ఢిల్లీ లిక్కర్ కేసులో అత్యంత కీలక సమయంలో కవితకు క్లీన్ చిట్ వచ్చింది. 167 రోజుల జైలు జీవితం.. ఎన్నికల్లో ఘోర ఓటమి.. ఎన్నో అవమానాలు, విమర్శల తరువాత.. తాను చెప్పినట్టుగానే స్కాం నుంచి కడిగిన ముత్యంలా బయటికి వచ్చారు కవిత. దీంతో ఆమె పెట్టబోయే రాజకీయ పార్టీకి ఇక తిరుగుండదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు రౌజ్ ఎవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 23 మందికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ తీర్పునిచ్చింది. దీంతో ఇంత కాలం కవిత ఎదుర్కున్న లిక్కర్ ఆరోపణలకు తెర పడింది. కవిత సొంత పార్టీ పెట్టాలి అనుకుంటున్న ఇలాంటి సమయంలో స్కాం విషయంలో క్లీన్ చిట్ రావడం ఆమె కొత్త పార్టీకి మంచి బూస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంత కాలం కవితను లిక్కర్ రాణి అని పిలిచిన ప్రత్యర్థుల నోళ్లకు ఈ క్లీన్ చిట్‌తో తాళం పడింది.
ఈ లిక్కర్ స్కాం వ్యవహారం బీఆర్‌ఎస్‌లో పెద్ద దుమారమే లేపింది. ఒక రకంగా చెప్పాలంటే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయాడానికి ఉన్న కారణాల్లో ఈ లిక్కర్ స్కాం కూడా అతి పెద్ద కారణం. గ్రౌండ్ లెవెల్‌లో ప్రజలకు కవిత స్కాం చేసింది అన్న విషయం బాగా నోట్ అయ్యింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కవిత స్కాం చేసింది అని ప్రచారం చేయడంతో ప్రత్యర్థులు సక్సెస్ అయ్యారు. ఇది గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా ప్రభావం చూపింది. కవిత పెట్టబోయే కొత్త పార్టీ మీద కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ సడెన్‌గా కోర్టు నుంచి క్లీన్ చిట్ రావడంతో కవితను విమర్శించే ఛాన్స్ ప్రత్యర్థులకు లేకుండా పోయింది.
ఈ కేసులో కవిత జైలు నుంచి బయటికి వచ్చిన తరువాత బీఆర్‌ఎస్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎవరూ ఊహించని విధంగా కవితను పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేశారు. కవిత కూడా నేరుగా హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్‌ను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేసింది. కవిత విషయంలో వాళ్లు ముగ్గురు నేరుగా కామెంట్స్ చేయకపోయినా.. బీఆర్ఎస్ నేతలు మాత్రం గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. వాళ్లు కూడా కవితను టార్గెట్ చేసింది ఈ లిక్కర్ స్కాం విషయంలోనే. కేసీఆర్ అన్నీ ఇస్తే డబ్బుకు ఆశపడి స్కాం చేశావంటూ సొంత పార్టీలో కొందరు నేతలు కవితను తిట్టని మాట లేదు. ఇలా ఎలా చూసినా ఆ స్కాం కవిత జీవితం మీద తిరుగు లేని దెబ్బ కొట్టింది అనడంతో ఎలాంటి సందేహం లేదు.
పార్టీ నుంచి ప్రత్యర్థుల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా కవిత మాత్రం మొదటి నుంచీ స్కాం జరగలేదంటూ చెప్తూనే వచ్చారు. చివరికి కోర్టు కూడా అదే చెప్పింది. దీంతో ఇప్పుడు కవిత పెట్టబోయే కొత్త పార్టీ విషయంలో కవిత వర్గంలో జోష్ కనిపిస్తోంది. బీఆర్ఎస్ మినహా కవితను విమర్శించడానకి ప్రత్యర్థుల దగ్గర ఇప్పుడు మ్యాటర్ లేదు. ఉన్న ఒక్క లిక్కర్ స్కాం విషయంలో కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు కవిత ఫుల్ జోష్‌తో ప్రజల్లోకి వెళ్లే ఆవకాశముంది. అంతే కాకుండా ఈ కేసులో దాదాపు 167 రోజులు కవిత జైలులో ఉంది. చివరికి ఎలాంటి తప్పు చేయలేదని తేలింది. కాబట్టి చేయని తప్పుకు 167 రోజులు జైలులో పెట్టారు అనే పాయింట్ కూడా కవితకు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. ఇదే పాయింట్‌తో ఆమె ప్రజల్లోకి వెళ్తే సెంటిమెంట్ ఒక రేంజ్‌లో వర్కౌంట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ స్కాం విషయంలో తనపై విమర్శలు చేసిన ప్రతీ ఒక్కరికీ క్లీన్ చిట్‌తో కవిత రిటర్న్ కౌంటర్ ఇచ్చేందుకు ఇప్పుడు ఛాన్స్ దొరికింది. దీంతో ఎలా చూసినా కోర్ట్ నుంచి వచ్చిన ఈ క్లీన్ చిట్ కవిత పెట్టబోయే కొత్త పార్టీకి చాలా ఉపయోగపడుతుందంటున్నారు విశ్లేషకులు.