Top Story: రఘురామ నీకో నమస్కారం…. ఆర్. ఆర్. ఆర్ నీ వదిలించుకునే పనిలో టిడిపి…..29లో రఘురామ ఎటు?

ఆయన ఎక్కడున్నా వివాదమే. ఏదో ఒక రూపంలో ఆయన, వివాదాలు... కలిసే ఉంటాయి. అందుకే ఆయనను ఎవరు .... ఎక్కువకాలం భరించలేరు. ఆయన ....ఎక్కువ కాలం ఎవరతోనూ ఉండడు.

Post Published By: dialnews
Updated : 4 July 2026, 9:00 AM IST

ఆయన ఎక్కడున్నా వివాదమే. ఏదో ఒక రూపంలో ఆయన, వివాదాలు... కలిసే ఉంటాయి. అందుకే ఆయనను ఎవరు .... ఎక్కువకాలం భరించలేరు. ఆయన ....ఎక్కువ కాలం ఎవరతోనూ ఉండడు. చివరికి అధికార తెలుగుదేశం పార్టీ కూడా ఆయన్ని ఇప్పుడు వదిలించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికిప్పుడు అది సాధ్యం కాదు కనుక 2029లో ఆయనకు గుడ్ బై చెప్పాలనుకుంటుంది. ఇది రాసి పెట్టుకోండి.2029 లో మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంతకీ ఆయన ఎవరో మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది ఏపీ డిప్యూటీ స్పీకర్, ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ రఘురామకృష్ణరాజు.

ఆర్ ఆర్ ఆర్ తో విడాకులు తీసుకోవాలని, 2029లో ఉండి టికెట్ ఇవ్వకూడదని టిడిపి దాదాపు డిసైడ్ అయిపోయింది. అంతేకాదు రఘురామ సొంత అజెండాతో నిర్వహించే ఏ కార్యక్రమానికి టిడిపి అధినేతలైన చంద్రబాబు, లోకేష్ గాని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కానీ హాజరు కారు. పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల కు మాత్రం ఆర్ఆర్ ఆర్ తో స్టేజ్ పంచుకుంటారు. అది కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు నిండకుండానే, చంద్రబాబు పవన్ ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? కూటమి సర్కార్లో అత్యంత కీలకమైన రఘురామకృష్ణరాజును దూరంగా ఎందుకు పెట్టారు అనే సబ్జెక్ట్ పైనే రాష్ట్రంలో అన్ని పార్టీలో లీడర్లు డిస్కస్ చేసుకుంటున్నారు. రఘురామకృష్ణరాజు వ్యవహార శైలి, మాటతీరు, వివాదాస్పద వ్యవహారాలు ఇవన్నీ చూశాక ఆయన్ని వదులుకోవడమే మంచిది అని టిడిపి ఒక నిర్ణయానికి వచ్చేసింది.

రఘురామకృష్ణంరాజు మొదట వైసీపీలో ఉన్నారు. ఆ తర్వాత కొద్దిరోజులు బిజెపికి అనుబంధంగా గా పని చేశారు. తిరిగి వైసీపీకే వచ్చారు. వైసిపి నుంచి నరసాపురం ఎంపీగా ఎన్నికయ్యారు. కానీ వైసిపి అధిష్టానం పైనే తిరుగుబాటు జెండా ఎగరేశారు. టిడిపి నాయకులు కంటే ఎక్కువగా జగన్ ని తిట్టిపోశారు. ఒకానొక సమయంలో ఆయన అరెస్టు అయ్యారు . పోలీస్ వేధింపులకు కూడా గురయ్యారు. అయితే ఇదంతా ఏం చేసినా పబ్లిసిటీ కోసమే. పొలిటికల్ గా ఒక పొజిషన్ కోసమే. వైసిపి ఎంపీగా ఉంటూనే ఉంటూనే వైసీపీకి వ్యతిరేకంగా తిరుగులేని పోరాటం చేసిన రఘురామకృష్ణంరాజుకు బిజెపి టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. దాంతో చంద్రబాబుని ఆశ్రయించారు రఘురామా. చివరి నిమిషం వరకు టెన్షన్ పెట్టి ఉండి టికెట్ ఇచ్చారు బాబు. యాంటీ జగన్ వేవ్ లో ఉండి నుంచి నెగ్గిన రఘురామా.... తన దూకుడు కి, తెలివితేటలకు తగినట్లుగా హోం మంత్రి పదవి ఇస్తారని ఆశించారు.

హోం మంత్రి కాదు కదా..... చేనేత శాఖామంత్రిగా కూడా ఇవ్వలేదు చంద్రబాబు. రగిలిపోయిన రఘురామ బహిరంగంగానే బాబుని, లోకేష్ ని మాటలతో వేటాడడం మొదలుపెట్టారు. ఏపీలో తన వల్లే కూటమి సర్కారు వచ్చిందని, తాను ప్రాణాలకు తెగించి జగన్ తో పోరాటం వల్లే ఈరోజు మూడు పార్టీలు బతికి బట్టకట్టాయని రాజుగారు మాట్లాడిన మాటలు ఎక్కడ కి చేరాలో అక్కడ కి చేరాయి. దాంతో ఆయనకు రావలసిన పదవి రాలేదు. అయితే ఇవేమీ ఆయన లెక్క చేయలేదు. తన దూకుడు ఆపను లేదు. ఈ న్యూసెన్స్ తట్టుకోలేక చంద్రబాబు , పవన్ లోకేష్ కలిసి, ఆర్ ఆర్ ఆర్ నీ డిప్యూటీ స్పీకర్ ని చేశారు. ఆయన నోటికి తాళం వేసేసారు. దీంతో మరింత రగిలిపోయారు రఘురామకృష్ణంరాజు. హోం మంత్రి అయి జగన్ అండ్ బ్యాచ్ ని కుమ్మేద్దాం అనుకున్న ఆర్ ఆర్ ఆర్ ప్లాన్ ఫెయిల్ అయింది. అప్పటినుంచి ఆయన అసంతృప్తి తో రగిలిపోతూనే ఉన్నారు. ఉండితోపాటు భీమవరం చుట్టుపక్కల రఘురామా పేకాట క్లబ్బులు నడుపుతున్నట్టు ప్రచారం జరిగింది.

భీమవరం డి.ఎస్.పి రఘురామాకు మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటుగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఉండి నియోజకవర్గంలో రఘురామ అరాచకాలపై టిడిపి, జనసేన, బిజెపి నేతలు ఉమ్మడిగా ఫిర్యాదు చేయడం విడ్డూరం. ఇలా ఒకటి కాదు స్థానిక జనసేన, టిడిపి నేతలతోనూ రాజుగారు గొడవలు పెట్టేసుకున్నారు. రఘురామని ఇలాగే వదిలేస్తే ఉండి నియోజకవర్గం వచ్చే ఎన్నికల్లో ఓడి పోవడం ఖాయమని చంద్రబాబు క్లారిటీకి వచ్చేసారు. దీనిని వెంటనే గుర్తించారు రాజుగారు. అందుకే తన వ్యూహాన్ని మార్చారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి తరఫున నరసాపురం ఎంపీగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు.

అనుకున్నదే తడవుగా అరవీర భయంకర హిందుత్వ వాదిగా, రాముని భక్తునిగా మారారు. ఆకివీడులో జీర్ణావస్థలో ఉన్న రాముడు ఆలయం తిరిగి కట్టడానికి అలనాటి రామదాసు లాగే సిద్ధపడ్డారు. కాకపోతే ఈ రామాలయం కోసం భారీగా నిధులు వసూలు చేశారని ఆరోపణలు కూడా వచ్చాయి. ఇదే విషయంలో ఆకివీడులో స్థానిక ఎస్సీలు, క్రిస్టియన్లతో నేరుగా తలపడ్డారు రఘురాజు. అసలు భవిష్యత్తులో తనకు ఎస్సీ ఎస్టీలు, క్రిస్టియన్ల ఓట్లు అవసరం లేదని బహిరంగంగా ప్రకటించేశారు. ఆకివీడు కుల ,మత విభేదాలు ఒకానొక సమయంలో కర్ఫ్యూ పెట్టే పరిస్థితికి దారి తీశాయి. రఘురామ ఒంటెత్తు పోకడ చంద్రబాబుకి తలనొప్పిగా మారిపోయింది. ఆర్ ఆర్ ఆర్ నోటి దూల వలన అసలు వచ్చే ఎన్నికల్లో ఏపీలో కూటమికి ఎస్సీ, ఎస్టీలు క్రిస్టియన్లు పూర్తిగా దూరమయ్యే ప్రమాదం వచ్చిందని చంద్రబాబుకు అర్థమైంది. జడ శ్రావణ్ లాంటి న్యాయవాదులు రాష్ట్రమంతా తిరుగుతూ రఘురామ అరాచకాన్ని ప్రచారం చేశారు.

ఈ ఇద్దరు సోషల్ మీడియాలో నేరుగా తలపడ్డారు. ఇది కూటమికి రోజురోజుకీ సమస్యగా మారిపోయింది. జడ శ్రావణ్ తనను బండబూతులు తిడుతుంటే హోం మంత్రి గాని, ప్రభుత్వం గాని పట్టించుకోలేదని... చంద్రబాబు జడ స్రవంతో ఇదంతా చేయిస్తున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు ఆర్ఆర్ ఆర్.టిడిపి అధిష్టానం తీరు అర్థం అవ్వగానే రఘురామ తెలివిగా పావులు కదపడం మొదలుపెట్టారు. హోం మంత్రి అనిత సుద్ద వేస్ట్ అని.... పరోక్షంగా కామెంట్లు చేయడమే కాక పవన్ కళ్యాణ్ హోం మంత్రి అయితేనే పరిస్థితి చక్కబడుతుందని బహిరంగనే కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. తద్వారా రఘురామా పవన్ కళ్యాణ్ కి బిస్కెట్ వేశారు .

రఘురామకృష్ణరాజు వ్యూహాలు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ కి బాగా అర్థమవుతున్నాయి. రఘురామా తనను తాను కరుడుగట్టిన హిందుత్వ వాదిగా చెప్పుకుంటూ నరసాపురం పార్లమెంటరీ సీట్ కి జనసేన లేదా బిజెపి తరఫున కర్చీఫ్ వేసే పనిలో ఉన్నారు. అయితే అక్కడి నుంచి గెలిచిన కేంద్ర మంత్రి శ్రీనివాసరాజు, రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ రఘు పప్పులు ఉడకకుండా ఎక్కడికి అక్కడ బ్రేకులు వేస్తున్నారు. టిడిపిలో సీనియర్ నేతలు మాత్రం రాజు గారిని పార్టీ లెక్కల్లోంచి ఇప్పటికే తీసేశారు. ప్రస్తుతానికి పార్టీలో ఉన్న ఆయన లేనట్లేనని చెప్పేస్తున్నారు. రఘురామ మాత్రం బిజెపితో డైరెక్టుగా కాంటాక్ట్స్ మైంటైన్ చేస్తున్నాను కాబట్టి 2029 లో బిజెపి లేదా జనసేన నుంచి ఎంపీ అభ్యర్థిగా నరసాపురం సీటుపై కర్చీఫ్ వేయడం గ్యారెంటీ అంటున్నారు.

Published : 
  • 4 July 2026, 9:00 AM IST