. గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ పెరిగిన మాట వాస్తవమే. ఆయన సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తున్నప్పటికీ, బలహీనమైన కంటెంట్, పూర్ వర్డ్ ఆఫ్ మౌత్ కారణంగా అవి బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోతున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది. అయితే, ఇప్పుడు విజయ్ తన ఆశలన్నీ రాబోయే పీరియాడికల్ యాక్షన్ డ్రామాలు రణబాలి, రౌడీ జనార్ధన పైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాలతో విజయ్ మళ్లీ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.