Top Story: నాగబాబుకు పవన్ వార్నింగ్… వాళ్ళను దూరంగా ఉంచాలన్న డిప్యూటి సిఎం…!

సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న సరే, రాజకీయ పార్టీలు అధినేతల కుటుంబ సభ్యులు ఏదో ఒక రూపంలో హడావుడి చేస్తూ ఉంటారు.

Post Published By: dialnews
Updated : 26 February 2026, 1:30 PM IST

సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న సరే, రాజకీయ పార్టీలు అధినేతల కుటుంబ సభ్యులు ఏదో ఒక రూపంలో హడావుడి చేస్తూ ఉంటారు. సచివాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో వారి సందడి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. గతంలో ఈ విషయంలో మన తెలుగు రాష్ట్రాల్లో.. ఎందరో రాజకీయ నాయకులు విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, వైయస్ కుటుంబానికి సంబంధించి ఇదే తరహా ఆరోపణలు వచ్చేవి.

అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఈ విమర్శలు దాడి మరింతగా పెరిగిందని చెప్పుకోవాలి. 2014లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన.. భారత రాష్ట్ర సమితి విషయంలో కూడా ఇవే ఆరోపణలు వచ్చేవి. పదవుల్లో కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉండటం, అదేవిధంగా సచివాలయంలో, ముఖ్యమంత్రి కార్యాలయంలో, కుటుంబ సభ్యులు హడావుడి ఎక్కువగా ఉండటంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీలో కేసీఆర్ మనవడు, కూర్చోవడంపై విపక్షాలు మండిపడ్డాయి.

ఇక పదవుల్లో హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావు వంటి వారు ఉండటం, ప్రభుత్వ కార్యాలయాల్లో వారి పెత్తనం ఎక్కువగా ఉందనే విమర్శలు రావడం.. అప్పట్లో భారత రాష్ట్ర సమితిని ఎక్కువగా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. ఇక 2023లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన.. రేవంత్ రెడ్డి విషయంలో కూడా ఇవే విమర్శలు దాదాపుగా వస్తున్నాయని చెప్పాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సోదరుల విషయంలో, ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి ఘాటు గానే విమర్శలు చేస్తోంది.

కాంట్రాక్టులు సహా అనేక అంశాల్లో వారు తలదురుస్తున్నారని, ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా వారి పెత్తనం.. ఎక్కువగా నడుస్తుందని విమర్శలు కూడా ఉన్నాయి. ఇక ఏపీలో గతంలో వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల విషయంలో కూడా ఇదే తరహా విమర్శలు వచ్చేవి. వైయస్ అవినాష్ రెడ్డి సహా.. వైవి సుబ్బారెడ్డి వంటి వారు కీలక పదవుల్లో ఉండటం, అదే విధంగా వైఎస్ కుటుంబానికి చెందిన వారు ఎక్కువగా పెత్తనం చెలాయించడం వంటివే జరిగేవి. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు, విజయసాయిరెడ్డి బంధువుల హడావుడి కూడా వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువగా ఉండేది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా కనపడుతోంది. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ పరిపాలన విషయంలో.. అదే విధంగా పార్టీకి సంబంధించిన అంశాల్లో ఇప్పుడు ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ఇటీవల నాగబాబు ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

కుటుంబ సభ్యులు గానీ బంధువులు గాని, ఎవరూ కూడా సచివాలయంలో గాని, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోకి గాని వెళ్ళవద్దని.. తన పేరును ఎక్కడా వాడవద్దని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అధికారులతో కూడా నాగబాబు ఎక్కువగా మాట్లాడకూడదని, పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ఏదైనా ఉంటే జనసేన మంత్రుల ద్వారా.. నాగబాబు సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో కూడా.. కుటుంబ సభ్యులు ఎవరూ జోక్యం చేసుకోవద్దని.. పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. తిరుమల దర్శనాల విషయంలో కూడా కుటుంబ సభ్యులు ఎవరికి హామీలు ఇవ్వద్దని.. ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి గాని, ప్రభుత్వ పరంగా జోక్యం మాత్రం ఎక్కడా ఉండకూడదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

అదేవిధంగా జనసేన మంత్రులకు కూడా పవన్ కళ్యాణ్ ఇవే సూచనలు చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఎక్కువగా పెత్తనం ఉందనే వార్తలు వచ్చాయని.. మంత్రుల కుటుంబ సభ్యులు కూడా, సచివాలయానికి గాని, ప్రభుత్వ కార్యాలయాలకు గానీ వెళ్ళకూడదని స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయ భవిష్యత్తు విషయంలో క్లారిటీగా ముందుకు వెళుతున్న పవన్ కళ్యాణ్.. భవిష్యత్తులో ఏదైనా విమర్శలు వచ్చిన సరే, అవి కుటుంబ పరంగా ఉండకూడదు అనే లక్ష్యంతోనే అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అందుకే పూర్తిగా తన కుటుంబాన్ని కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ కు.. పవన్ కళ్యాణ్ తీసుకురావడం లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Published : 
  • 26 February 2026, 1:30 PM IST