సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే 'నేషనల్ క్రష్' అనే ఇమేజ్‌ను సొంతం చేసుకున్న కథానాయిక రష్మిక మందన్న. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ, తెలుగులో 'ఛలో' సినిమాతో ఎంట్రీ ఇచ్చి, ‘గీత గోవిందం’తో టాలీవుడ్ సెన్సేషన్‌గా మారింది. ఏప్రిల్ 5న రష్మిక మందన్న పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న కొత్త సినిమాల నుంచి అప్‌డేట్స్ కోసం అభిమానులు వేయికళ్లతో వేచి చూస్తున్నారు. రష్మిక ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది. అందులో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘రణబాలి’ ఒకటి.
రష్మిక పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా టీమ్ ఒక ప్రత్యేకమైన పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది."తన అందం, చిరునవ్వుతో ఈ ప్రపంచానికి రంగులు అద్దే మా ‘జయమ్మ’ అలియాస్ రష్మిక మందన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ చిత్ర యూనిట్ విష్ చేసింది.అంతేకాకుండా, ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ పోస్ట్‌లో రష్మికకు సంబంధించిన ఒక ఇంటెన్స్ లుక్‌ను షేర్ చేయడం విశేషం. కళ్లకు సంబంధించిన క్లోజప్ షాట్‌ను చూస్తుంటే, ఈ సినిమాలో రష్మిక పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని అర్థమవుతోంది.
ఈ సినిమాలో రష్మిక ‘జయమ్మ’ అనే పాత్రలో నటిస్తోంది. సాధారణంగా గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకోవడంలో రష్మిక ఎప్పుడూ ముందుంటుంది. ‘పుష్ప’లో శ్రీవల్లిగా డీగ్లామర్ లుక్‌లో మెప్పించిన ఆమె, ఇప్పుడు ‘రణబాలి’లో జయమ్మగా ఏ రేంజ్‌లో అలరిస్తుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.సెప్టెంబర్ 11 విడుదల అంటే, దసరా సీజన్‌కు ముందే బాక్సాఫీస్ వద్ద రష్మిక సందడి మొదలుకానుంది. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ నిర్మిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.