బంగారం మార్కెట్లో ఏం జరుగుతోంది ? పసిడి ధరలు మళ్లీ పరుగులు పెడతాయా ? ఒక రోజు పెరిగితే..మరో రోజు తగ్గుతోంది. ఎప్పుడు పెరుగుతుందో...ఎప్పుడు తగ్గుతుందో ఇన్వెస్టర్లు అంచనా వేయలేకపోతున్నారు. అమెరికా-ఇరాన్ యుద్దంతో పెట్టుబడిదారులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అమెరికా ఏ నిర్ణయం తీసుకున్నా...ఆ ఎఫెక్ట్ ప్రపంచం పడుతోంది. ఈ కారణంగానే బంగారం ధరల్లో నిలకడ లోపించింది.
పసిడి ధరలు...ఇన్వెస్టర్లను కంగారు పెడుతున్నాయి. ధరలు ఊగిసలాట కొనసాగుతోంది. ఒక రోజు పెరిగితే...మరో రోజు పతనమవుతోంది. దీంతో పెట్టుబడిదారులకు ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. పసిడిపై పెట్టుబడి పెట్టాలా ? వద్దా అన్న గందరగోళంలో పడిపోయారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తలతిక్క నిర్ణయాలు...పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధంపై పలు రకాల నిర్ణయాలు మార్కెట్ల కొంపముంచాయి.
సాధారణంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు బంగారం ధరలు ఆకాశాన్నంటుతాయి. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, హర్మూజ్‌లో అంతరాయాలు వంటి కారణాలు బంగారంపై సానుకూల ప్రభావం చూపడం లేదు. డాలర్ బలపడటం, ద్రవ్యోల్బణంపై ఫెడరల్ రిజర్వ్ నుంచి వస్తున్న సూచనలు బంగారంపై ఒత్తిడిని పెంచుతున్నాయి. దీనివల్ల సాంప్రదాయ పెట్టుబడిదారుల అంచనాలు తలకిందులయ్యాయి. యుద్ధం జరుగుతున్న సమయంలో పసిడి ధరలు పెరుగుతూ పోవాలి. కానీ అందుకు విరుద్ధంగా మార్కెట్లో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డాలర్ ఇండెక్స్ ఒక నెలన్నరగా బలపడుతూ వస్తోంది. డాలర్ బలపడటంతో, ఇతర కరెన్సీలు వాడే కొనుగోలుదారులకు బంగారం ఖరీదైనదిగా మారుతుంది. దీనివల్ల బంగారం డిమాండ్ తగ్గుతుంది. పశ్చిమాసియా సంఘర్షణలు తీవ్రమవుతున్నప్పటికీ, డాలర్ బలమే బంగారాన్ని వెనక్కి నెట్టివేస్తోంది. మార్కెట్ ప్రస్తుతం భౌగోళిక రాజకీయ ప్రమాదాల కంటే కరెన్సీ కదలికలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
2026 తొలి నెలలో బంగారం ధరలు తీవ్రమైన హెచ్చుతగ్గులను చూశాయి. జనవరిలో 5,589 డాలర్లతో రికార్డు స్థాయిని తాకిన బంగారం, మొదటి త్రైమాసికం చివరి నాటికి గణనీయంగా పడిపోయింది. 2026 చివరి నాటికి బంగారం ధరలు 5,000 నుంచి 6,000 మధ్యలో ఉంటాయని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, కరెన్సీ విలువ తగ్గడం, కొనసాగుతున్న భౌగోళిక అనిశ్చితి వంటి అంశాలు దీనికి కారణాలుగా చెబుతున్నారు. మదుపరులు సాధారణంగా సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారాన్ని కొంటుంటారు. దీనివల్ల డిమాండ్ ఏర్పడి పసిడి ధరలు ఎగబాకుతుంటాయి. అయితే, ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు కుప్పకూలడం మదుపర్లకు తీవ్ర నిరాశే మిగిల్చింది. మొన్న జనవరి 29న ఔన్స్ పసిడి ధర అంతర్జాతీయంగా 5,595 డాలర్లు పలికింది. అంటే మన దగ్గర పది గ్రాముల బంగారం సుమారు రూ.1.75లక్షలకు చేరింది. ఈ క్రమంలోనే అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం తలెత్తడంతో పసిడి ధరలు భారీగా పతనమయ్యాయి. ఈ పశ్చిమాసియా సంక్షోభం కారణంగా మార్చి మధ్యలో బంగారం ధరలు దాదాపు 27శాతం మేర క్షీణించాయి. అమెరికా ఏ నిర్ణయం తీసుకున్నా...అది ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపిస్తుంది.
ఇరాన్ యుద్ధం ముగియవచ్చనే సంకేతాలతో బంగారం ధరలు తిరిగి పెరగడానికి కారణం. వాటికి తగినట్లే నిన్న కాల్పుల విరమణ ప్రకటన వచ్చింది. ఫలితంగా డాలర్ విలువ దిగివచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో బంగారం ధరలు మళ్లీ పెరగవచ్చనే అభిప్రాయాలు స్టాక్ మార్కెట్లు, బులియన్ మార్కెట్లపై కొంతమేర పనిచేసి ధరల నిర్ణయంపై ప్రభావం చూపుతున్నాయి. ఏదిఏమైనా సామాన్యులు, మదుపరులు ప్రపంచ పరిణామాలను నిశితంగా గమనిస్తూ పసిడి కొనుగోలు విషయంలో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లు పెంచవచ్చన్న వార్తలు వచ్చాయి. దాంతో బంగారం కంటే బాండ్లకు ఎక్కువ రిటర్న్ వస్తుందన్న ప్రచారంతో పసిడి తీవ్ర ఒత్తిడికి లోనై ధర కోల్పోయింది. ఇరాన్ యుద్ధం వల్ల కొన్ని దేశాలు చమురు అమ్ముకోలేక, నగదు కోసం బంగారాన్ని పెద్దయెత్తున విక్రయించడమూ పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపింది.