ఎన్నికలొచ్చాయంటే చాలు రాజకీయ నాయకులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. ప్రచారం ఖర్చు ఒకెత్తయితే, కంటికి కనిపించకుండా రహస్యంగా పంచే ‘సీక్రెట్ ఖర్చు’ అభ్యర్థులకు పెద్ద గుదిబండగా మారుతాయి. అయితే, ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన 'స్పెషల్ సమ్మరీ రివిజన్' SIR ప్రక్రియ ద్వారా ఊహించని రీతిలో భారీగా బోగస్ ఓట్లు, చిరునామా లేని ఓటర్ల పేర్లు తొలగిపోతుండటం రాజకీయ నేతల్లో సరికొత్త రిలీఫ్‌ను ఇస్తోంది. ఓటర్లు తగ్గారు కాబట్టి డబ్బులు సేవ్ అయ్యాయంటూ వివిధ పార్టీల నాయకులు, ఆశావహులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల ముగిసిన SIR ఎన్యుమరేషన్ ప్రక్రియతో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా నుంచి దాదాపు 73.39 లక్షల మంది వివరాలు లభ్యం కాలేదని స్పష్టమైంది. ఈ ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్ ఓటరు లిస్టులో ఉండే అవకాశం లేకపోవడంతో, తుది జాబితాలో భారీగా ఓట్లు డిలీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇందులో అత్యధికంగా 60 శాతం ఓట్లు కేవలం గ్రేటర్ హైదరాబాద్, దానికి ఆనుకుని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల్లోనే ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న సుమారు 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ఖర్చు ఊహించని రీతిలో తగ్గుతుందని పోటీపడే నేతలు లెక్కలేసుకుంటున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రచార ఖర్చులు, మైక్ సెట్లు, డిజెలు, వాహనాల పెట్రోల్/డీజిల్, బహిరంగ సభలు, టీ-కాఫీల ఖర్చులకు స్పష్టమైన లెక్కలు చూపించాలి. దీనికి గరిష్ఠ పరిమితి ఉంటుంది. కానీ, ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. అసలు కథంతా ప్రచారం ముగిసిన తర్వాత ఉండే 48 గంటల 'సైలెంట్ పీరియడ్' లోనే జరుగుతుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు రహస్యంగా ఓటుకు ఒక రేటు చొప్పున పంపిణీ చేసే యంత్రాంగం నడుస్తుంది. పచ్చ నోట్లు, బీరు, బిర్యానీ, రకరకాల గిఫ్ట్ ప్యాక్‌లు.. ఇలా లెక్కల్లోకి రాని భారీ ఖర్చు అంతా ఈ 48 గంటల్లోనే జరుగుతుంటుంది. ఎలక్షన్ వాచ్ వంటి స్వచ్ఛంద సంస్థలు ఈ 'డార్క్ సైడ్ ఆఫ్ ది డెమోక్రసీ' పై పదేపదే ఈసీకి ఫిర్యాదులు చేస్తున్నా, నిరూపించలేని ఈ ఖర్చులు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ రహస్య ఖర్చు పూర్తిగా నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ఓటర్ల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే, ప్రత్యర్థి ఇచ్చే దానికి పోటీగా అభ్యర్థి పెట్టాల్సిన ఖర్చు అంత ఎక్కువగా పెరుగుతుంది. గతంలో ఉన్నట్లుగా లక్షలాది బోగస్ ఓట్లు లేదా డబుల్ ఓట్లు ఉంటే, ప్రతి ఓటుకూ డబ్బులు పంచడం అభ్యర్థులకు పెనుభారంగా మారేది. ఇప్పుడు 'సర్' ఎన్యుమరేషన్ ఫలితంగా ఓటర్ల జాబితా శుద్ధి కావడం, లక్షలాది లభ్యత లేని ఓటర్ల పేర్లు తొలగిపోవడంతో అభ్యర్థులపై 'సీక్రెట్ ఖర్చు' భారం గణనీయంగా తగ్గనుంది. ముఖ్యంగా హైదరాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వలసదారులు, ఇళ్లు మారినవారు, చనిపోయినవారి పేర్లు జాబితాలో అధికంగా ఉండేవి. వీరందరి పేర్లు ఇప్పుడు డ్రాఫ్ట్ లిస్ట్ నుంచి తొలగిపోనుండటంతో ఆ మేరకు తమకు కోట్లలో డబ్బు మిగులుతుందని నేతలు సంబరపడుతున్నారు.
ఒకవైపు ఖర్చు తగ్గుతుందనే సంతోషం ఉన్నప్పటికీ, మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంక్ గల్లంతవుతుందనే ఆందోళన కూడా ఉంది. డ్రాఫ్ట్ లిస్టు నుంచి తొలగించిన పేర్లపై ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత, సరైన ఆధారాలు చూపించని వారి పేర్లను ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తిస్థాయిలో డిలీట్ చేయనున్నారు. ఈ తొలగించిన ఓట్లలో తమకు కేడర్ పరంగా అనుకూలంగా ఉండే ఓటర్లు ఎంతమంది ఉన్నారోననే నిఘా కూడా పార్టీలు పెడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ, కంటికి కనిపించకుండా కోట్ల రూపాయలు మంచినీళ్లలా తాగేసే ఎన్నికల రహస్య ఖర్చుకు ఓటర్ల జాబితా శుద్ధీకరణ ప్రక్రియ కొంతవరకు చెక్ పెట్టడమే కాకుండా, రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు జేబు భారాన్ని తగ్గించనుందనేది స్పష్టమవుతోంది.