విజయ్ సినిమాకు మరో షాక్.. జన నాయగన్ వివాదం మళ్ళీ మొదటికి.. అసలు వస్తుందా..?

రామాయణంలో ఆ సీతమ్మకు కూడా లేని కష్టాలు విజయ్ సినిమాకు వస్తున్నాయి. పరిస్థితులు చూస్తుంటే అసలు జన నాయగన్ సినిమా విడుదల అవుతుందా లేదా అనే డౌట్ వస్తుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 27, 2026 | 04:00 PMLast Updated on: Jan 27, 2026 | 6:22 PM

Another Shock For Vijays Film The Jananayagan Controversy Is Back

రామాయణంలో ఆ సీతమ్మకు కూడా లేని కష్టాలు విజయ్ సినిమాకు వస్తున్నాయి. పరిస్థితులు చూస్తుంటే అసలు జన నాయగన్ సినిమా విడుదల అవుతుందా లేదా అనే డౌట్ వస్తుంది. ఈ సినిమాకు ఎన్ని చుక్కలు చూపించాలో అన్ని చూపిస్తుంది మద్రాస్ హైకోర్టు. తాజాగా ఈ చిత్ర సెన్సార్ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దాఖలైన రిట్ అప్పీల్‌ను హైకోర్టు స్వీకరించింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ సినిమా విడుదలకు సంబంధించి గతంలో వచ్చిన ఉత్తర్వులు ఇకపై చెల్లుబాటు కావు. అసలు సింగిల్ జడ్జి తీర్పును ఎందుకు రద్దు చేశారంటే… విచారణ సమయంలో అవతలి పక్షానికి తమ వాదనలు వినిపించడానికి లేదా కౌంటర్ దాఖలు చేయడానికి తగినంత సమయం ఇవ్వలేదని హై కోర్టు అభిప్రాయపడింది.

ఇరు పక్షాల వాదనలు వినకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరైన విధానం కాదని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ కేసును మళ్ళీ మొదటి నుంచి విచారించాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ వ్యవహారాన్ని తిరిగి అదే సింగిల్ జడ్జి బెంచ్‌కు బదిలీ చేసింది. అంటే ఈ కేసు ఇంకా ముగిసిపోలేదు. సింగిల్ జడ్జి ఇప్పుడు ఇరు పక్షాలకు సమాన అవకాశం ఇచ్చి, వాదనలు విన్న తర్వాతే కొత్తగా తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు ఈ తాజా ఉత్తర్వుల్లో సినిమా నిర్మాతకు ఒక వెసులుబాటు కూడా లభించింది. నిర్మాత తన రిట్ పిటిషన్‌లో ఏవైనా మార్పులు చేయాలన్నా లేదా కొత్త అంశాలను జోడించాలన్నా కోర్టు అనుమతినిచ్చింది. అంటే కోర్టు నుండి తాము ఏం కోరుకుంటున్నామో దాన్ని సవరించుకునే అవకాశం నిర్మాతకు దక్కింది.

క్లుప్తంగా చెప్పాలంటే హైకోర్టు అప్పీల్‌ను సమర్థించడంతో పాత తీర్పు రద్దయింది. ఇప్పుడు బంతి మళ్ళీ సింగిల్ జడ్జి కోర్టులోనే ఉంది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత వచ్చే తదుపరి తీర్పుపైనే జన నాయగన్ సెన్సార్, విడుదల ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయే వరకు విజయ్ సినిమాకు మోక్షం కలిగేలా లేదు. కేంద్రంలో ఉన్న బిజెపి జననాయకుడు సినిమాను ఎలాగైనా బయటికి రానివ్వకుండా చేస్తున్నారని ఇప్పటికే విజయ్ అభిమానులు మండి పడుతున్నారు. రాష్ట్రంలో ఉన్న డీఎంకే కూడా సపోర్ట్ చేస్తున్నట్టే ఉన్న వెనుక నుంచి వాళ్లు కూడా ఈ సినిమాను ఆపాలని ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక చూడాలి ఏం జరగబోతుందో..!