ఈరోజు మనం క్రైమ్ హిస్టరీలోనే అత్యంత క్రూరంగా, పక్కా ప్లానింగ్‌తో జరిగిన ఒక షాకింగ్ మర్డర్ కేసు గురించి మాట్లాడుకుందాం. పూణేలోని ప్రసిద్ధ లోహగఢ్ కోటపై జూన్ 18న జరిగిన కేతన్ అగర్వాల్ అనే రియల్టర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన కాబోయే భర్తను తన ప్రియుడితో కలిసి ఒక యువతి ఎంత దారుణంగా అంతమొందించిందో వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. తాజాగా పూణే రూరల్ పోలీసులు నిందితురాలైన సీయా గోయల్‌ను అదే కోటకు తీసుకెళ్లి.. క్రైమ్ సీన్ రీ-క్రియేషన్ చేశారు. ఈ మూడు గంటల విచారణలో పోలీసులకు ఎలాంటి షాకింగ్ నిజాలు తెలిశాయో ఇప్పుడు చూద్దాం.
అసలు ఏం జరిగిందంటే.. 20 ఏళ్ల సీయా గోయల్‌కు, 25 ఏళ్ల కేతన్ అగర్వాల్‌తో పెళ్లి నిశ్చయమైంది. కానీ, సీయాకు అప్పటికే 22 ఏళ్ల చేతన్ చౌదరి అనే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. ఒకవేళ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే తన కుటుంబంలో గొడవలు అవుతాయనే భయంతో, కాబోయే భర్త కేతన్‌ను పూర్తిగా ముగించేయాలని సీయా తన ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. దీనికోసం వారు ఎవరూ ఊహించని విధంగా లోహగఢ్ కోటను వేదికగా ఎంచుకున్నారు. ఈ ఘోరానికి ఒడిగట్టే ముందు వారు ఆ కోటపై ఎక్కడ నుంచి నెట్టేయాలో కూడా ముందుగానే వెళ్లి ఒకసారి 'ప్రాక్టీస్' చేయడం గమనార్హం.
పోలీసులు నిందితురాలిని కోటపైకి తీసుకెళ్లి.. కేతన్ బరువు, ఎత్తు ఉన్న ఒక డమ్మీ బొమ్మతో సీన్‌ను రీ-క్రియేట్ చేశారు. ఆ సమయంలో సీయా గోయల్ పోలీసులకు చెప్పిన వివరాలు విని అంతా ముక్కున వేలేసుకున్నారు. ప్లాన్ ప్రకారం.. కోట కొండ అంచున కేతన్ నిలబడినప్పుడు, సీయా కిందకు కూర్చోవాలి. అదే సమయంలో వెనుక నుంచి చేతన్ చౌదరి వచ్చి కేతన్‌ను కిందకు నెట్టేయాలి. షూ లేస్ కట్టుకుంటున్నట్టు నటిస్తూనో, లేదా మంచి నీళ్లు తాగడానికో ఆమె కిందకు కూర్చుని ప్రియుడికి 'సైగ' పంపింది.
అయితే, ఇక్కడ సీయా గోయల్ ఎంత తెలివిగా ఆలోచించిందో తెలుసా? ఆమె కిందకు కూర్చోవడం వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉంది. ఒకవేళ నిలబడి ఉన్నప్పుడు చేతన్ వచ్చి కేతన్‌ను నెట్టేస్తే, కిందపడిపోతూ కేతన్ తనను కూడా పట్టుకుని లోయలోకి లాగుతాడేమోనని ఆమె భయపడింది. అందుకే, కేతన్కు తను అందకుండా ఉండటానికే ఆమె పక్కాగా ప్లాన్ చేసి కిందకు కూర్చుంది. కేవలం తన ప్రాణాల రక్షణ కోసమే ఈ 'సిట్ డౌన్' సిగ్నల్‌ను వారు డిజైన్ చేసుకున్నట్లు పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ విచారణలో తేల్చారు.
ఇక ప్రియుడు చేతన్ చౌదరి కూడా తక్కువ తిన్లేదు.. కార్లలో వస్తే టోల్ ప్లాజాల వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో దొరికిపోతామనే భయంతో, పూణే నుండి లోహగఢ్ కోట వరకు ఉన్న 90 కిలోమీటర్ల దూరాన్ని ఆయన కేవలం ఒక స్కూటర్‌పై ప్రయాణించి వచ్చాడు. హత్య చేసిన తర్వాత మళ్లీ అదే స్కూటర్‌పై పూణేకు పరారయ్యాడు. అంతటితో ఆగకుండా, కోట ఎక్కేటప్పుడు హూడీ వేసుకుని, హత్య చేసేటప్పుడు బ్లాక్ టీషర్ట్‌తో ఉండి, మళ్లీ దిగేటప్పుడు హూడీ వేసుకుని తన రూపాన్ని మార్చుకుంటూ పోలీసుల కళ్లు గప్పేందుకు ప్రయత్నించాడు.
ప్రస్తుతం ఈ కేసులో ఇద్దరు నిందితుల పోలీస్ కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వం తరఫున ప్రసిద్ధ న్యాయవాది ఉజ్వల్ నికమ్ ఈ కేసుకు వాదించబోతున్నారు. అమాయకుడైన కేతన్ అగర్వాల్‌ను పొట్టనబెట్టుకున్న ఈ కిరాతకులకు ఉరిశిక్ష పడాల్సిందేనంటూ పూణేలో భారీ ర్యాలీలు జరుగుతున్నాయి.