Top story: గేమ్ స్టార్ట్ చేసిన కాంగ్రెస్.. నేషనల్ మీడియాను వెంటాడిన రాహుల్.. రాహుల్ సూపర్ సక్సెస్.. 12 ఏళ్ళలో చూడనిది.. చూపించిన కాంగ్రెస్..!

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన రాజకీయ పరిణామాలు భారత రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించాయి. నీట్ పరీక్ష పేపర్ లీకేజీలు, విద్యా రంగంలో జరుగుతున్న అవకతవకలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మెరుపు ధర్నా ఢిల్లీ

Post Published By: dialnews
Updated : 23 July 2026, 11:48 AM IST

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన రాజకీయ పరిణామాలు భారత రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించాయి. నీట్ పరీక్ష పేపర్ లీకేజీలు, విద్యా రంగంలో జరుగుతున్న అవకతవకలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మెరుపు ధర్నా ఢిల్లీని అక్షరాలా స్తంభింపజేసింది. గత 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష కాంగ్రెస్ ఇంతటి దూకుడును, ఉధృతిని ప్రదర్శించడంతో కేంద్ర ప్రభుత్వంలో ఒక్కసారిగా వణుకు మొదలైంది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ స్వయంగా రంగంలోకి దిగి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించేందుకు దూసుకువెళ్లడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఎందుకు నేషనల్ మీడియా సైతం దారికి రాక తప్పలేదు?

నిజానికి, నిరుద్యోగం, పేపర్ లీకేజీలపై యువత నేతృత్వంలో ఏర్పాటైన 'కాక్రోచ్ జనతా పార్టీ' అంటే సీజేపి జంతర్ మంతర్ వద్ద ఈ ఉద్యమానికి గట్టి పునాది వేసింది. విద్యా వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలపై విద్యార్థులు, యువత రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న క్రమంలో వారిపై పోలీసులు ప్రయోగించిన లాఠీలు, కన్నీటి వాయువు దేశాన్ని కలచివేసాయి. విద్యార్థులపై జరిగిన ఈ దాడిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అయితే, ఎప్పుడైతే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నేరుగా ఈ విద్యార్థి ఉద్యమంలోకి ఎంటర్ అయిందో.. ఒక్కసారిగా ఢిల్లీ రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. విద్యార్థులపై దాడిని యావత్ భారత కుటుంబాలపై జరిగిన దాడిగా అభివర్ణిస్తూ రాహుల్ గాంధీ రంగంలోకి దిగడంతో, ఇది కాస్తా దేశవ్యాప్త రాజకీయ పోరాటంగా రూపాంతరం చెందింది.

కాంగ్రెస్ అగ్రనేతలు స్వయంగా రోడ్డుపై బైఠాయించి, ప్రధానమంత్రి నివాసానికి కొద్ది మీటర్ల దూరంలోనే ధర్నాకు దిగడంతో కేంద్ర సర్కార్ పూర్తిగా రక్షణలో పడిపోయింది. తక్షణమే రంగంలోకి దిగిన కేంద్ర మంత్రులు, హోమ్ సెక్రటరీ.. కాంగ్రెస్ నేతలతో చర్చలు జరపాల్సి రావడం, పార్లమెంట్‌లో చర్చకు సిద్ధమని ప్రకటించడం చూస్తుంటే ప్రభుత్వం ఎంతగా ఒత్తిడికి లోనైందో స్పష్టం చేస్తోంది. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అంతవరకు ఈ భారీ ప్రజా నిరసనలను పెద్దగా పట్టించుకోకుండా, కవర్ చేయకూడదని భావించిన కొన్ని ప్రధాన స్రవంతి నేషనల్ మీడియా ఛానళ్లు సైతం కాంగ్రెస్ ఎంట్రీతో తమ వైఖరిని మార్చుకోక తప్పలేదు.

రాహుల్ గాంధీని పోలీసులు రోడ్డుపై నుంచి బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేస్తున్న దృశ్యాలను విస్మరించడం ఏ మీడియాకూ సాధ్యపడలేదు. దాంతో అంతవరకు నెగెటివ్‌గా ఉన్న లేదా సైలెంట్‌గా ఉన్న అన్ని ప్రధాన జాతీయ ఛానళ్లు లైవ్ ప్రసారాలతో ఈ ధర్నాను ప్రముఖంగా కవర్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియాలో సైతం ఇదే ట్రెండింగ్‌గా మారింది. ఈ నిరసన ప్రదర్శనలో రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తున్నప్పుడు కూడా ఆయన తగ్గలేదు, "మోదీ గారూ.. ఎంత అణచివేసినా విద్యార్థుల న్యాయం కోసం సాగే ఈ పోరాటం ఆగేది లేదు" అంటూ సింహగర్జన చేశారు.

కేంద్రం ముందు రాహుల్ గాంధీ ఐదు ప్రధాన డిమాండ్లను ఉంచారు. అందులో మొదటిది విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలి. అలాగే పార్లమెంట్‌లో దీనిపై ప్రత్యేక చర్చ జరగాలి, నిరసనకారులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి మరియు విద్యార్థులకు ప్రధానమంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.మరోవైపు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దీనిపై స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం విచారణకు, చర్చకు సిద్ధంగా ఉన్నా కాంగ్రెస్ కేవలం రాజకీయ లబ్ధి కోసమే, హెడ్‌లైన్స్‌లో నిలవడం కోసమే విద్యార్థులను వాడుకుంటోందని, ఇదంతా పొలిటికల్ డ్రామా అని కొట్టిపారేశారు.

ఇప్పటికే సిబిఐ విచారణ జరుగుతోందని, 13 మందిని అరెస్ట్ చేశామని గుర్తు చేశారు. ఏది ఏమైనా, గత 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ రోడ్లపైకి వచ్చి ఇంతటి భారీ నిరసన తెలపడం, దానికి జనం నుండి వచ్చిన అపూర్వ స్పందన చూస్తుంటే.. రాబోయే రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని "ఘోర పాపం" అని ఒప్పుకుంటూ రక్షణలో పడటం ప్రతిపక్షానికి దక్కిన విజయంగానే భావించవచ్చు.

Published : 
  • 23 July 2026, 11:48 AM IST