చిట్టిబాబు Vs రామలక్ష్మి…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. జూన్ నెలలో బాక్సాఫీస్ వద్ద పెను తుపాను రాబోతుందా? ఎప్పుడూ లేని విధంగా టాలీవుడ్ క్యూట్ అండ్ పవర్ ఫుల్ పెయిర్ రామ్ చరణ్ - సమంత మధ్య బిగ్గెస్ట్ క్లాష్ జరగనుందా?

Post Published By: dialnews
Updated : 1 May 2026, 5:15 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. జూన్ నెలలో బాక్సాఫీస్ వద్ద పెను తుపాను రాబోతుందా? ఎప్పుడూ లేని విధంగా టాలీవుడ్ క్యూట్ అండ్ పవర్ ఫుల్ పెయిర్ రామ్ చరణ్ - సమంత మధ్య బిగ్గెస్ట్ క్లాష్ జరగనుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తూ, తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’. నందిని రెడ్డి దర్శకత్వంలో 1980ల నాటి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత సమంత ఒక పీరియడ్ డ్రామాలో కనిపిస్తుండటంతో అటు ఫ్యాన్స్, ఇటు సాధారణ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే, ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. నిజానికి, ఈ చిత్రాన్ని మే 15న విడుదల చేయాలని చిత్ర బృందం ముందుగా భావించింది. కానీ మే నెలలో దేశవ్యాప్తంగా ఐపీఎల్ హవా నడుస్తోంది.

ముఖ్యంగా కీలకమైన ప్లే-ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ల వల్ల వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉందని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే రిస్క్ తీసుకోకూడదని భావించిన సమంత టీమ్, ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్ 4వ తేదీని లాక్ చేసినట్లు సమాచారం. జూన్ 4వ తేదీన విడుదల చేయాలనుకోవడానికి మరో బలమైన కారణం కూడా ఉంది. కన్నడ స్టార్ యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రం అదే తేదీన విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా రేసు నుండి తప్పుకోవడంతో, జూన్ 4న సమంత సినిమాకు సోలో రిలీజ్ దక్కేలా కనిపిస్తోంది. ఇది సమంతకు బాక్సాఫీస్ వద్ద పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు. కథ ఇక్కడితో ముగిసిపోలేదు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ చోటు చేసుకునేలా కనిపిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా జూన్ నెలాఖరున కాకుండా, కొంచెం ముందుగానే అంటే జూన్ మొదటి వారంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ ఇదే జరిగితే, ‘రంగస్థలం’ సినిమాలో అద్భుతమైన కెమిస్ట్రీతో అలరించిన చిట్టిబాబు, రామలక్ష్మి మధ్య ఈసారి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ తప్పదు. ఒకే రోజు లేదా ఒకే వారంలో ఈ ఇద్దరు స్టార్స్ సినిమాలు తలపడితే, అది టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ క్లాష్‌గా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మా ఇంటి బంగారం’ ఒక ఎమోషనల్ పీరియడ్ డ్రామా అయితే, ‘పెద్ది’ ఒక పవర్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా. ఈ రెండు సినిమాలపై భారీగా బిజినెస్ జరుగుతోంది. ఒకవేళ క్లాష్ జరిగితే థియేటర్ల కేటాయింపు విషయంలో పెద్ద యుద్ధమే జరగవచ్చు. సమంత ఈ చిత్రంలో ఒక గృహిణిగా కనిపిస్తూనే, కథలో వచ్చే మలుపుల వల్ల యాక్షన్ మోడ్ లోకి వెళ్లే పాత్రను పోషిస్తోందట. మరోవైపు చరణ్ తన ‘పెద్ది’ చిత్రం కోసం పూర్తి మేకోవర్ అయ్యారు. ఈ ఇద్దరు మాజీ ఆన్-స్క్రీన్ పార్ట్నర్స్ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ప్రత్యర్థులుగా మారబోతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.చివరికి జూన్ బాక్సాఫీస్ బరిలో గెలిచి 'బంగారం' అయ్యేది ఎవరో.. పెహల్వాన్ అనిపించుకునేది ఎవరో వేచి చూడాలి.

Published : 
  • 1 May 2026, 5:15 PM IST