తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన మన జక్కన్న రేంజ్ ఇప్పుడు గ్లోబల్ స్థాయికి చేరింది. 'బాహుబలి', RRR లాంటి సినిమాలతో హాలీవుడ్ ప్రేక్షకులను, విమర్శకులను సైతం తనవైపు తిప్పుకున్న ఆయనకు ఫ్రాన్స్ దేశంలో మరో అరుదైన, గొప్ప గౌరవం దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పేరున్న దిగ్గజ దర్శకుల సరసన మన రాజమౌళి పేరు కూడా చేరింది. ఈ విషయాన్ని చూసి ఆయన స్వయంగా ఆశ్చర్యానికి, భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల ఫ్రాన్స్ దేశంలో రాజమౌళి దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ సినిమాలు 'ఈగ', 'ఆర్ఆర్ఆర్' ల ప్రత్యేక ప్రదర్శనలు జరిగాయి. 'ఈగ' సినిమాతోనే రాజమౌళి తనలోని వీఎఫ్ఎక్స్ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేయగా, 'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ ఆడియన్స్‌ను మెప్పించారు. ఈ రెండు సినిమాల స్క్రీనింగ్ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు రాజమౌళి స్వయంగా ఫ్రాన్స్ వెళ్లారు. అక్కడ ఆయనకు ఫ్రాన్స్ సినీ ప్రేక్షకుల నుంచి ఘన స్వాగతం లభించింది.
ఈ పర్యటనలో భాగంగా ఆయన ఫ్రాన్స్‌లోని ఒక ప్రసిద్ధ ఫిల్మ్ మ్యూజియాన్ని సందర్శించారు. అక్కడ 'ముర్ డెస్ సినీస్టేస్' అనే ఒక ప్రత్యేకమైన గోడ ఉంది. దీనినే స్థానికంగా 'దర్శకుల గోడ' అని పిలుస్తారు. ప్రపంచ సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసిన, అద్భుతమైన సినిమాలు తీసిన ఎంతోమంది ఇంటర్నేషనల్ లెజెండరీ డైరెక్టర్ల పేర్లను ఈ గోడపై గౌరవప్రదంగా చెక్కారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప డైరెక్టర్లకు ఇచ్చే అతి పెద్ద గౌరవంగా దీనిని భావిస్తారు. రాజమౌళి ఆ మ్యూజియంలో తిరుగుతూ ఆ గోడను ఆసక్తిగా గమనిస్తున్న సమయంలో.. అందులో హాలీవుడ్, ఇంకా ఇతర దేశాల దిగ్గజాల పేర్ల మధ్యలో తన పేరు 'ఎస్.ఎస్. రాజమౌళి' అని రాసి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. తన పేరును ప్రపంచ సినిమా పితామహులైన గొప్ప డైరెక్టర్ల సరసన చూసుకున్న వెంటనే రాజమౌళి చాలా ఎమోషనల్ అయ్యారు. తానెంతో అభిమానించే, స్ఫూర్తి పొందిన ఎంతోమంది ప్రపంచ స్థాయి దర్శకులతో పాటు తన పేరు కూడా ఆ గోడపై ఉండటం ఆయనకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
నెటిజన్లు, అభిమానులు కూడా "ఇది మన తెలుగు సినిమాకు, భారతీయ సినిమాకే గర్వకారణం", "రాజమౌళిది ఇటర్నేషనల్ రేంజ్'' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒకప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన రాజమౌళి పేరు, ఇప్పుడు ప్రపంచ దేశాల్లో మారుమోగుతుండటం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును సైతం ముద్దాడిన ఆయన, ఇప్పుడు ఫ్రాన్స్‌లోనూ ఇంతటి గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన తదుపరి సినిమాను తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్లో భారీ బడ్జెట్‌తో గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందించనున్నారు. ఈ సినిమాతో జక్కన్న ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతారో, ఇంకెన్ని అంతర్జాతీయ అవార్డులు సాధిస్తారో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.