Top story: ఐటీ దెబ్బ…రియల్‌ అబ్బ కుదేలవుతున్న రియల్ ఎస్టేట్‌…!

ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు...ఐటీ ఎఫెక్ట్‌ రియల్ రంగంపై పడింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో టెకీల ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. వరుస ఐటీ లేఆఫ్‌లు...రియల్ ఎస్టేట్‌కు బ్రేకులు వేస్తున్నాయి. దీంతో సొంతిళ్లు కొనుగోలు చేయాలనుకుంటున్న టెకీలు పునరాలోచనలో పడ్డారు.

Post Published By: dialnews
Updated : 25 April 2026, 9:30 PM IST

ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు...ఐటీ ఎఫెక్ట్‌ రియల్ రంగంపై పడింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో టెకీల ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. వరుస ఐటీ లేఆఫ్‌లు...రియల్ ఎస్టేట్‌కు బ్రేకులు వేస్తున్నాయి. దీంతో సొంతిళ్లు కొనుగోలు చేయాలనుకుంటున్న టెకీలు పునరాలోచనలో పడ్డారు. ఉద్యోగం ఉంటే చాలు...ఇల్లు ఎందుకు అని తమను ప్రశ్నించుకుంటున్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను తలచుకుంటే...సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఎవరి ఉద్యోగాలు పోతాయో...తెలియని పరిస్థితి నెలకొంది. ఏఐ దెబ్బకు...కింది స్థాయి నుంచి వైస్‌ ప్రెసిడెంట్ల వరకు...టెన్షన్‌తో బతుకీడుస్తున్నారు. ప్రస్తుతానికి లేఆఫ్స్ ప్రభావం ఐటీ నిపుణుల జీవనశైలి , రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభావం ఐటీ రంగంపై ఆధారపడిన రియల్ ఎస్టేట్‌ మార్కెట్‌లో మార్పులు కనిపిస్తున్నాయి.

ఉద్యోగ కోతల వల్ల ఇప్పటికే ఇల్లు కొన్నవారు ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. మిగిలిన ఉద్యోగులు భవిష్యత్తుపై భయంతో కొత్త కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు. ఖరీదైన ఇళ్ల నుంచి తక్కువ ధరలో ఇళ్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. తమ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఖరీదైన ఇళ్లకు బదులుగా తక్కువ ధర ఇళ్లను ఎంచుకుంటున్నారు టెక్‌ నిపుణులు. ఐటీ ఉద్యోగులు అప్రమత్తంగా ఉంటున్నారని.. ఇళ్ల కొనుగోలుతో రుణభారాన్ని పెంచుకోవడానికి సిద్ధంకావడం లేదని రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపుప్రస్తుతం ఐటీ రంగం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, దీర్ఘకాలికంగా AI ఆధారిత సేవలు కొత్త అవకాశాలను సృష్టించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు రియల్ ఎస్టేట్‌పై ప్రభావం.
-
బెంగళూరు, హైదరాబాద్, పుణే రియల్ ఎస్టేట్ మార్కెట్...ప్రధానంగా ఐటీ ఉద్యోగుల మీద ఆధారపడింది. ముఖ్యంగా 70 లక్షల నుంచి 1.5 కోట్ల ధరల్లోనే కొనుగోళ్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాల కోత మొదలవుతుందనే భయం...ఐటీ ఉద్యోగులను వెంటాడుతోంది. దీంతో రియల్‌ మార్కెట్‌లో ఒక్కసారిగా స్తబ్ధత నెలకొంది. ఐటీ రంగంలో లేఆఫ్స్ భయాలు గృహ నిర్మాణ రంగాన్ని దెబ్బతీస్తాయనే ఆందోళనలు నెలకొన్నాయి. ఐటీ హబ్‌లైన హైదరాబాద్‌, బెంగళూరు, పుణెలలో ఇళ్ల విక్రయాలపై ప్రభావం పడిందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా నివేదికలో వెల్లడైంది. ముఖ్యంగా మధ్యస్థాయి ఇళ్ల విక్రయాలు బాగా పడిపోయినట్టు తెలిపింది. ఖరీదైన ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. దీనికి కారణం... అధికాదాయ వర్గాలు ఇళ్లకొనుగోళ్లను కొనసాగించడమే.

ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో కన్సాలిడేషన్‌ జరుగుతోందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా వెల్లడించింది. దీనికితోడు ఐటీ రంగంలో నెలకొన్న అనిశ్చితి కూడా ప్రభావం చూపుతోందని తెలిపారు. ఐటీలో ఉద్యోగాల కోత, కొత్త నియామకాలపై అనిశ్చితి, ఆర్థికభారం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు...రియల్ ఎస్టేట్‌పై చూపిస్తోన్నాయి. గత ఏడాది ఇళ్ల విక్రయాలు 14శాతం తగ్గాయి. కొనుగోలు అయ్యే ఇళ్ల సంఖ్య తగ్గినా.. విలువ పరంగా మాత్రం 6శాతం పెరిగింది. అయితే మార్కెట్లో పరిస్థితులు మరీ బలహీనంగా లేవు. ఐటీకి హబ్‌గా మారిన హైదరాబాద్‌పై ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలు తగ్గాయని, అద్దె ధరల పెరుగుదలలోనూ మందగమనం నెలకొంది. అయితే హైదరాబాద్‌కు సంబంధించి ఆర్థిక, ఐటీ వ్యవస్థల పునాదులు బలంగా ఉండటంతో...కొనుగోళ్లు వేగంగానే పుంజుకుంటాయని రియల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఉద్యోగ మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు గృహ రుణ ఈఎంఐలు పెరగడం ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్. ముఖ్యంగా బడ్జెట్‌ను మించి ఇల్లు కొనేవారికి ఇది శాపంగా మారుతుంది. భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తున్నప్పటికీ, భారీ ఈఎంఐలు, రోజువారీ ఖర్చుల తర్వాత చేతిలో నగదు మిగలడం కష్టమవుతోంది. స్థిరమైన ఖర్చులు నెలవారీ మిగులు ఆదాయాన్ని ఎంత వేగంగా హరిస్తాయనే విషయాన్ని చాలామంది అంచనా వేయలేకపోతున్నారు. దీనివల్ల మెడికల్ ఎమర్జెన్సీలు లేదా ఇతర ఆకస్మిక ఖర్చుల సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో సంక్షోభం కొనసాగుతోంది. అనేక కంపెనీల్లో లేఆఫ్స్‌ జరుగుతూనే ఉన్నాయి.

ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా 72వేల మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయారు. ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్ తాజాగా..ఈ విషయాన్నివెల్లడించింది. కరోనా సంక్షోభం తర్వాత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు తొలగించడం ఇదే. 2021 నుంచి 10 లక్షల మంది టెకీలు ఉద్యోగులు కోల్పోయినట్లు ట్రేడింగ్ ఫ్లాట్‌పామ్ రిపోర్ట్‌లో తెలిపింది. ఏఐ, ఆటోమేషన్ వైపు కంపెనీలు మొగ్గుచూపడం, తమ మౌలిక సదుపాయాలు, సామర్థ్య పెంపునకు అధికంగా ఖర్చు చేయడం వల్లే లేఆఫ్స్‌ పెరిగాయి. క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌-యాజ్‌-ఎ-సర్వీస్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం లేఫ్స్‌లో...అమెరికాలోనే 77 శాతం మందిని తొలగించారు. కంపెనీల పరంగా చూస్తే ఒరాకిల్‌ 26 వేలు, అమెజాన్‌ 16 వేల మందిని తొలగించాయి. మెటా సంస్థ...మొత్తం ఉద్యోగుల్లో 10 శాతం మందిని సాగనంపింది.

Published : 
  • 25 April 2026, 9:30 PM IST