రాజకీయాల్లో దూకుడు సహజమే.. ముఖ్యంగా ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో ఈ దూకుడు ఇంకా అవసరం. అందులోనూ ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే ఇంకా స్పీడ్ ఉండాలి. ఇలాంటి దూకుడు రాజకీయాలకు ఆళ్లగడ్డ నియోజకవర్గం కేంద్ర బిందువు. నిత్యం వర్గ విభేదాలు, ఘర్షణలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.. ఆళ్లగడ్డ అలియాస్ బాంబుల గడ్డ. అలాంటి బాంబుల గడ్డ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయింది. ఈసారి గొడవలతో కాకుండా పాజిటివ్ వైబ్స్ తో ఆళ్లగడ్డ వార్తల్లో నిలుస్తోంది.
గతంలో ప్రత్యర్థులపై విమర్శలు, భౌతిక దాడులతో సంచలనంగా నిలిచేది ఈ నియోజకవర్గం. గతంలో విమర్శలు, దూకుడు రాజకీయాలతో రాజకీయం చేసిన స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ శైలిలో ఇప్పుడు సడెన్ ఛేంజ్ కనపడుతోంది. తండ్రి మరణం తర్వాత వివాదాలకు కేంద్రంగా మారిన ఎమ్మెల్యే మేడం.. వివాదాలకు స్వస్తి పలికి అందరినీ కలుపుకుపోతున్నారు. క్షేత్రస్థాయిలో ఏ కార్యక్రమం చేపట్టినా పార్టీ శ్రేణులకు ముందస్తు సమాచారం ఇస్తూ, కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
నియోజకవర్గంలో ఒకప్పుడు కొనసాగిన అంతర్గత కుమ్ములాటలు ఇప్పుడు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. అఖిలప్రియ దూకుడు నిర్ణయాలను కూడా కాస్త పక్కన పెడుతున్నారు. నారా లోకేష్ ఇచ్చిన సుతిమెత్తని వార్నింగ్, సూచనలతోనే అఖిల ఆచితూచి రాజకీయం చేస్తున్నట్టు లోకల్ లో ఓ టాక్ నడుస్తోంది. ఆమెలో మార్పు రాగానే.. ఇటీవల సుమారు 80 కోట్ల రూపాయల భారీ నిధులతో వివిధ అభివృద్ధి పనులకు ఆమె శ్రీకారం చుట్టారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి నుంచి వినతులు స్వీకరిస్తూ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు.
గతంలో స్థానిక నాయకులను సంప్రదించకుండా.. మినిమం లోకల్ ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా.. డెసిషన్ తీసుకోవడంలో అఖిలకు తలనొప్పులు వచ్చి పడ్డాయి. ఇప్పుడు మాత్రం అవి రిపీట్ కాకుండా.. స్మైల్ పాలిటిక్స్ చేస్తున్నారు ఎమ్మెల్యే మేడం. నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న తీరు పట్ల స్థానికంగా పాజిటివ్ టాక్ తీసుకొస్తుంది. గతంలో అఖిల ప్రియ చుట్టూ ముసురుకున్న వివాదాలు, సవాళ్లు ఇప్పుడు చాలా వరకు కంట్రోల్ అయ్యాయి. మీరు మేము అనే మాటలు పోయి.. మనం అనే విధానం రావడం మేడంకి కలిసి వస్తుంది.
అటు పార్టీ కేడర్ లో, ఇటు సామాన్య ప్రజల్లో ఆమె పట్ల సానుకూలత పెరుగుతోంది. సమస్య ఏదైనా వెంటనే స్పందిస్తూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆళ్లగడ్డ గడ్డపై భూమా కుటుంబానికి ఉన్న పట్టును మరింత పటిష్టం చేసుకునే దిశగా ఆమె పొలిటికల్ జర్నీ సాగుతుంది. పాత విబేధాలు పక్కన పెట్టి మరీ ముందుకు వెళుతున్నారు. అఖిలప్రియలో ఈ హఠాత్తు మార్పు వెనుక ఒక బలమైన రాజకీయ కారణం ఉందని చర్చ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ప్రక్షాళన త్వరలో జరిగే అవకాశం ఉండటంతో, రాయలసీమ నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న నాయకుల జాబితాలో అఖిల ప్రియ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సీమ రెడ్డమ్మల కోటాలో చోటు దక్కించుకోవాలంటే వివాదరహిత ఇమేజ్ తో పాటు నియోజకవర్గంలో తిరుగులేని పట్టు ఉండాలని ఆమె భావిస్తున్నారు. అందుకే తన పనితీరును పూర్తిగా మార్చుకున్నట్టుగా చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత లోకేష్ నమ్మకాన్ని గెలుచుకుని కేబినెట్ లో చోటు సాధించాలనే పట్టుదలే ఈ కొత్త రాజకీయ శైలికి కారణమని తెలుస్తోంది. మరి అఖిల ప్రియ ఆశించినట్లుగా మంత్రి పదవి దక్కుతుందో లేదో వేచి చూడాలి.