Top story:ట్రంప్‌కి…గోల్డ్ రేట్‌కు లింక్ ఏంటి ? ఇక బంగారం, వెండికి వెలుగులేనా ?
బంగారం, సిల్వర్ ఇన్వెస్టర్లు...ట్రంప్‌కు పూజలు చేయాల్సిందేనా ? ట్రంప్ అధ్యక్షుడయ్యాకే...లోహాల ధరలు జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయా
బంగారం, సిల్వర్ ఇన్వెస్టర్లు…ట్రంప్‌కు పూజలు చేయాల్సిందేనా ? ట్రంప్ అధ్యక్షుడయ్యాకే…లోహాల ధరలు జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయా ? బంగారం తులం లక్షా 60వేలకు చేరిందంటే కారణం…ట్రంపేనా ? అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నంతకాలం…బంగారం, వెండికి వెలుగులేనా ? గోల్డ్, సిల్వర్‌కు…మరో మూడేళ్లు తిరుగులేదా ?గోల్డ్ ఇన్వెస్టర్లు…ట్రంప్ ఫొటోను ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఏడాదిగా బంగారం ధర కొండెక్కి కూర్చుందంటే దానికి కారణం ట్రంప్. బంగారంపై పెట్టుబడి పెడుతున్న వారంతా…అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి రుణపడి ఉండాలి.
ట్రంప్ అధ్యక్షుడిగా లేకపోతే బంగారం, సిల్వర్ ధరలు మరోలా ఉండేవి. ఏడాది క్రితం అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించకముందు…10 తులాల బంగారం 80వేలు మాత్రమే ఉంది. ఏడాదిలోనే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ట్రంప్ ఏ చర్య తీసుకున్నా బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. 80 వేలున్న బంగారం…లక్షా 60వేలకు చేరువలో ఉంది. దీనికి కారణం…డోనాల్డ్ ట్రంప్. ఏడాదిలోనే బంగారం ధర ఏకంగా 70 శాతంపై పెరిగింది. వెండి అయితే 207 శాతం పెరిగింది. అంటే.. ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున బంగారం లేదా వెండిలో ఓ 50 లక్షలు పెట్టుబడి పెడితే, ఏడాది తిరిగేసరికి కోటి రూపాయలు మన ఖాతాలో ఉంటాయి.
ట్రంప్ వల్ల భారీగా లబ్ది పొందిన జనం చాలానే ఉన్నారు. వాళ్లంతా ట్రంప్‌కు రుణపడి ఉండాల్సిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే సుంకాల బాదుడు మొదలుపెట్టారు. దీంతో గోల్డ్ రన్…జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. ఆ తర్వాత ఇరాన్‌పై యుద్ధం చేసినంత పని చేశారు. దీంతో పసిడి పరుగు మరింత అందుకుంది. సుంకాల గురించి మాట్లాడిన ప్రతిసారి బంగారం ధర పెరిగింది. మొన్న వెనెజులా అధ్యక్షుడు మదురోను అరెస్టు చేశాక…బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ఆ తర్వాత గ్రీన్‌లాండ్‌పై సైనికచర్యకు రెడీ అవుతున్నారు. ట్రంప్ వరుస నిర్ణయాలతో బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి.
ఏడాది క్రితం తొలిసారి లక్ష మార్కును దాటిన వెండి.. ఇప్పుడు 3 లక్షల మార్క్‌ను క్రాస్ చేసింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర లక్షన్నర దాటిపోయింది. ఆర్నమెంట్‌కు వినియోగించే 22 క్యారెట్ల పసిడి ధర లక్షా 36వేలు దాఏటసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఔన్సు 4,735 డాలర్లకు చేరింది. వెండి ఔన్సు 95 డాలర్లు వద్ద కొనసాగుతోంది. ఏడాదిగా బంగారం, వెండి…పరుగులు పెడుతున్నాయి. రేస్ ట్రాక్‌లో నువ్వా నేనా అన్నట్లు దూసుకెళ్తున్నాయి. అయితే ధరల పెరుగుదలలో బంగారాన్ని మించి, వెండి దూకుడును ప్రదర్శిస్తోంది. పుత్తడి ఏడాదిలో 70వేలకుపైగా పెరిగితే…వెండి ధరలు మూడు నెలల్లోనే డబుల్ అయ్యాయి.
దేశీయ విపణిలో కిలో వెండి ధర 3 లక్షలు క్రాస్ చేసింది. ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ కాస్త బలహీనపడటం, గ్రీన్‌లాండ్ స్వాధీనానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడుగా అడుగులు వేస్తుండటంతో సురక్షితమని భావిస్తున్నారు. బంగారం, వెండిపైకి అధికంగా పెట్టుబడులు రావడమే ధరలు గణనీయంగా పెరగడానికి కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కొత్త ఇంధన రంగాలు, విద్యుత్తు వాహనాల తయారీ రంగాల నుంచి వెండికి గిరాకీ అంతకంతకూ పెరుగుతోంది. కమొడిటీల ట్రేడింగ్ జరిగే ఎక్స్ఛేంజీలతో పాటు విక్రయశాలల్లోనూ ఈ లోహాల ధరలు రికార్డు గరిష్ఠాలకు చేరుతున్నాయి.
గత రెండు నెలలుగా బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ధరలు ఇంకా పెరుగుతాయా ? లేక పడిపోతుందా అని ప్రజలే కాదు, వ్యాపారులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఇక ఇంతకంటే పెరుగుతుందా…అనుకునే లోపే అంతకు మించి రికార్డులు సృష్టిస్తున్నాయి బంగారం ధరలు. లక్ష మార్కు టచ్ అయినప్పుడే అమ్మో అనుకుంటే…ఇప్పుడు లక్షా 50వేలకి చేరింది. ఇంకా ఎంత పెరుగుతుందో, లేక తగ్గుతుందో అస్సలు అంచనాలకు అందడం లేదు. మొత్తంగా చూస్తే గడిచిన ఏడాదిలో పుత్తడి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఏడాది వ్యవధిలో 10గ్రాములు బంగారం 70వేలకుపైగా పెరిగింది. అంటే దాదాపు 54%పైగా పెరిగిందన్నమాట.
గత 8 ఏళ్లలో వెండిపై ఆధారపడి పనిచేసే పరిశ్రమల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీని ఫలితంగానే వెండి ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. ధరల పెరుగుదల అంశం సంబంధిత వర్గాలకే కాకుండా సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. సురక్షితమైన పెట్టుబడి సాధనాలైన బంగారం-వెండి వైపు మదుపర్లు పరుగులు పెడుతున్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజులు బంగారం-వెండి ధరలు పెరుగుతూనే ఉంటాయి. ట్రంప్ ఎంతకాలం ఉంటే…అంతకాలం బంగారం మెరుపులు..వెండి ధగధగలు ఖాయం.










