పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఎక్కడో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యే అనుకుంటే పొరపాటే. ఆ యుద్ధం ఇప్పుడు నేరుగా మీ వంటింటిపై దాడికి రెడీ అయిపొయింది. అవును.. మనం ఇన్నాళ్లూ వాడుతున్న 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ఇకపై చరిత్ర కాబోతోందా? కేంద్ర ప్రభుత్వం 10 కేజీల సిలిండర్లనే తీసుకురావాలని ఎందుకు ఆలోచిస్తోంది? దీనివల్ల సామాన్యుడిపై పడే భారం ఎంత? అసలు ఈ గ్యాస్ కొరతకు కారణం ఏంటి? పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో చూడండి.ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం, కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఐవోసిఎల్, హెచ్ పీ సిఎల్, బీపీసీఎల్ ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల రీఫిల్లింగ్ సామర్థ్యాన్ని తగ్గించి, వాటిని 10 కేజీల సిలిండర్లుగా మార్చాలని చూస్తున్నాయి. అంటే సిలిండర్ సైజు అదే ఉన్నా, అందులో నింపే గ్యాస్ పరిమాణం మాత్రం తగ్గుతుంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో రవాణా కష్టతరమైంది.
ముఖ్యంగా 'హొర్ముజ్ జలసంధి' వంటి కీలక ప్రాంతాల్లో ఉద్రిక్తతల వల్ల గ్యాస్ ట్యాంకర్లు భారత్‌కు చేరడంలో జాప్యం జరుగుతోంది. భారత్ తన అవసరాలకు సరిపడా ఎల్పీజీలో దాదాపు 50 శాతంకు పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. అంతర్జాతీయంగా గ్యాస్ ఉత్పత్తి తగ్గడం, ధరలు పెరగడంతో దేశీయంగా నిల్వలు తగ్గిపోతున్నాయి. మరి కేంద్రం ఎందుకు ఈ వ్యూహాన్ని ఎంచుకుందనేది చూస్తే.. ఇలాంటి సిచ్యువేషన్ లో ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు.. అందరికీ గ్యాస్ అందేలా చూడటం.ఒకవేళ 14 కేజీల సిలిండర్లు ఇస్తే, నిల్వలు త్వరగా అయిపోతాయి. అదే 10 కేజీలు ఇస్తే, తక్కువ గ్యాస్‌తో ఎక్కువ మంది వినియోగదారుల అవసరాలు తీర్చవచ్చు.
గ్యాస్ కొరత ఉన్నప్పుడు అక్రమ నిల్వలు పెరిగే అవకాశం ఉంది. సిలిండర్ బరువు తగ్గిస్తే, నిరంతర సరఫరా ఉండేలా చూసి బ్లాక్ మార్కెట్‌కు అడ్డుకట్ట వేయొచ్చు. 14 కేజీల సిలిండర్ నెల రోజులు వస్తే, 10 కేజీల సిలిండర్ 20 రోజులకే అయిపోతుంది. అంటే నెలకు రెండుసార్లు బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. సిలిండర్ ధర తగ్గినా, డెలివరీ ఛార్జీలు, బుకింగ్ ప్రాసెస్ వల్ల సామాన్యుడి జేబుకు చిల్లు పడే అవకాశం ఉంది.ఇప్పటికే మార్కెట్లో ఉన్న 'కాంపోజిట్ సిలిండర్ల' వాడకాన్ని కూడా ప్రభుత్వం ప్రోత్సహించే అవకాశం ఉంది. యుద్ధం వల్ల పెట్రోల్ ధరలు పెరగడం చూశాం, కానీ ఇప్పుడు వంట గ్యాస్ బరువు తగ్గడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి. కొరత రాకుండా ఉండాలంటే ఇది తప్పనిసరి అని కొందరు అంటుంటే, సామాన్యులపై ఇది అదనపు భారం అని మరికొందరు వాదిస్తున్నారు.