ప్రధాని మోడీ పారిస్ పర్యటన భారత్-ఫ్రాన్స్ బంధాన్ని మరింత బలోపేతం చేసింది. ఈ టూర్లో మొత్తం 13 కీలక అంశాలపై ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. వీటిలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది 'జనరల్ సెక్యూరిటీ అగ్రిమెంట్ ఆన్ ది ఎక్స్ఛేంజ్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్'. ఈ చారిత్రాత్మక ఒప్పందం ద్వారా రక్షణ రంగానికి సంబంధించిన అత్యంత రహస్యమైన, సున్నిత సమాచారాన్ని ఇరుదేశాలు పరస్పరం, అత్యంత సురక్షితమైన పద్ధతిలో మార్పిడి చేసుకునే వీలు కలుగుతుంది. ఈ ఒప్పందం వల్ల కేవలం సమాచార మార్పిడే కాకుండా, అంతర్జాతీయ వేదికలపై భారత్, ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక సహకారం సరికొత్త గమ్యస్థానానికి చేరుకోనుంది. రాఫెల్ ఫైటర్ జెట్లపైనా కీలక నిర్ణయానికొచ్చారు. భారత్‌లో తయారీకి పెద్దపీట వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ 13 ఒప్పందాలకూ మించి మరో బిగ్ డీల్ దిశగా భారత్-ఫ్రాన్స్ అడుగులేస్తున్నట్టు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. అదే 6th జనరేషన్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌లోకి భారత్‌ను ఆహ్వానించడం.
యూరప్ సార్వభౌమత్వాన్ని చాటాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఫ్యూచర్ కంబాట్ ఎయిర్ సిస్టమ్ ప్రాజెక్ట్ జర్మనీ, ఫ్రాన్స్ అంతర్గత విభేదాలతో కుప్పకూలిపోయింది. ఈ క్రమంలోనే భారత్‌కు 6th జనరేషన్ యుద్ధ విమానాల ఉమ్మడి తయారీ భాగస్వామ్యాన్ని ఆఫర్ చేసింది ఫ్రాన్స్. ఇది కేవలం ఒక వ్యాపార ఒప్పందం కాదు. రాబోయే శతాబ్దపు రక్షణ ముఖచిత్రాన్ని మార్చేయగల హిస్టారికల్ డీల్. ఎందుకో తెలియాలంటే.. దాదాపు దశాబ్దం క్రితం తెరపైకి వచ్చిన ప్రాజెక్టు గురించి తెలుసుకోవాలి. యూరోప్ దేశాలు అమెరికా రక్షణ సాంకేతికతపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో 2017లో ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ కలిసి ఫ్యూచర్ కంబాట్ ఎయిర్ సిస్టమ్ ప్రాజెక్టును ప్రారంభించాయి. ఆరవ తరం యుద్ధ విమానంతో పాటు, డ్రోన్ల సమూహాన్ని నియంత్రించే 'కంబాట్ క్లౌడ్' వ్యవస్థను నిర్మించడం దీని లక్ష్యం. కానీ, ఈ ప్రాజెక్టు అనుకున్నంత సాఫీగా సాగలేదు. ఫ్రాన్స్‌కు చెందిన దస్సాల్ట్ ఏవియేషన్, జర్మనీకి చెందిన ఎయిర్‌బస్ మధ్య ప్రాజెక్ట్ లీడర్షిప్, టెక్నాలజీ షేరింగ్ విషయంలో తీవ్రమైన ఈగో వార్ నడిచింది. నిధులు భారీగా ఉన్నప్పటికీ, సాంకేతికతను పంచుకోవడానికి జర్మనీ వెనుకాడటం, జర్మనీ అమెరికా నుంచి ఎఫ్-35 విమానాలను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపడం ఫ్రాన్స్‌కు ఆగ్రహం తెప్పించింది. ఫలితంగా FCAS ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి.
బిలియన్ల డాలర్ల ప్రాజెక్ట్ ఆగిపోయిన నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వ్యూహాత్మకంగా ఆలోచించారు. ఒంటరిగా 6th-జనరేషన్ ప్రాజెక్ట్ భారాన్ని మోయడం ఫ్రాన్స్‌కు ఆర్థికంగా కష్టం. దీనికి పరిష్కారం.. రక్షణ రంగానికి భారీగా ఖర్చు చేయగల సామర్థ్యం, అత్యున్నత సాంకేతిక ఆకాంక్షలు, అన్నింటికంటే ముఖ్యంగా అత్యంత నమ్మకమైన మిత్రదేశం కావాలి. ఆ అర్హతలన్నీ ఉన్న ఏకైక దేశం భారత్. న్యూఢిల్లీ-పారిస్ బంధానికి ఒక ప్రత్యేకత ఉంది. అది పరస్పర గౌరవం, అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం అనే పునాదులపై ఏర్పాటయింది. 1998లో భారత్ పోఖ్రాన్ అణు పరీక్షలు జరిపినప్పుడు, అమెరికా సహా పశ్చిమ దేశాలన్నీ భారత్‌పై ఆంక్షలు విధించాయి. కానీ, ఆ కఠిన కాలంలో కూడా భారత్‌ను విమర్శించని, ఆంక్షలు విధించని ఏకైక పాశ్చాత్య దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. కార్గిల్ యుద్ధ సమయంలో భారత్‌కు అత్యవసరంగా లేజర్ గైడెడ్ బాంబుల టెక్నాలజీని అందించి మద్దతుగా నిలిచింది. నాటి మిరాజ్-2000 నుంచి నేటి అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాల వరకు, స్కార్పీన్ క్లాస్ సబ్మెరైన్ల వరకు ఏనాడూ ఫ్రాన్స్ భారత్‌కు సాంకేతికత సరఫరా ఆపలేదు, ఎలాంటి రాజకీయ షరతులు విధించలేదు. అందుకే రష్యా, ఇజ్రాయెల్ తర్వాత భారత్ కళ్ళు మూసుకుని నమ్మే ఏకైక రక్షణ భాగస్వామి ఫ్రాన్స్ మాత్రమే.
భారత్ ప్రస్తుతం స్వదేశీ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ అయిన అడ్వాన్స్డ్ మీడియమ్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ అభివృద్ధిపై దృష్టి పెట్టింది. అయితే, సరిహద్దుల్లో చైనా నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీతో దూసుకుపోతోంది. రక్షణ రంగంలో చైనా, అమెరికా వంటి దేశాల కంటే ముందంజలో ఉండాలంటే 6th-జనరేషన్ టెక్నాలజీ భారత్‌కు ఎంతో అవసరం. ఇలాంటి సమయంలో ఫ్రాన్స్ ఆఫర్ భారత్‌కు దొరికిన అద్భుత అవకాశంగా రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ డీల్‌లో భారత్ కేవలం విమానాలను బయ్యర్ కాదు. 'మేక్ ఇన్ ఇండియా, 'ఆత్మనిర్భర్ భారత్ కలను నిజం చేసేలా సమాన భాగస్వామిగా ఉంటుంది. అంటే మేధో సంపత్తి హక్కులు భారత్‌కు కూడా దక్కుతాయి. ఇది మాత్రమే కాదు.. 6th-జనరేషన్ విమానాల్లో ఉండే మ్యాన్డ్-అన్మ్యాన్డ్ టీమింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్, అడ్వాన్స్డ్ స్టెల్త్, 'కంబాట్ క్లౌడ్' వంటి అత్యాధునిక టెక్నాలజీలు భారత్ చేతికొస్తాయి. ఒకవేళ ఈ డీల్‌కు ఓకే చెబితే.. అంతర్జాతీయ వేదికపై పెను మార్పులకు దారితీస్తుంది. మన దేశానికి టెక్నాలజీ ఇవ్వడంలో ఆంక్షలు, షరతులు పెట్టే అమెరికాకు.. ఫ్రాన్స్-భారత్ బంధం గట్టి సమాధానం అవుతుంది. హిందూ మహాసముద్రంలో చైనా దురాక్రమణను అడ్డుకోవడానికి ఈ స్నేహం అత్యంత కీలకంగా మారుతుంది.
ఇప్పటికే ఫ్రాన్స్‌కు చెందిన 'సఫ్రాన్' కంపెనీతో కలిసి భారత్ యుద్ధ విమానాల ఇంజిన్లను తయారు చేసేందుకు చర్చలు జరుపుతోంది. ఈ 6th-జనరేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఇది మరింత బలోపేతం అవుతుంది. ఇటీవల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఈ 6th-జనరేషన్ ఫైటర్ జెట్ ఉమ్మడి అభివృద్ధి గురించి చర్చలు జరిపారు. అయితే, ఈ ఆఫర్ అద్భుతమైనదే అయినప్పటికీ, ఇరు దేశాల ముందు ఒక పెద్ద సవాలు ఉంది. అది టైమ్ అండ్ బడ్జెట్. 6th-జనరేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి బిలియన్ల డాలర్ల నిధులు, కనీసం ఒక దశాబ్ద కాలం పడుతుంది. భారత్ ఇప్పటికే అమ్కా ప్రాజెక్టులో బిజీగా ఉంది. ప్రస్తుతం స్లోవేకియా పర్యటనలో ఉన్న మోదీ జూన్ 16, 17న మరోసారి ఫ్రాన్స్‌లో పర్యటిస్తారు. ప్రతిష్టాత్మక జీ7 సదస్సుకు హాజరవుతారు. ఆ రెండు రోజుల్లో ఈ ప్రాజెక్టుపై క్లారిటీ వస్తుందేమే చూడాలి. ఒక్కటి మాత్రం నిజం.. ఈ బాహుబలి ప్రాజెక్టులోకి ఎంటరైతే భారత్ రక్షణ పరంగా తిరుగులేని స్థానంలోకి వెళుతుంది. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.