Top story:50% సీట్ల పెంపు అబద్దమేనా… ? కేంద్రం పొలిటికల్ గేమ్‌ ఆడుతోందా… ?

లోక్‌సభ సీట్లు పెంపుపై కేంద్రం కేంద్రం పొలిటికల్ గేమ్‌ ఆడుతోందా ? 50 శాతం సీట్ల పెంపు అన్నది పచ్చి అబద్దమేనా ? బీజేపీ పైకి చెప్తున్నది ఒకటయితే...లోపల మరోకటి చేస్తోందా ? పదే పదే 50 శాతం సీట్లు పెంచుతామని ప్రధాని, అమిత్ షా

Post Published By: dialnews
Updated : 18 April 2026, 9:14 AM IST

లోక్‌సభ సీట్లు పెంపుపై కేంద్రం కేంద్రం పొలిటికల్ గేమ్‌ ఆడుతోందా ? 50 శాతం సీట్ల పెంపు అన్నది పచ్చి అబద్దమేనా ? బీజేపీ పైకి చెప్తున్నది ఒకటయితే...లోపల మరోకటి చేస్తోందా ? పదే పదే 50 శాతం సీట్లు పెంచుతామని ప్రధాని, అమిత్ షా చెప్పడం వెనుక..కథ వేరే ఉందా ? అసలు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లులో ఏముంది ?లోక్‌సభ సీట్లను 543 నుంచి 850కి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టింది. రాష్ట్రాల వారీగా 50శాతం చొప్పున సీట్ల పెంపు అని చెబుతున్నా...బిల్లులో మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారమేనని ఎందుకు పెట్టారు ? సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని చెప్పడం వెనుక...కేంద్రం స్కెచ్‌లో భాగమేనా ? పైకి 50 శాతం సీట్ల పెంపు అని చెబుతున్నా..లోపల మాత్రం కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్లు పార్లమెంట్‌ సీట్లు పెరుగుతాయా ? అది కూడా 2011 జనాభా లెక్కల ప్రకారమే ఎంపీ సీట్ల పెంపు ఉంటుందని చర్చ జరుగుతోంది.

రాజ్యాంగం ప్రకారం...నియోజకవర్గాల పునర్విభజన అన్నది జనాభా లెక్కల ప్రకారం చేయాల్సి ఉంటుంది. జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు పక్కాగా అమలు చేస్తే...ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం పాపులేషన్‌ను పెంచుకుంటూ పోయాయి. అదే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా ప్రాధాన్యత తగ్గించేలా చేసింది. ఉత్తరాదిలో జనాభా పెరిగితే...దక్షిణాదిలో జనాభా తగ్గింది. వాజపేయి హయాంలో...లోక్‌సభ, శాసనసభ సీట్లను 1971 జనాభా లెక్కల ఆధారంగానే స్థిరంగా ఉంచారు. అయితే 2001 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేశారు. ఈ సవరణ ఆధారంగా జరిగిన పునర్విభజనే ప్రస్తుతం అమల్లో ఉంది.

దక్షిణాది రాష్ట్రాలు జనాభా ఆధారంగా ఎంపీ సీట్ల పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ ప్రతిపాదనను అంగీకరించేది లేదని కుండబద్దలు కొడుతున్నాయి. పలు సందర్బాల్లో ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, స్టాలిన్‌, సిద్ధరామయ్య, విజయన్‌...పునర్విభజనను వ్యతిరేకించారు. జనాభా లెక్కల ప్రకారం సీట్ల పెంపును ఒప్పుకునేది లేదని స్పష్టం చేశాయి. సీట్ల పెంపును వ్యతిరేకిస్తూ...కేంద్రానికి లేఖ రాశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం సీట్లు పెంచితే...దక్షిణాదితోపాటు చిన్న చిన్న రాష్ట్రాలు తీరని నష్టం జరుగుతుందన్న ప్రచారం ప్రజల్లోకి వెళ్లింది. దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా...ఎన్టీఏ భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల వారీగా లోక్‌సభ, శాసనసభ సీట్లను 50 శాతం చొప్పున పెంచుతున్నట్లు వెల్లడించారు. 50 శాతం పెంపు ప్రతిపాదనతో దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతుందని రేవంత్‌రెడ్డి, స్టాలిన్‌ వివిధ వేదికల్లో చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అయితే...హైబ్రీడ్‌ మోడల్‌ను తెరపైకి తెచ్చారు.

పునర్విభజనలో భాగంగా పెంచే లోక్‌సభ సీట్లలో సగం సీట్లను మెరిట్‌ కోటాలో.. జీడీపీకి అత్యధికంగా భాగస్వామ్యం అందిస్తున్న రాష్ట్రాలకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. మిగిలిన సగం సీట్లను ప్రోరేటాలో అన్ని రాష్ట్రాలకు కేటాయించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ప్రధాని మోడీతోపాటు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపిచారు. రేవంత్‌రెడ్డి వాదనలను తెలంగాణ బీజేపీ నేతలు తప్పుపట్టారు. 50 శాతం సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని ప్రకటించారు. ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాదికి 24 శాతం ప్రాతినిధ్యం ఉందని...50 శాతం పెంపు తర్వాత కూడా అంతే ఉంటుందని అంటున్నారు. 50 శాతం సీట్ల పెంపును కేంద్రం అమలు చేయనున్నట్లు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ ధ్రువీకరించారు. అయితే అన్ని పార్టీల ఎంపీలకు కేంద్రం పంపిన మూడు బిల్లుల్లో...50 శాతం చొప్పున సీట్ల పెంపు అన్న అంశమే లేదు. పైగా సవరణ బిల్లులో 2011 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేపట్టనున్నట్లు స్పష్టత ఇవ్వడం దక్షిణాది పార్టీలకు మింగుడు పడటం లేదు.

50 శాతం ప్రోరేటాలో సీట్ల పెంపు...అంటూ అమిత్‌షా వ్యాఖ్యానించడం వెనుక బీజేపీ వ్యూహమేనని రాజకీయ విశ్లషకులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రతిపాదనపై ప్రజల్లో విస్తృత చర్చ జరగడం కోసమే అమిత్‌ షా ఈ వ్యాఖ్యలు చేసినట్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో విపక్ష పార్టీలన్నీ ఏకమవడంతో...బీజేపీ కొత్త ప్లాన్‌ను బయటకు తీసింది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన మూడు బిల్లుల్లోనూ ఈ ప్రతిపాదన అంశమే లేకుండా జాగ్రత్త పడింది. పైగా చట్ట సవరణ బిల్లులో 2011 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. దీనిపై పార్టీలన్నీ అభ్యంతరం చెబితే...50శాతం ప్రకారమే సీట్ల పెంపునకు అన్ని పార్టీలు అంగీకరిస్తాయని బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించుకునేందుకు కేంద్రం సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలు డీలిమిటేషన్‌ను తప్పుపడుతూ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేస్తే.. మహిళా బిల్లును కూడా వ్యతిరేకించినట్టే అవుతుందని బీజేపీ ఎత్తులు వేసింది. సాధారణంగా లోక్‌సభ కార్యకలాపాల నిబంధనల్లోని 66వ రూల్‌ ప్రకారం ఒక్కో బిల్లును విడివిడిగా సభ తీర్మానం ద్వారా ఆమోదిస్తుంటారు. ఇప్పుడు మూడు బిల్లులను ఒకే తీర్మానం ద్వారా ఆమోదించేందుకు వీలుగా ఆ నిబంధనను రద్దు చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది.

Published : 
  • 18 April 2026, 9:14 AM IST