జూన్ 14న భారత్, పాక్ మ్యాచ్… మహిళల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే…!

మార్చి 8వ తేదీన పురుషుల టీ20 వరల్డ్‌కప్ ముగిసిన మూడు నెలలకే మహిళల పొట్టి ప్రపంచకప్ మొదలవ్వనుంది. జూన్ 12వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకూ అభిమానులను అమ్మాయిల క్రికెట్ సమరం అలరించనుంది.

Post Published By: dialnews
Updated : 25 February 2026, 9:07 PM IST

మార్చి 8వ తేదీన పురుషుల టీ20 వరల్డ్‌కప్ ముగిసిన మూడు నెలలకే మహిళల పొట్టి ప్రపంచకప్ మొదలవ్వనుంది. జూన్ 12వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకూ అభిమానులను అమ్మాయిల క్రికెట్ సమరం అలరించనుంది. మెగా ఈవెంట్‌కు సమయం సమీపిస్తున్నందున మహిళా టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ఇంగ్లండ్ ఆతిథ్యం ఇస్తోంది. 2026, జూన్ 12న ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్‌లో మొత్తం 12 అగ్రశ్రేణి జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.

చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉండగా.. తొలిసారి మెగా టోర్నీకి అర్హత సాధించిన నెదర్లాండ్స్ సైతం ఇదే గ్రూప్‌లో నిలిచింది. జూన్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే హై-వోల్టేజ్ పోరుతో టీమిండియా తన ప్రపంచకప్ వేటను ప్రారంభించనుంది.ఈ టోర్నీలో పాల్గొనే 12 జట్లను ఐసీసీ రెండు గ్రూపులుగా విభజించింది. గ్రూప్ దశలో ప్రతి జట్టు ఐదు మ్యాచ్‌లు ఆడుతుంది. రెండు గ్రూపుల నుండి అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

గ్రూప్ ఏలో భారత్, పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి మేటి జట్లతో పాటు బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌కు చోటు దక్కింది. గ్రూప్ బీలో మాజీ ఛాంపియన్లు న్యూజిలాండ్, వెస్టిండీస్, ఇంగ్లండ్‌తో స్కాంట్లాడ్, ఐర్లాండ్ లీగ్ దశలో తలపడనున్నాయి. మొత్తంగా ఏడు వేదికల్లో 33 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఓల్డ్ ట్రఫోర్డ్, హెడింగ్లే, హ్యాంప్‌షైర్ బౌల్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్, ఎడ్జ్‌బాస్టన్, ది ఓవల్‌లో లీగ్ దశ, సెమీస్ మ్యాచ్‌లు ఉంటాయి. టోర్నీ నాకౌట్ దశ జూన్ 30 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి సెమీఫైనల్ జూన్ 30న, రెండో సెమీఫైనల్ జులై 2న ప్రఖ్యాత 'ది ఓవల్' మైదానంలో నిర్వహిస్తారు. ఇక ప్రపంచ విజేత ఎవరో తేల్చే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ జూలై 5న చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతుంది.

Published : 
  • 25 February 2026, 9:07 PM IST