రోజుల తరబడి సాగుతోన్న ఇజ్రాయిల్, అమెరికా వర్సెస్ ఇరాన్ వార్ లో మరో టర్నింగ్ పాయింట్, అంతర్జాతీయ సమాజాన్ని షాక్ కు గురి చేసింది. మార్చి 17 న ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ మోస్ట్ పవర్ ఫుల్ లీడర్, నేషనల్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ మరణించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రకటించారు. ఫిబ్రవరి 28న సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత, ఇరాన్ అధికార యంత్రాంగంలో లారిజానీ అత్యంత కీలక వ్యక్తిగా ఎదిగారు.
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలల మధ్య ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బగా దీనిని చెప్పుకోవచ్చు. టెహ్రాన్‌పై రాత్రికి రాత్రి జరిగిన వైమానిక దాడుల్లో లారిజానీతో పాటు బాసిజ్ ఫోర్స్ కమాండర్ గులాంరెజా సులేమానీ కూడా మరణించినట్లు సమాచారం. సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత, ఇరాన్ నాయకత్వ శూన్యతను పూడ్చడంలో లారిజానీది కీ రోల్. ఆయన కేవలం ఒక అధికారి మాత్రమే కాదు, దశాబ్దాలుగా ఇరాన్ విధానాలను రూపొందించిన మేధావిగా చెప్తూ ఉంటారు.
ఖమేనీ మరణానంతరం ఇరాన్ పరిపాలనను నడిపిస్తున్న తాత్కాలిక మండలిలో ఆయన అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా, వాస్తవానికి అనధికారిక సుప్రీం లీడర్ గా చెప్తూ ఉంటారు. ఇరాన్ అణు కార్యక్రమం, విదేశీ దౌత్యం మరియు అంతర్గత భద్రతపై ఆయనకు తిరుగులేని పట్టు ఉండేది. సైనికుడి నుంచి స్పీకర్ వరకు ఎదిగిన ఆయన.. కెరీర్ ఇరాన్ విప్లవ చరిత్రతో ముడిపడి ఉంది. ఇరాన్ ఆర్మీలో మోస్ట్ పవర్ ఫుల్ విభాగంగా చెప్పుకునే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా, మాజీ కమాండర్‌గా ఆయనకు సైన్యంలో విశేష గౌరవం ఉండేది.
ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లో బ్రిగేడియర్ జనరల్ హోదాలో పనిచేశారు. సైన్యం మరియు ఇంటెలిజెన్స్ వర్గాలతో ఆయనకు ఉన్న సంబంధాలతోనే ఇరాన్ లో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా ఎదిగారు. ఆయనను 2008 నుండి 2020 వరకు వరుసగా 12 ఏళ్ల పాటు ఇరాన్ పార్లమెంటు స్పీకర్‌గా పనిచేసి రికార్డు సృష్టించారు. 2005-2007 మధ్య కాలంలో ఇరాన్ ప్రధాన అణు సంప్రదింపుల అధికారిగా వ్యవహరించి, పాశ్చాత్య దేశాలతో చర్చల్లో కీలక పాత్ర పోషించారు. లారిజానీ కేవలం ఇరాన్ అంతర్గత వ్యవహారాలకే పరిమితం కాలేదు.
చైనాతో ఇరాన్ కుదుర్చుకున్న 25 ఏళ్ల వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం వెనుక మాస్టర్‌మైండ్ ఆయనే. పుతిన్ వంటి ప్రపంచ నాయకులతో నేరుగా చర్చలు జరిపి, ఇరాన్-రష్యా రక్షణ సంబంధాలను బలోపేతం చేశారు. 2026 యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, లారిజానీ ఇరాన్ రక్షణ వ్యూహాలను ముందుండి నడిపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నేరుగా హెచ్చరిస్తూ, "ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాం" అని ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఆయన లక్ష్యంగా ఈ దాడి జరిగింది.
సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో ఇప్పటికే బలహీనపడిన ఇరాన్, ఇప్పుడు లారిజానీ వంటి అనుభవజ్ఞుడైన నాయకుడిని కోల్పోవడంతో తీవ్ర సంక్షోభంలో పడింది. ఇరాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ మరణాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. ఆయన సోదరుడు సాదిక్ లారిజానీ గతంలో ఇరాన్ న్యాయవ్యవస్థ అధిపతిగా పని చేసాడు. ఇరాన్ అధికార వర్గంలో లారిజానీ కుటుంబం మోస్ట్ పవర్ ఫుల్ గా ఇజ్రాయిల్ అంటుంది. అయతొల్లా ఖమేనీకి లారిజానీ అత్యంత నమ్మకస్తుడైన సలహాదారు. ఏవైనా క్లిష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు ఖమేనీ సంప్రదించే మొదటి వ్యక్తి లారిజానీనే. ఇరాన్ 'యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్' గా చెప్పుకునే హిజ్బుల్లా, హమాస్, హౌతీలుకు అవసరమైన దౌత్యపరమైన, ఆర్థిక మద్దతును సమకూర్చడంలో ఆయన మాస్టర్ మైండ్. ఆయన్ని అంతం చేయడం ద్వారా ఇరాన్ నిర్ణయాత్మక శక్తిని దెబ్బతీయవచ్చని ఇజ్రాయెల్ భావించింది.