ఐసీసీ టీ 20 వరల్డ్‌కప్ 2026లో భారత్–పాకిస్తాన్ కీలక మ్యాచ్‌కు ముందు వివాదం చెలరేగింది. పాకిస్తాన్ మాజీ పేసర్ మొహమ్మద్ అమీర్ భారత ఓపెనర్ అభిషేక్ శర్మపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. చెప్పాలంటే హీచ్ పెంచాయి. పాకిస్తాన్‌లో ప్రసారమయ్యే ఓ కార్యక్రమంలో మాట్లాడిన అమీర్, అభిషేక్‌ను స్లాగర్ మాత్రమే అంటూ విమర్శించాడు. అతను ప్రతి బంతిని బలంగా కొట్టేందుకు ప్రయత్నిస్తాడని, అందుకే ఎక్కువసార్లు విఫలమయ్యే అవకాశాలు ఉంటాయని వ్యాఖ్యానించాడు. అంతేకాదు, అభిషేక్ టెక్నిక్ అంత బలంగా లేదన్నాడు. ఒకటి రెండు ఇన్నింగ్స్‌లో పెద్ద స్కోరు చేస్తాడనీ మిగతా మ్యాచ్‌ల్లో మాత్రం 10-12 పరుగులకే పరిమితమవుతాడని చెప్పాడు.
టెక్నికల్‌గా ఇంకా మెరుగుపడాలంటూ అమీర్ అభిప్రాయపడ్డాడు. అభిషేక్‌ను ఎలా ఎదుర్కోవాలన్న విషయంపైనా అమీర్ సలహా ఇచ్చాడు. శరీరానికి దగ్గరగా బంతులు వేస్తే అతడిని ఇబ్బంది పెట్టవచ్చని, స్వింగ్ అయ్యే బంతులను ఎదుర్కొన్నప్పుడే అతను పూర్తిస్థాయి బ్యాటర్‌గా గుర్తింపు పొందుతాడని వ్యాఖ్యానించాడు.అయితే, అమీర్ వ్యాఖ్యలపై భారత అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో అతడిపై విమర్శల వర్షం కురుస్తోంది. ప్రపంచ నెంబర్‌వన్ టీ20 బ్యాటర్‌పై ఇలా మాట్లాడడం సరైంది కాదు అంటూ పలువురు ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం అభిషేక్ ఫిట్‌నెస్‌పైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. పూర్తిగా కోలుకున్న తర్వాతే అతడిని ఆడించాలన్న ఆలోచనలో ఉంది.
ప్రస్తుతం అభిషేక్ కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ కోలుకునే ప్రయత్నంలో ఉన్నాడు. నమీబియా మ్యాచ్‌కు దూరమైన అతను, పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. యూఎస్ఏతో జరిగిన తొలి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ గోల్డెన్ డకౌట్ అయ్యి నిరాశ పరిచాడు.కొలంబోలోని ఆర్ ప్రేమదాస క్రికెట్ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 15న భారత్ - పాకిస్తాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇరు దేశాల మధ్య వివాదాల నేపథ్యం, టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ ఇష్యూ తర్వాత ఈ మ్యాచ్‌కి మరింత హైప్ దక్కింది. ఆసియా కప్ తర్వాత జరగనున్న ఈ మ్యాచ్ టీ 20 వరల్డ్‌కప్‌లోనే బెస్ట్‌గా నిలిచే అవకాశం ఉంది.