Spl story: పెళ్లి వద్దూ..! ముందు సెటిల్‌ అవుదాం..!

భారత్‌లోని యువత ధోరణి మారుతోంది. పెద్దలు చెప్పారని...పెళ్లీడు వచ్చిందని వివాహానికి సిద్ధపడటం లేదు. ముఖ్యంగా వివాహం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Post Published By: dialnews
Updated : 14 February 2026, 12:24 PM IST

భారత్‌లోని యువత ధోరణి మారుతోంది. పెద్దలు చెప్పారని...పెళ్లీడు వచ్చిందని వివాహానికి సిద్ధపడటం లేదు. ముఖ్యంగా వివాహం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంచి ఉద్యోగం సంపాదించాలని..లేదంటే వ్యాపారంలో స్థిరపడాలని కోరుకుంటున్నారు. ఆ తర్వాత వివాహానికి రెడీ అవుతున్నారు.పెళ్లంటే నూరేళ్ల పంట. రెండు విభిన్న అభిప్రాయాలున్న వ్యక్తులు కలిసి ఒకే మాట, బాటగా జీవితాన్ని కొనసాగించే అపురూప ఘట్టం. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగితే అంతా ఆనందమయమే. ప్రపంచంలోని అనేక దేశాలతో పోల్చితే...భారత్‌లోనే యువత ఎక్కువగా ఉంది.

ఆ యువత ఇప్పుడు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. అందులోనూ పెళ్లి విషయంలో అయితే...అసలు తొందరపడటం లేదు. పెళ్లీడు వచ్చిందని తల్లిదండ్రులు తొందర పెడుతున్నా...యువత ఆవేశపడటం లేదు. కొందరు మంచి ఉద్యోగం సంపాదించాక పెళ్లి చేసుకుంటామని చెబుతున్నారు. ఇంకొందరు వ్యాపారంలో సక్సెస్‌ అయ్యాక అంటుంటే...మరికొందరు లైఫ్‌లో సెటిల్‌ అయిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచిద్దామని కుండబద్దలు కొడుతున్నారు. వివాహ వయసు వచ్చిందనో...తల్లిదండ్రులు ఇష్టప్రకారమో పెళ్లి చేసుకోవడం లేదు. పేరెంట్స్‌కు నచ్చజెబుతున్నారు. తమ గురించి...తమ ఫ్యూచర్‌ గురించి అనేక రకాలు ఆలోచిస్తున్నారు. కెరీర్‌పై ఫోకస్‌ చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

కుటుంబసభ్యులు పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే...పెళ్లికి ఎందుకు అంత తొందర అంటున్నారట. పెళ్లంటే యువతలో అయిష్టత ఏమీ లేదు. అలా అని తొందర పడడం లేదు. దేశంలో సగటు వివాహ వయసు పదేళ్ల క్రితం 27 ఏళ్లుగా ఉంటే...ప్రస్తుతం 29 ఏళ్లకు చేరుకున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అంటే 29 ఏళ్లకు వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి యువత ఆసక్తి చూపుతోంది. జీవన్‌సాథీ నిర్వహించిన సర్వేల్లో...అసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లిళ్లపై 2016 నుంచి 2025 మధ్య సర్వే చేస్తే... ప్రజల్లో ధోరణి మారినట్లు వెల్లడైంది. ఈ ఏడాది 30 వేల మంది యువత అభిప్రాయాలు సైతం సేకరించింది. 29 ఏళ్లు వచ్చాక తోడు కోసం అన్వేషిస్తునట్లు తేలింది. ఈ మార్పు రావడం వెనుక ఆర్థిక అంశాలమే కారణమని స్పష్టమైంది. ఉద్యోగంలో సెటిల్‌ అవడంతోపాటు ఆర్థికంగా స్థిరపడితే జీవిత భాగస్వామితో ఆనందంగా గడపొచ్ని యువత ఆలోచిస్తోంది. జీవితంలో ఆర్థిక ఇబ్బందులు రాకుండా...డబ్బు సంపాదించాకే పెళ్లి అంటున్నారు.

రైట్‌ పర్సన్‌ కావాలని కోరుకునే వారి సంఖ్య ఊహించని విధంగా పెరిగింది. కీలకమైన విషయం ఏంటంటే..కులం పట్టింపు తగ్గిపోతుండడం శుభ పరిణామం. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో కులం ముఖ్యం కాదని కొందరు చెబుతున్నారు. 2016తో పోలిస్తే ఇప్పుడు ఇలాంటివారి సంఖ్య మరింత పెరిగింది. గ్రామాలతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లో ఈ ధోరణి అధికంగా ఉంది. పెళ్లి అనేది వ్యక్తిగత వ్యవహారమని యువత వాదిస్తోంది. భార్య లేదంటే భర్తను తామే ఎంపిక చేసుకుంటామని చెబుతోంది. వీరి సంఖ్య 2016లో 67 శాత ఉండగా, ప్రస్తుతం 77 శాతానికి చేరుకుంది. పెళ్లి కుదిర్చే పనిని తమ కుటుంబ సభ్యులకు అప్పగించే పరిస్థితి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఎక్కువ సంపాదించే భార్య రావాలని 87 శాతం మంది కోరుకుంటున్నట్లు అధ్యయనంలో తేలింది. భర్త తమ కంటే తక్కువ సంపాదించినప్పటికీ తమకు అంగీకారమేనని 15 శాతం మంది యువతులు చెప్పారు.

జీవిత భాగస్వామి మృతి చెందిన వాళ్లు...లేదంటే డైవర్స్‌ తీసుకున్న వారు..మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ఇంట్రస్ట్‌ చూపుతున్నారు. ఒంటరి జీవితం గడపటానికి ఎవరు ఇష్టపడటం లేదు. తొలి వివాహం ఫెయిల్‌ అయినా...మళ్లీ పెళ్లి చేసుకుంటామనే యువత సంఖ్య పెరుగుతోంది. 2016లో 11 శాతం మంది రెండో పెళ్లి కోసం ప్రయత్నించారు. ఇప్పుడు వారి సంఖ్య 16 శాతం పెరిగింది. విడాకులు తీసుకున్న తర్వాత మరో పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని యువత భావిస్తోంది. తొలిసారి పెళ్లికి సిద్ధమైనవారు కూడా... విడాకులు తీసుకున్న వారిని వివాహమాడేందుకు ముందుకు వస్తున్నారు.

Published : 
  • 14 February 2026, 12:24 PM IST