లోకల్ టీవీలో జననాయగన్…!

కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జన నాయగన్' గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటే, వారికి కోలుకోలేని షాక్ తగిలింది.

Post Published By: dialnews
Updated : 15 April 2026, 4:56 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జన నాయగన్' గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటే, వారికి కోలుకోలేని షాక్ తగిలింది. సినిమా ఇంకా థియేటర్లలోకి రాకముందే, పైరసీ భూతం ఈ చిత్రాన్ని వెంటాడుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన క్లిప్పులు సోషల్ మీడియాలో లీక్ అవ్వగా, తాజాగా అంతకంటే దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు విడుదలైన కొన్ని గంటలకే పైరసీ సైట్లలో కనిపిస్తుంటాయి. కానీ, 'జన నాయగన్' విషయంలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే.. తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఒక లోకల్ టీవీ ఛానల్‌లో ఏకంగా సినిమానే ప్రసారం చేసేశారు.

ఇది చూసిన సినీ వర్గాలు మరియు విజయ్ అభిమానులు షాక్‌కు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 10వ తేదీనే 'జన నాయగన్' సినిమా ఆన్‌లైన్‌లో లీక్ అయిందని చిత్ర బృందం గుర్తించింది. దీనిపై వెంటనే స్పందించిన ప్రొడక్షన్ టీమ్, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి ఆ లింకులను తొలగించే ప్రయత్నం చేస్తుండగానే.. మరుసటి రోజే అంటే ఏప్రిల్ 11న కోయంబత్తూరులోని కొన్ని ప్రాంతాల్లో స్థానిక ఛానళ్లు ఈ సినిమాను ప్రదర్శించడం మొదలుపెట్టాయి. ఈ విషయం తెలుసుకున్న తమిళగ వెట్రి కజగం నాయకులు మరియు విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు వెంటనే అప్రమత్తమయ్యారు. సినిమా ప్రదర్శనను అడ్డుకోవడమే కాకుండా, సదరు ఛానల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ లోకల్ ఛానల్ యజమానిని అరెస్ట్ చేశారు.

ఒక సినిమాను కోట్లాది రూపాయల బడ్జెట్‌తో, ఎంతోమంది సాంకేతిక నిపుణుల కష్టంతో నిర్మిస్తారు. థియేటర్లలో విడుదల కావాల్సిన సినిమా ఇలా లోకల్ ఛానల్స్‌లో ఫ్రీగా వచ్చేస్తే.. నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. పైరసీ వల్ల ఇప్పటికే సినీ పరిశ్రమ కుదేలవుతుంటే, ఇలా ఏకంగా టీవీల్లోనే వేసేయడం అనేది చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న తరుణంలో ఆయన సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో వరుసగా ఎదురుదెబ్బలు తగలడం అభిమానులను కలవరపెడుతోంది. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ పైరసీని ఎంకరేజ్ చేయవద్దని, థియేటర్లలోనే సినిమా చూడాలని వేడుకుంటున్నారు. సైబర్ పోలీసులు మరియు మూవీ టీమ్ ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఇలాంటి లీకులు జరగడం సెక్యూరిటీ లోపాలనే ఎత్తి చూపుతోంది. లోకల్ ఛానల్ యజమాని వెనుక ఎవరైనా ఉన్నారా? ఈ సినిమా ఫుటేజ్ వారికి ఎలా దొరికింది? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏదేమైనా, ఒక స్టార్ హీరో సినిమాకు విడుదల కాకముందే ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా దురదృష్టకరం.

Published : 
  • 15 April 2026, 4:56 PM IST