మన దేశంలో ఎన్నికలు అంటే లీడర్లు, పెద్ద పెద్ద ప్రచారాలు, ఓటింగ్ బూత్‌లు గుర్తొస్తాయి కదా? కానీ, ఈ జులై నెలలో మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో నమ్మశక్యం కాని ఒక సంచలనం జరగబోతోంది. అక్కడ కేవలం 5వ క్లాస్, 8వ క్లాస్ చదివే చిన్న పిల్లలు.. లీడర్లలాగా స్టేజీలెక్కి మైకుల్లో స్పీచ్‌లు ఇవ్వబోతున్నారు. మేనిఫెస్టోలు రిలీజ్ చేయబోతున్నారు. క్లాసు రూముల్లో ఓటింగ్ బాక్సులు పెట్టి మరీ అసలైన ఓటింగ్ జరగబోతోంది. దేశ చరిత్రలోనే మొదటిసారిగా గవర్నమెంట్ స్కూళ్లలో ఇలాంటి ఒక పొలిటికల్ విప్లవానికి తెరలేపింది అక్కడి ప్రభుత్వం. అసలు స్కూల్ పిల్లలకు ఎన్నికలు ఏంటి? వాళ్లకు ఇచ్చే ఆ 5 మంత్రి పదవులు ఏంటి?
అసలు విషయంలోకి వెళ్తే.. తమిళనాడు పాఠశాల విద్యాశాఖ 'మగిజ ముట్రమ్' అనే ఒక సరికొత్త హౌస్ సిస్టమ్ ప్రోగ్రామ్‌ను గతంలోనే ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. పిల్లల్లో టీమ్‌వర్క్, లీడర్‌షిప్ క్వాలిటీస్ పెంచడం. అయితే ఈ అకడమిక్ ఇయర్ (2026) నుండి దీనిని మరింత నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్తూ.. అందులోనే స్టూడెంట్ పార్లమెంట్ మరియు ఈ ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ప్రోగ్రామ్ కింద ప్రతి ప్రభుత్వ స్కూల్‌లో విద్యార్థులను ఐదు హౌస్‌లుగా విభజిస్తారు.. అవేంటంటే.. కురింజి, ముల్లై, మరుదమ్, నెయ్‌దల్ మరియు పాలై. ఈ ఐదు హౌస్‌లకు లీడర్లను ఎన్నుకోవడానికే ఇప్పుడు అసలైన ఎలక్షన్స్ జరగబోతున్నాయి.
పిల్లలైనా సరే ఈ ఎన్నికల ప్రాసెస్ మాత్రం చాలా పక్కాగా, రియల్ ఎలక్షన్స్ లాగే డిజైన్ చేశారు. ప్రతి హౌస్‌కి ఒక 'హౌస్ కెప్టెన్', ఒక 'స్టూడెంట్ మినిస్టర్' ఉంటారు. ఇందులో హౌస్ కెప్టెన్లను లాటరీ పద్ధతిలో లేదా చేతులెత్తే విధానం ద్వారా జులై 3 కల్లా ఎంపిక చేస్తారు. కానీ, అసలైన ట్విస్ట్ 'స్టూడెంట్ మినిస్టర్' పదవిలోనే ఉంది. దీని కోసం జులై 6వ తేదీన అభ్యర్థులు స్కూళ్లలో అధికారికంగా ప్రచారం నిర్వహిస్తారు. తాము గెలిస్తే స్కూల్ కోసం ఏం చేస్తామో చెప్తూ మేనిఫెస్టోలు కూడా చదువుతారు. ఆ తర్వాత జులై 7న స్కూల్ మొత్తానికి పోలింగ్ జరుగుతుంది. ఇందులో ప్రైమరీ స్కూల్స్ అయితే 5వ క్లాస్, మిడిల్ స్కూల్స్ అయితే 8వ క్లాస్, హైస్కూల్స్ లో 9వ క్లాస్, హయ్యర్ సెకండరీలో 11వ క్లాస్ చదివే స్టూడెంట్స్ మాత్రమే పోటీ చేయడానికి అర్హులు. ఇలా గెలిచిన విద్యార్థి మంత్రులకు లాటరీ పద్ధతి ద్వారా ఐదు ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను కేటాయిస్తారు. అవేంటో తెలుసా?
1. విద్యా శాఖ
2. విద్యార్థుల సంక్షేమం మరియు భద్రత
3. సమాచార మరియు సమాచార సాంకేతిక శాఖ
4. పర్యావరణం మరియు వాతావరణ మార్పుల శాఖ
5. ఆరోగ్యం మరియు పరిశుభ్రత శాఖ
ఈ శాఖల ద్వారా ఆయా స్టూడెంట్ మినిస్టర్లు స్కూల్ డెవలప్‌మెంట్‌లో భాగస్వామ్యం అవుతారు. ఇక జెండర్ ఈక్వాలిటీ కోసం ఒక క్రేజీ రూల్ పెట్టారు. కో-ఎడ్యుకేషన్ స్కూళ్లలో ఒకవేళ హౌస్ కెప్టెన్ అబ్బాయి అయితే, కచ్చితంగా స్టూడెంట్ మినిస్టర్ అమ్మాయి అయ్యిండాలి.. ఒకవేళ కెప్టెన్ అమ్మాయి అయితే, మినిస్టర్ అబ్బాయి అవ్వాలి. ఎంత గ్రేట్ ఐడియా కదా. ఈ ఎన్నికల్లో గెలిచిన బాలల క్యాబినెట్ లీడర్లు జులై 10వ తేదీన అధికారికంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వీరికి ప్రత్యేకంగా బ్యాడ్జీలు, హౌస్ ఫ్లాగ్స్ కూడా ఇస్తారు.
చిన్న వయసులోనే ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ఎన్నికలు ఎలా జరుగుతాయి? లీడర్‌షిప్ మరియు అకౌంటబిలిటీ (బాధ్యత) అంటే ఏంటో ప్రాక్టికల్‌గా నేర్పించడానికే తమిళనాడు ప్రభుత్వం ఈ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. చిన్నప్పుడే ఇలాంటి విషయాలపై అవగాహన రావడం వల్ల భవిష్యత్తులో వీరు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారని అధికారులు నమ్ముతున్నారు.