"మా దారికి రాకపోతే ఇరాన్‌ను రాతియుగం నాటికి తీసుకెళతాం". ఇటీవల ఇరాన్‌కు ట్రంప్ ఇచ్చిన డెడ్లీ వార్నింగ్ ఇది. కానీ, ట్రంప్ మాటలకే పరిమితం అయ్యాడు. ఇరాన్ మాత్రం చేతల్లో చేసి చూపించాలనుకుంటోంది. ఔను.. హార్ముజ్ జలసంధిని నిలిపివేసి ప్రపంచానికి చమురు షాక్ ఇచ్చిన టెహ్రాన్.. తాజాగా అదే హార్ముజ్‌లో మరో డెడ్లీ స్ట్రాటజీని అమలు చేయాలని డిసైడ్ అయింది. అండర్ సీ కేబుల్స్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకుని అమెరికాను ఫుట్‌బాల్ ఆడుకోవాలని చూస్తోంది. ఇరాన్ కనుక ఆ పని చేస్తే అమెరికానే కాదు యావత్ ప్రపంచం రాతియుగానికి వెళ్లడం ఖాయం.యుద్ధం మొదలైన తర్వాత హర్మూజ్ జలసంధిని మూసేసి చమురు షాకులిచ్చిన ఇరాన్.. ఇప్పుడు అదే హార్ముజ్ జలసంధి నుంచి అమెరికాతో పాటు యావత్ ప్రపంచానికి మరో షాక్ ఇవ్వాలని డిసైడ్ అయింది.
ఈ జలసంధి కింద ఉన్న సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లపై ఫీజులు వసూలు చేయాలని ప్రణాళికలు వేస్తోంది. ఇరాన్ ప్రభుత్వ మీడియా కథనాల ప్రకారం... ఇరాన్ కేవలం ముడి చమురు సరఫరాను అడ్డుకోవడమే కాదు, పశ్చిమ దేశాల డిజిటల్ సామ్రాజ్యాన్ని కూడా తన నియంత్రణలోకి తెచ్చుకోగలనని ప్రపంచానికి స్పష్టం చేసింది. ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న గ్లోబల్ ఇంటర్నెట్ ట్రాఫిక్ అంతా ఉపగ్రహాల ద్వారా కాకుండా, సముద్ర గర్భంలో ఉండే 'ఫైబర్-ఆప్టిక్' కేబుళ్ల ద్వారానే ప్రయాణిస్తుందని ఇరాన్ గుర్తుచేసింది. ఈ కీలకమైన అంతర ఖండ కేబుల్స్ అన్నీ తమ ప్రాంతీయ జలాలకు అత్యంత సమీపం నుంచే వెళ్తున్నాయని, కాబట్టి ఇకపై ఈ కేబుళ్లపై తమకు పూర్తి హక్కులు ఉంటాయని ఇరాన్ వాదిస్తోంది. ఈ మేరకు గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలకు ఇరాన్ ఈ కథనం ద్వారా గట్టి హెచ్చరికలు పంపింది.
తమ జలాల పరిధి దాటి వెళ్లే డేటా ట్రాఫిక్‌కు, ఆయా కేబుల్ వ్యవస్థలకు గానూ గ్లోబల్ టెక్ కంపెనీల నుండి ఫీజులు లేదా పన్నులు వసూలు చేయాలని ఇరాన్ యోచిస్తోంది. ఈ రూట్లలో కేబుల్స్ నిర్వహించే అంతర్జాతీయ కన్సార్టియంలను, కంపెనీలను ఇరాన్ నియంత్రణ పరిధిలోకి తేవాలనుకుంటోంది. సముద్ర గర్భంలో ఈ కేబుళ్లకు ఏవైనా మరమ్మతులు చేయాల్సి వస్తే, తమ అనుమతి తప్పనిసరి చేయడంతో పాటు ఆ పనులను తామే పర్యవేక్షిస్తామని ఇరాన్ ప్రకటించింది. టెక్ కంపెనీలు, అమెరికా కూటమి దేశాలు తమ నిబంధనలకు, ఫీజుల చెల్లింపులకు సహకరించకపోతే ఈ సముద్రగర్భ కేబుల్ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తామని కూడా ఇరాన్ మీడియా కథనాలు హెచ్చరించాయి. యుద్ధం జరిగే ప్రాంతాల్లో ఈ కేబుళ్లను రిపేర్ చేయడం చాలా ఖరీదైన, వారాల సమయం పట్టే ప్రక్రియ. కాబట్టి, ఇరాన్ నేరుగా కేబుళ్లను కట్ చేయకపోయినా, కేవలం అనుమతులు నిరాకరిస్తూ మానసిక ఆందోళన సృష్టించడం ద్వారాకూడా పశ్చిమ దేశాల ఆర్థిక, సాంకేతిక వ్యవస్థలను దెబ్బకొట్టవచ్చని వ్యూహం పన్నింది.
ప్రపంచ ఇంటర్నెట్, డేటా ట్రాఫిక్‌లో 95శాతానికిపైగా ఈ సముద్రపు మార్గాల ద్వారానే జరుగుతుంది. హర్ముజ్ జలసంధి గుండా అనేక అంతర్జాతీయ కనెక్టివిటీ మార్గాలు వెళ్తాయి. భద్రతా కారణాల వల్ల ఎక్కువ భాగం ఒమన్ వైపు ఉన్నప్పటికీ.. ఫాల్కన్, గల్ఫ్ బ్రిడ్జి ఇంటర్నేషనల్ అనే రెండు ప్రధాన మార్గాలు మాత్రం ఇరాన్ జలప్రాంతాల గుండా సాగుతున్నాయి. వీటికి నష్టం కలిగితే బ్యాంకింగ్ వ్యవస్థలు, ఆర్థిక మార్కెట్లు, సైనిక కమ్యూనికేషన్లు, కృత్రిమ మేధస్సు, అంతర్జాతీయ లావాదేవీలు అన్నీ ప్రభావితమవుతాయి. ఇరాన్ అండర్ సీ మైన్ కేబుల్స్‌పై దృష్టి పెడితే.. ఇరాన్ పొరుగు దేశాలు, భారత్, తూర్పు ఆఫ్రికా, యూరప్-ఆసియా మధ్య ఆర్థిక లావాదేవీలు అన్నీ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. సింగపూర్ వంటి ఆసియా డేటా హబ్‌ల నుంచి యూరప్ వరకు కనెక్టివిటీ దెబ్బతింటే, ఫైనాన్షియల్ ట్రేడింగ్, బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్లు, క్రాస్-బోర్డర్ పేమెంట్లు ఆలస్యమవుతాయి. ప్రత్యామ్నాయ మార్గాలున్నా, పెద్ద స్థాయి అంతరాయం అయితే ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ప్రభావం చూపుతుంది. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ జరిగినా మరమ్మత్తులు కూడా సవాలే. ఎందుకంటే రిపేర్ షిప్‌లు ఒకేచోట నిలిచి పని చేయాలి. ఆ సమయంలో ఇరాన్ అడ్డుకుంటే అది అసాధ్యం కాదు.
యుద్ధ ప్రారంభ సమయంలోనే అండర్ సీ కేబుల్స్ అంశం తెర మీదకు వచ్చింది. వీటిని కత్తిరించడం ద్వారా ఇరాన్ డిజిటల్ వార్ జరపొచ్చనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ సమయంలో ఇరాన్ వాటిని కొట్టిపారేసింది. ఇప్పుడు జలసంధిలో నౌకల నుంచి మాత్రమే కాదు.. ఈ కేబుల్స్‌పైనా ఫీజులు వసూలు చేయాలని భావిస్తోంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, 1982లోని ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టం ప్రకారం తీరరాష్ట్రాలకు తమ జలప్రాంతాల్లో కనెక్టివిటీ మార్గాలపై షరతులు విధించే హక్కు ఉంది. ఇరాన్ ఆ ఒప్పందంపై సంతకం చేసినా.. ఇంకా ఆమోదించలేదు. సుయాజ్ కాలువలో ఈజిప్ట్ వసూలు చేసే ఫీజులను ఉదాహరణగా చూపుతున్నా.. హార్ముజ్ సహజ జలసంధి కావడం వల్ల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఏదేమైనా ఇరాన్ కనుక సముద్రగర్భ కేబుళ్లను కత్తిరించినా, లేక ఫీజులు వసూలు చేసినా ప్రపంచ డిజిటల్ కనెక్టివిటీకి ఇబ్బందులు మాత్రం తప్పవు.