తెలుగు చిత్రసీమలో తనదైన మాటల చాతుర్యంతో, పదునైన సంభాషణలతో, భావోద్వేగపూరిత సన్నివేశాలతో కోట్లాదిమంది ప్రేక్షకులను అలరిస్తూ 'మాటల మాంత్రికుడు'గా తన పేరును ముద్రించుకున్నారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా టాలీవుడ్‌లోని అగ్ర దర్శకులలో ఒకరిగా కొనసాగుతూ ఆయన ఎన్నో అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లను టాలీవుడ్ ఇండస్ట్రీకి అందించారు.
త్రివిక్రమ్ సినిమా వస్తోంది అంటే చాలు, అన్ని వర్గాల ప్రేక్షకులు కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లడానికి ఆసక్తి చూపుతారు. ఆయన సినిమాల్లో కనిపించే హోమ్‌లీ వాతావరణం, పంచు మాటలు, కుటుంబ సంబంధాల ప్రాధాన్యత ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటాయి.
ఇక మరోవైపు, ఈ తరం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి.
కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కలగలిపి పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో అనిల్ తనదైన శైలిని ఏర్పరచుకున్నారు. ఆయన అందించే సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తూ, ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తున్నాయి.
'గుంటూరు కారం' చిత్రం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్లీ తన మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ దిశగా అడుగులు వేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ తో కలిసి ఆయన 'ఆదర్శ కుటుంబం' అనే మరో ఆసక్తికరమైన కథతో మన ముందుకు రాబోతున్నారు. అయితే, ఈ సినిమాకి సంబంధించిన ప్రోమోలు, చిన్న క్లిప్స్ బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో ఒక వర్గం నెటిజన్లు ప్రతికూల ప్రచారాన్ని ప్రారంభించడం గమనార్హం. కొంతమంది ఆడియన్స్ త్రివిక్రమ్ సినిమాలను అనిల్ రావిపూడి సినిమాల శైలితో పోలుస్తూ సోషల్ మీడియాలో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. వెంకటేష్ వంటి సీనియర్ హీరోతో ఒక ఫ్యామిలీ డ్రామా వస్తోందంటే చాలు, ప్రేక్షకులు కొందరు ఇంకా అనిల్ రావిపూడి సినిమాల హ్యాంగోవర్‌లోనే ఉండిపోతున్నారు.
సినిమా టీజర్ లేదా ట్రైలర్ కూడా పూర్తి స్థాయిలో చూడకుండా, కేవలం కొన్ని చిన్న ప్రోమో క్లిప్‌ల ఆధారంగానే సినిమా మొత్తం ఇలాగే ఉంటుందని అంచనాకు రావడం ఎంతవరకు సమంజసం? అనేది కొందరి వాదన.మరో విచిత్రమైన విషయం ఏమిటంటే... అనిల్ రావిపూడి సినిమాలు నచ్చుతాయా అంటే 'అవి క్రింజ్ సినిమాల్లా ఉంటాయి' అని కామెంట్ చేసే కొందరు నెటిజన్లు, ఇప్పుడు అదే మాటను త్రివిక్రమ్ సినిమాకు కూడా ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు.త్రివిక్రమ్ శైలి వేరు, అనిల్ రావిపూడి శైలి వేరు. ఇద్దరూ వినోదాన్నే ప్రధానాంశంగా తీసుకున్నప్పటికీ, వారి కథాంశాలు, సంభాషణలు, కథనాన్ని నడిపించే తీరు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఒకరి మేకింగ్ శైలిని మరొకరికి ఆపాదించి, సినిమా అసలు రూపురేఖలు చూసేకంటే ముందే నెగిటివ్ టాక్ సృష్టించడం సినిమా పరిశ్రమకు ఎంతమాత్రం మంచిది కాదు అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.