గాయం విలువ తెలిసినోడే సాయం చేయగలడు…!

వెండితెరపై తన నటనతో, డ్యాన్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నిజజీవితంలోనూ తన ఉదారతను చాటుకుంటున్నారు. మాట ఇస్తే తప్పని 'మగవాడు' అనిపించుకుంటూ, ఒక అభాగ్యురాలి జీవితంలో వెలుగులు నింపుతున్నారు.

Post Published By: dialnews
Updated : 21 March 2026, 9:53 AM IST

వెండితెరపై తన నటనతో, డ్యాన్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నిజజీవితంలోనూ తన ఉదారతను చాటుకుంటున్నారు. మాట ఇస్తే తప్పని 'మగవాడు' అనిపించుకుంటూ, ఒక అభాగ్యురాలి జీవితంలో వెలుగులు నింపుతున్నారు. కాకినాడ జిల్లాలో జరిగిన ఒక విషాద ఘటనలో తండ్రిని కోల్పోయిన ఓ దివ్యాంగురాలికి అండగా నిలుస్తానని చెప్పిన బన్నీ, ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేశారు. కాకినాడ జిల్లా వెట్లపాలెంలో కొద్దిరోజుల క్రితం జరిగిన బాణసంచా పేలుడు ప్రమాదం ఆ గ్రామంలో తీరని విషాదాన్ని నింపింది.

ఈ ప్రమాదంలో ఒక నిరుపేద కుటుంబం తన ఇంటి పెద్దను కోల్పోయింది. మానసిక దివ్యాంగురాలైన దుర్గ, తన తండ్రిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ వార్త సోషల్ మీడియా ద్వారా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దృష్టికి వెళ్ళింది.
ప్రమాద తీవ్రతను, ఆ కుటుంబ దీనస్థితిని అర్థం చేసుకున్న అల్లు అర్జున్, వెంటనే స్పందించారు. దుర్గకు జీవితాంతం అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కేవలం సానుభూతి చూపడమే కాకుండా, ఆమె పోషణ కోసం ప్రతినెలా 7,500 ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

తాజాగా, దుర్గ అకౌంట్‌లో మొదటి నెల సహాయంగా 7,500 జమ అయ్యాయి. దీనికి సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్‌ను సాగర్ బొలిశెట్టి అనే వ్యక్తి సోషల్ మీడియాలో పంచుకున్నారు. వెట్లపాలెం దుర్గకు మొదటి నెల సాయం అందింది. థాంక్యూ అల్లు అర్జున్ గారు" అంటూ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. "సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ నువ్వు హీరోవి బన్నీ" అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే గుణమే గొప్పదని, అల్లు అర్జున్ తన మంచి మనసుతో మరోసారి నిరూపించారని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు.

సాధారణంగా సెలబ్రిటీలు ఏదైనా విపత్తు జరిగినప్పుడు విరాళాలు ఇవ్వడం చూస్తుంటాం. కానీ, ఒక వ్యక్తికి జీవితాంతం పెన్షన్ లాగా ఆర్థిక సాయం చేస్తానని ముందుకు రావడం అనేది చాలా అరుదైన విషయం. దుర్గ వంటి దివ్యాంగురాలికి ఈ మొత్తం ఆమె జీవనాధారానికి ఎంతో భరోసానిస్తుంది.ప్రస్తుతం అల్లు అర్జున్ డైరెక్టర్ 'అట్లీ మూవీతో షూటింగ్‌తో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, తన దగ్గరకు వచ్చిన ఆర్తులను ఆదుకోవడంలో ఏమాత్రం వెనకాడటం లేదు. ఆయన చేసిన ఈ పని ఇతర సెలబ్రిటీలకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది.

Published : 
  • 21 March 2026, 9:53 AM IST