విజయ్ నటించిన జననాయగన్ సినిమా చుట్టూ నెలకొన్న వివాదాలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చాయి. మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ చిత్ర యూనిట్‌కు పెద్ద ఊరట లభించింది. రిట్ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడానికి కోర్టు అనుమతించడంతో.. సినిమా భవిష్యత్తు ఇప్పుడు సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ చేతుల్లో ఉంది. కమిటీ క్లియరెన్స్ ఇస్తే ఫిబ్రవరిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ప్రతిసారీ విజయ్ సినిమా విడుదల సమయానికి ఇలాంటి రాజకీయ, న్యాయపరమైన చిక్కులు రావడం సర్వసాధారణం అయిపోయింది. అసలు విజయ్ సినిమాలకు మొదటి నుంచి ఎందుకింత వ్యతిరేకత వస్తోంది? అనే ప్రశ్నకు సమాధానం వెతకాలంటే తమిళనాడు రాజకీయాలను నిశితంగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎందుకంటే తమిళనాడులో సినిమా రాజకీయం వేరువేరు కాదు. గతంలో మెర్సల్, సర్కార్ నుంచి మొదలుకొని ఇటీవల వచ్చిన లియో వరకు.. ప్రతీ సినిమా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. విజయ్ సినిమాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే సన్నివేశాలు ఉండటం, పరోక్షంగా అధికార వర్గాలపై సెటైర్లు వేయడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కేవలం సినిమాగానే కాకుండా.. వాటిని రాజకీయ అస్త్రాలుగా ప్రత్యర్థులు భావిస్తుండటంతో ఈ స్థాయిలో అడ్డుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. విజయ్ రాజకీయంగా బలపడితే ఎవరికి నష్టం? అనే కోణంలో చూస్తే.. దశాబ్దాలుగా తమిళనాడును ఏలుతున్న ప్రధాన ద్రవిడ పార్టీలకే ఇది పెద్ద ముప్పు. ఎంజీఆర్, జయలలిత తర్వాత ఆ స్థాయిలో సినిమా గ్లామర్‌తో పాటు ప్రజాకర్షణ ఉన్న నాయకుడు విజయ్ మాత్రమే. ఆయన రాజకీయ ఆరంగేట్రం యువత ఓటు బ్యాంకును భారీగా చీల్చే అవకాశం ఉంది.
అందుకే ఆయన సినిమాలను ఆర్థికంగా, నైతికంగా దెబ్బతీయడం ద్వారా.. ఆయన ఇమేజ్‌ను కంట్రోల్ చేయవచ్చని అధికార కేంద్రాలు భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. సినిమా రిలీజ్ ఆపేస్తే.. ఆయన క్రేజ్ తగ్గుతుందనేది వారి వ్యూహంగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా సెన్సార్ విషయంలో ఇన్ని రోజులు ఎందుకు జాప్యం జరిగిందంటే.. సినిమాలో కొన్ని రాజకీయ పరమైన డైలాగులు, ప్రస్తుత వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపే సన్నివేశాలు బలంగా ఉన్నాయని ప్రచారం జరగడమే. అవి ప్రజల్లోకి వెళ్తే ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందనే భయంతోనే సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా చిన్న చిన్న కట్స్ చెప్పే బోర్డు, ఈ సినిమా విషయంలో మాత్రం రివైజింగ్ కమిటీ వరకు వెళ్ళేలా చేసిందంటే.. అందులో కంటెంట్ ఎంత ఘాటుగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కావాలనే రిలీజ్ డేట్ వరకు టెన్షన్ పెట్టి, హైప్ తగ్గించాలనే ప్రయత్నం కూడా ఇందులో దాగి ఉంది. ఏదేమైనా లీగల్ చిక్కులు తొలగిపోవడంతో విజయ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రివైజింగ్ కమిటీ నుంచి సానుకూల నిర్ణయం వస్తే బాక్సాఫీస్ దగ్గర జననాయగన్ రికార్డుల మోత మోగించడం ఖాయం. అడ్డంకులు సృష్టించిన ప్రతిసారీ విజయ్ సినిమాలు మరింత కసిగా ఆడి.. కలెక్షన్ల వర్షం కురిపించడం చరిత్రలో చూస్తూనే ఉన్నాం. ఈసారి కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని.. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.