టీ20 ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత్.. లీగ్ స్టేజ్‌లో ఓటమి అనేది లేకుండా సూపర్-8కు చేరుకుంది. అయితే సూపర్-8లో తన తొలి మ్యాచ్‌లోనే దక్షిణాఫ్రికా చేతిలో భంగపాటుకు గురైంది. దీంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. జింబాబ్వేను వెస్టిండీస్ సైతం చిత్తు చిత్తుగా ఓడించడంతో సెమీస్ సమీకరణాలు మారిపోయాయి. ప్రస్తుతం భారత్ మిగిలిన రెండు మ్యాచ్‌లలో జింబాబ్వే, వెస్టిండీస్‌ను ఓడిస్తేనే ముందంజ వేసే అవకాశం ఉంది. అది కూడా నెట్ రన్ రేట్ భారీగా పెంచుకుంటూ గెలవాల్సి ఉంటుంది.
ఈ పరిస్థితుల్లో టీమిండియా సూపర్-8లో ఆడే మిగతా రెండు మ్యాచ్‌లు డూ ఆర్ డై గా మారాయి. ఈ నేపత్యంలో మాజీ క్రికెటర్లు, పలువురు విశ్లేషకులు టీమిండియాకు సూచనలు చేస్తున్నారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేరిపోయాడు. అయితే అతడు కాస్త విభిన్నమైన సూచన చేశాడు. భారీగా నెట్ రన్ రేట్‌ను పెంచుకోవడంపై అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అశ్విన్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం రెండు మ్యాచ్‌లలో గెలవడంపైనే ఫోకస్ చేయాలని సూచించాడు.
భారత టీ20 జట్టు యువ ఆటగాళ్లతో నిండి ఉందనీ, వారు ఒత్తిడిని ఎదుర్కోవాలనీ, కంగారు పడాల్సిన అవసరం లేదన్నాడు. జింబాబ్వేతో మన జట్టుకు సమస్య ఎదురవుతుందని తాను అనుకోవడం లేదన్నాడు. ఆ మ్యాచ్‌లో మనం మెరుగైన ప్రదర్శన చేస్తామనీ, ఏది ఏమైనా ఐసీసీ ప్రస్తుత పిచ్‌లను బ్యాలెన్స్‌గా రూపొందిస్తోందని ప్రశంసించాు. అటు బ్యాటర్లకు, ఇటు బౌలర్లకు ఇద్దరికీ అనుకూలంగా పిచ్‌లు ఉంటున్నాయన్నాడు. దానికి తగ్గట్లుగానే ఆటగాళ్లు తమ ఆటతీరును మార్చుకోవాల్సి ఉంటుందని అశ్విన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ తదుపరి రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో ఈనెల 26న జింబాబ్వేతో, మార్చి 1న వెస్టిండీస్‌తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లలో గెలిస్తేనే.. టీమిండియా సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.