టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కేవలం సినిమాలతోనే కాదు, తన 'పూరి మ్యూజింగ్స్' పోడ్‌కాస్ట్ ద్వారా సమాజం, జీవితం, ఫిలాసఫీపై తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఆయన ఆధ్యాత్మిక గురువు రమణ మహర్షి జీవిత విశేషాలను, ఆయన బోధించిన అత్యున్నత సత్యాలను వివరిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా 'నేను ఎవరు?' అనే ప్రశ్న వెనుక ఉన్న గూఢార్థాన్ని పూరి తన శైలిలో వివరించారు. రమణ మహర్షి జీవితంలో అత్యంత కీలకమైన అంశం మౌనం. పూరి జగన్నాథ్ దీని గురించి ప్రస్తావిస్తూ, "నిశ్శబ్దం కంటే శక్తివంతమైన బోధన మరొకటి లేదు" అని పేర్కొన్నారు. మాటలు అర్థాలను ఇస్తాయి కానీ, మౌనం ఆత్మను పరిచయం చేస్తుంది.
రమణ మహర్షి తన జీవితంలో ఎక్కువ భాగం మౌనంగానే గడిపారు. ఆయన సన్నిధిలో కూర్చుంటే చాలు, భక్తుల సందేహాలు వాటంతట అవే పటాపంచలైపోయేవి అని పూరీ వివరించారు. రమణ మహర్షి ప్రపంచానికి అందించిన అతిపెద్ద సందేశం 'నేను ఎవరు?' అనే ఆత్మ విచారణ. మనం సాధారణంగా మన పేరును, వృత్తిని లేదా బంధాలను మన గుర్తింపుగా భావిస్తాం. కానీ, రమణ మహర్షి దృష్టిలో ఇవన్నీ తాత్కాలికమైనవి. శరీరం నేను కాదు, మనస్సు నేను కాదు, ప్రాణం నేను కాదు... వీటన్నింటినీ దాటి ఉన్న 'సాక్షి' ఎవరనేది వెతకడమే నిజమైన ఆధ్యాత్మికత. పూరి జగన్నాథ్ ఈ విషయాన్ని వివరిస్తూ, మనిషి తనను తాను తెలుసుకోవడం ద్వారా మాత్రమే శాశ్వతమైన ఆనందాన్ని పొందగలడని గుర్తు చేశారు. అహంకారం నశించినప్పుడు మాత్రమే మనిషికి అసలైన స్వేచ్ఛ లభిస్తుంది అని పూరీ జగన్నాథ్ అభిప్రాయపడ్డారు.
రమణ మహర్షి కేవలం మనుషులకే కాదు, మూగజీవాలకు కూడా ఆత్మజ్ఞానాన్ని పంచిన మహనీయుడు. అరుణాచలం కొండ పాదాల చెంత ఆయన గడిపిన కాలంలో అక్కడి జంతువులతో ఆయనకు ఉన్న అనుబంధం అపురూపం."రమణ మహర్షి జంతువులను 'అవి' అని కాకుండా, 'వారు' అని సంబోధించేవారు" అని పూరి జగన్నాథ్ గుర్తు చేశారు.ఆయన దగ్గర ఉన్న ఆవు లక్ష్మి, కుక్కలు, నెమళ్లు కూడా ఆయన మౌన భాషను అర్థం చేసుకునేవి. జంతువులలో కూడా భగవంతుడిని చూడగలగడం అనేది ఉన్నతమైన స్థితికి నిదర్శనం అని అన్నారు పూరీ. తమిళనాడులోని అరుణాచలం రమణ మహర్షికి నిలయమైంది. ఆ పవిత్ర భూమిలో ఆయన సాగించిన ఆధ్యాత్మిక ప్రస్థానం మనందరికీ ఒక గొప్ప సందేశమని పూరి అభిప్రాయపడ్డారు. లౌకిక ప్రపంచానికి దూరంగా, కేవలం ఒక కౌపీనం ధరించి, నిరంతరం ఆత్మచింతనలో మునిగిపోయిన రమణ మహర్షి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అనేది పూరీ మాటల్లోని ఆంతర్యం.