మాటలకందని విషాదం. అంతులేని గర్భశోకం. ఆడుతూపాడుతూ అక్షరాలు దిద్దుతున్న చిన్నారులపై క్షిపణుల అమానుషం. అన్నెంపున్నెం ఎరుగని 165 మంది స్కూల్ పిల్లల సామూహిక ఖనన దృశ్యాలు ప్రపంచానికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.165 మంది స్కూల్ పిల్లలు. నవ్వుతూ స్కూల్‌కి వెళ్లిన చిన్నారులు విగత జీవులు అయ్యారు. పాఠాలు వింటున్న సమయంలో మిస్సైల్ దూసుకొచ్చింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే విద్యార్థుల అర్తనాదాలతో ఆ ప్రాంగణం మారుమోగింది. యుద్ధం అంటే అర్ధం తెలియని విద్యార్థులు, ఆటలు తప్ప తూటాలు తెలియని చిన్నారులు...అక్షరాలు తప్ప క్షిపణులు తెలియని పాపలు...ఆ యుద్ధంలోనే అసువులు బాసారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఓ స్కూల్ భవనంపై వైమానిక దాడులు చేశారు. ఈ ఘటనలో 165మంది విద్యార్థినులు మరణించారు. వారిని ఒకే దగ్గర ఖననం చేశారు.
మినాబ్ నగరంలోని షాజరేహ్ తయ్యబా బాలికల ప్రాథమిక పాఠశాలపై అమెరికా జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థినుల సంఖ్య 165కి పెరిగింది. మరో 60 మంది గాయపడ్డారు. చనిపోయిన వాళ్లందరినీ ఒకే చోట సామూహికంగా పూడ్చిపెట్టారు. ఇందుకోసం 165 చిన్న గోతులు తీసి ఖననం చేశారు. సామూహిక ఖనన క్రతువు వేలాది మంది కన్నీటి నయనాల మధ్య జరిగింది. తల్లిదండ్రులు, స్థానికుల శోకంతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.మినాబ్ సిటీలో జరిగిన విద్యార్థినుల అంతిమయాత్రలో భారీ సంఖ్యలో జనం పాల్గొన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థినుల పార్దీవ దేహాలను ఉంచిన వాహనాలు వీధుల గుండా వెళ్తుండగా వేలాది జనం హాజరై రహదారికి ఇరువైపులా నిలబడి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గుండెలు బాదుకుంటూకన్నీటి నివాళి అర్పించారు.
తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. పేగు తెంచుకుని పుట్టిన తమ చిన్నారులను కడసారి చూసుకుంటూ తల్లులు దిక్కులు పిక్కటిల్లేలా విలపించారు. అశ్రునయనాలతో తమ చిన్నారులకు వీడ్కోలు పలికారు.సాధారణంగా పౌరుల నివాసాలు, స్కూల్ భవనాలు, ఆస్పత్రులపై బాంబులు, క్షిపణులను ప్రయోగించకూడదు. ఇది యుద్ధనీతి. కానీ రక్తం మరిగిన అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలకు ఇవేమీ పట్టవు. చివరికి ఎలిమెంట్రీ స్కూల్‌పై మిసైల్స్ దాడి చేసి బాలికలను పొట్టనపెట్టుకున్నాయి. సామూహిక ఖనన దృశ్యాలను చూసి ప్రపంచ దేశాల ప్రజలు చలించిపోతున్నా...యుద్ధ దేశాలకు చీమకుట్టినట్టయినా లేదు. చిన్నారులేం చేశారు...వారినెందుకు చంపారని ట్రంప్, నెతన్యాహులను తిట్టిపోస్తున్నారు. యుద్ధంతో ఏం సాధిస్తారో తెలియదు కానీ...ఇలా తిరిగి పొందలేని, తిరిగిరాని ప్రాణాలను తీసి, తమ రక్తదాహం తీర్చుకుంటున్నాయి యుద్ధపిపాస దేశాలు.