వైభవ్ కు నో ఛాన్స్… ఇంగ్లాండ్ పై భారత తుది జట్టు ఇదే…!

ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు టీ20ల సిరీస్‌ ఆడనుంది. బుధవారం నాటింగ్‌హామ్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది.

Post Published By: dialnews
Updated : 1 July 2026, 3:15 PM IST

ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు టీ20ల సిరీస్‌ ఆడనుంది. బుధవారం నాటింగ్‌హామ్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది.పసికూన ఐర్లాండ్ చేతిలో క్లీన్ స్వీప్ అయిన టీమిండియాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్‌ గంభీర్‌‌పై మాజీ క్రికెటర్లు, అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ తీవ్ర విమర్శల మధ్య ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు సిద్దమైన భారత్.. విజయంతో సమాధానం చెప్పాలనే పట్టుదలతో ఉంది.ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడినా.. అదే కాంబినేషన్‌ను కొనసాగించే అవకాశం ఉంది. పరిస్థితులకు అలవాటు పడకపోవడంతోనే సిరీస్ ఓడిపోయామని టీమిండియా మేనేజ్‌మెంట్ వివరణ ఇచ్చింది.

ప్రపంచకప్ గెలిపించిన ఆటగాళ్లకు అండగా ఉంటామని చెప్పింది. దాంతో ఇంగ్లండ్‌తో తొలి టీ20కి కూడా టీమిండియా పెద్దగా మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది.దీంతో ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌కు దూరంగా ఉన్న టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి మరోసారి నిరాశే ఎదురుకానుంది. ఇదిలా ఉంటే కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న శ్రేయస్ అయ్యర్‌కు ఇంగ్లండ్ పర్యటన అగ్ని పరీక్షే అని చెప్పాలి. అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా విజయాలు సాధిస్తేనే అయ్యర్ కెప్టెన్‌గా కొనసాగగలడు. లేకుంటే తీవ్ర విమర్శలతో జట్టుకు దూరం కావడంతో పాటు శుభ్‌మన్ గిల్ తిరిగి సారథ్య బాధ్యతలు అందుకుంటాడు. ఐర్లాండ్‌ సిరీస్‌ ఓటమితో వరుసగా 16 సిరీస్‌లు గెలిచిన భారత జట్టు జైత్రయాత్రకు బ్రేక్ పడింది.

గాయంతో ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న స్పెషలిస్ట్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ.. ఈ సిరీస్‌కు అందుబాటులోకి రానున్నాడు. అయితే పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తేనే అతన్ని తుది జట్టులోకి తీసుకుంటారు. ఒకవేళ అతను బరిలోకి దిగితే సుందర్ బెంచ్‌కే పరిమితమవుతాడు.ఫస్ట్ డౌన్‌లో ఇషాన్ కిషన్ ఆడనుండగా.. నాలుగో స్థానంలో అయ్యర్ బ్యాటింగ్ చేయనున్నాడు. వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఐదో స్థానంలో ఆడనుండగా.. ఆరో స్థానంలో వాషింగ్టన్ సుందర్, సూర్యాన్ష్ షెడ్గేలో ఒకరు ఆడనుండగా.. ఏడో స్థానంలో పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే బరిలోకి దిగనున్నాడు. 8వ స్థానంలో అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేయనున్నాడు.హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను ఆడించాలనుకుంటే వరుణ్ చక్రవర్తీ, రవి బిష్ణోయ్‌లో ఒకరు బరిలోకి దిగుతారు. అప్పుడు సుందర్, సూర్యాన్ష్ బెంచ్‌కే పరిమితమవుతారు. ఇంగ్లండ్ బౌన్సీ పిచ్‌లకు ప్రాధాన్యత ఇస్తే ప్రిన్స్ యాదవ్ స్థానంలో ప్రసిధ్ కృష్ణ బరిలోకి దిగుతాడు.

Published : 
  • 1 July 2026, 3:15 PM IST