తమిళనాడు తమిళగ వెట్రి కళగం పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. మెజార్టీకు 11 సీట్ల దూరంలో నిలిచిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ముందున్న ఆప్షన్స్ ఏంటి ? కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందా ? చిన్న పార్టీలైన వీసీకే, వామపక్షాలు ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకేల రాజకీయాలకు తొలిసారిగా బ్రేక్ పడింది. తమిళగ వెట్రి కళగం రూపంలో మూడో రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదిగింది. మొట్టమొదటి ఎన్నికల్లోనే సింగిల్‌గా 107 సీట్లను కైవసం చేసుకొని ప్రధాన పార్టీలను వెనక్కి నెట్టేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118. అయితే 11 సీట్ల దూరంలో నిలిచిపోయింది.
మరో 12 సీట్లను కూడగట్టేందుకు ఇతర పార్టీల వైపు టీవీకే అధినేత విజయ్ చూస్తున్నారు. దీంతో చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడటం ఖాయమని స్పష్టమవుతోంది. తమిళనాడులో 1967 నుంచి డీఎంకే లేదంటే అన్నా డీఎంకే పార్టీలు మాత్రమే ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. మరో పార్టీకి ఈ అవకాశం ఇవ్వలేదు. చివరి రెండు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనే పరిశీలిస్తే... 2016లో అన్నా డీఎంకే, 2021లో డీఎంకే స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ ఈసారి డీఎంకే, అన్నా డీఎంకేలకు షాకిచ్చేలా హీరో విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ విజయ దుందుభి మోగించింది. 107 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్ 118ని సాధించేందుకు 11 మంది ఎమ్మెల్యేల మద్దతు టీవీకే పార్టీకి అవసరమైంది.
టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే...11 మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తే చాలు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఇందుకోసం టీవీకే అధినేత విజయ్ స్వతంత్రంగా గెల్చిన అభ్యర్థులు, చిన్న పార్టీలు, డీఎంకే కూటమిలోని అసంతృప్త పార్టీల మద్దతు కోసం చర్చలను మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ చర్చల కోసం కొందరు పార్టీ ముఖ్య నేతలను ఆయన రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేలపై విజయ్ ఫోకస్ చేశారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపొందారు. అంతేకాకుండా వీసీకే తరపున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అలాగే సీపీఐ, సీపీఎంలు చెరొక చోట గెలిచాయి. స్వతంత్ర అభ్యర్థులు, వామపక్షాలు, వీసీకే...విజయ్‌తో చేతులు కలిపే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలోని విపక్ష ఇండియా కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న డీఎంకేను కాదని, టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ సాహసించకపోవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రతిపక్ష అన్నాడీఎంకే ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిలో ఉంది. డీఎంకేను అధికారానికి దూరంగా ఉంచేందుకు విజయ్‌కు బయటి నుంచి మద్దతు ఇచ్చేందుకూ అన్నాడీఎంకే సిద్ధపడొచ్చని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుండటం ఇది తొలిసారేం కాదు. కానీ ఒక కొత్త రాజకీయ పార్టీ తొలి ప్రయత్నంలోనే హంగ్ సర్కారు ఏర్పాటు చేసేదాకా వెళ్లడం తమిళ రాజకీయాల్లో ఇదే తొలిసారి. 1952లో మద్రాస్ స్టేట్ మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. దీంతో అప్పట్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ, ఇతర పార్టీల మద్దతుతో రాజాజీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక 2006లో ఎం. కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే 96 సీట్లు మాత్రమే గెల్చుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం డీఎంకేకు బయటి నుంచి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఆ ఐదేళ్ల పాటు రాష్ట్రంలో మైనారిటీ ప్రభుత్వం నడిచింది. ఈసారి కూడా హీరో విజయ్ ఇదే రీతిలో హంగ్ సర్కారును ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లేనందున, ఎమ్మెల్యేలతో క్యాంప్ పాలిటిక్స్ జరిగే ముప్పు ఉందనే ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ అలర్ట్ అయ్యారు. టీవీకే ముఖ్య నేతలతో ఆయన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. గెలిచిన వారిని ఒక సురక్షిత రిసార్ట్‌కు తరలించే యోచనలో విజయ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు మద్దతివ్వనున్న పార్టీ ఏది అనే దానిపై సస్పెన్స్ నెలకొంది.