హార్మోజ్ జలసంధి.. ఈ మాట వింటే ప్రపంచం వణికిపోతుంది. తమ దేశంపై యుద్ధం చేస్తున్నా ఇజ్రాయిల్, అమెరికా దేశాలపై ఆగ్రహంతో రగిలిపోతున్న ఇరాన్.. హార్మోజ్ జల సంధి విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. 55 కిలోమీటర్ల జలసంధి నుంచి 13 మిలియన్ బ్యారెళ్ళ చమురు ప్రతీ రోజు సరఫరా అవుతుంది. ప్రపంచ చమురు రవాణాలో 31 శాతం ఇక్కడి నుంచే జరుగుతుంది. అలాంటి హార్మోజ్ లో.. ఇరాన్.. సముద్రపు మందుపాతరలను అమర్చిందనే వార్తలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గంలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇజ్రాయిల్, అమెరికా దేశాలకు ప్రయోజనం చేకూర్చే ఏ దేశం నౌకలు అయినా సరే పెల్చేస్తాం అంటూ ఇరాన్ ఆర్మీ వార్నింగ్ ఇచ్చింది. ఇదే సమయంలో పెద్ద ఎత్తున మైన్లను సముద్రంలో అమర్చుతోంది. తాజాగా హర్మూజ్ జలసంధి సమీపంలో మందుపాతరలను అమర్చేందుకు ప్రయత్నించిన ఇరాన్‌కు చెందిన 16 మైన్‌లేయర్ బోట్లను తాము ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటన కూడా చేసింది.
కానీ యుద్దానికంటే ముందే ఇరాన్ భారీగా మందుపాతరలు అమర్చింది. ఒక్క చుక్క చమురు కూడా బయటకు రాకుండా జలసంధిని మూసివేస్తామని, తమ శత్రువుల నౌకలు వస్తే పేల్చివేస్తామని ఇరాన్ వార్నింగ్ లు కూడా ఇచ్చింది. ఇక్కడ ఉద్రిక్తతల వల్ల బ్యారెల్ ముడి చమురు ధర ఇప్పటికే వంద డాలర్లు చమురు ధర దాటింది కూడా. మరి అసలు ఇరాన్ ఎన్ని మైన్స్.. సముద్రంలో పెట్టింది...? అవి ఎలా పని చేస్తాయో ఈ స్టోరీలో చూద్దాం. భూమిపై అమర్చే మందుపాతరల కంటే ఇవి భిన్నంగా, అత్యంత శక్తివంతంగా ఉంటాయి. ఇరాన్ ప్రధానంగా మూడు రకాల పద్ధతుల్లో వీటిని పేల్చుతుంది.
కాంటాక్ట్ మైన్స్: ఏదైనా నౌక లేదా సబ్‌మెరైన్ ఈ మైన్‌ను నేరుగా తాకినప్పుడు ఇది పేలుతుంది. ఇవి సాధారణంగా సముద్ర ఉపరితలంపై లేదా నీటి లోపల గొలుసులతో కట్టి ఉంచుతారు.
ఇన్‌ఫ్లుయెన్స్ మైన్స్; ఇవి సెన్సార్ ఆధారంగా పని చేస్తాయి. వీటిని తాకాల్సిన అవసరం లేదు. నౌకలు సమీపంలోకి రాగానే వాటి నుంచి వచ్చే శబ్దం, అయస్కాంత క్షేత్రం, లేదా నీటి ఒత్తిడి మార్పులను గుర్తించి వాటంతట అవే పేలిపోతాయి.
రిమోట్ కంట్రోల్: తీరం నుంచి లేదా సమీపంలోని నౌకల నుంచి సిగ్నల్స్ పంపి వీటిని పేల్చవచ్చు.
రైజింగ్ మైన్స్: లోతైన నీటిలో ఉండే ఇవి, పైన నౌక వెళుతున్నట్లు గుర్తించగానే రాకెట్ లాగా పైకి దూసుకెళ్లి నౌక అడుగు భాగాన్ని ఢీకొంటాయి.
అసలు ఇరాన్ వ్యూహం ఏమిటి?
ఇరాన్ వద్ద దాదాపు 2,000 నుంచి 6,000 వరకు సముద్రపు మందుపాతరలు ఉన్నట్లు అంచనా. పెద్ద యుద్ధ నౌకల కంటే చిన్న ఫాస్ట్ బోట్ల ద్వారా వీటిని రహస్యంగా అమర్చడం ఇరాన్ అనుసరిస్తున్న ప్లాన్. ఒక్క చిన్న మైన్ పేలినా ఆ మార్గంలో ప్రయాణించే ట్యాంకర్ల ఇన్సూరెన్స్ ధరలు పెరిగి, అంతర్జాతీయ రవాణా వ్యవస్థ స్తంభించిపోతుంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన చమురు అవసరాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది, ఎందుకంటే భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో సగానికి పైగా ఈ హర్మూజ్ మార్గం ద్వారానే వస్తుంది.