సౌత్ ఇండియాలో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఏఆర్ మురుగదాస్ ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకున్నారు. శివకార్తికేయన్‌తో ఆయన రూపొందిస్తున్న 'మధరాసి' సినిమా బడ్జెట్ అంచనాలు మించిపోవడంతో, ఆ చిత్ర నిర్మాత డైరెక్టర్‌పై కౌన్సిల్లో ఫిర్యాదు చేశారు. అయితే, తాజాగా ఈ వివాదానికి ఒక ఆసక్తికరమైన ముగింపు లభించింది. మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ కథానాయకుడిగా 'మధరాసి' సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది.
ఈ సినిమా బడ్జెట్‌ను 115 కోట్లుగా నిర్ణయించారు. కానీ, షూటింగ్ సాగుతున్న కొద్దీ ఆ బడ్జెట్ ఏకంగా 170 కోట్లకు చేరింది. అంటే దాదాపు 55 కోట్ల రూపాయల అదనపు భారం నిర్మాతపై పడింది. దీనికి ప్రధాన కారణం మురుగదాస్ సరైన ప్లానింగ్ చేయకపోవడమేనని నిర్మాత ఆరోపించారు. ఒకవైపు ఈ సినిమా పనులు జరుగుతుండగానే, మరోవైపు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'సికందర్' ప్రాజెక్ట్ కమిట్మెంట్స్ వల్ల 'మధరాసి' పనుల్లో జాప్యం జరిగిందని, దానివల్ల బడ్జెట్ అమాంతం పెరిగిపోయిందని నిర్మాత కౌన్సిల్‌ను ఆశ్రయించారు. ఈ వివాదంపై స్పందించిన ప్రొడ్యూసర్ కౌన్సిల్, డైరెక్టర్ మురుగదాస్ మరియు నిర్మాత మధ్య చర్చలు జరిపింది. ఈ చర్చల అనంతరం ఒక రాజీ కుదిరింది. జరిగిన నష్టానికి పరిహారంగా, మురుగదాస్ తన వద్ద ఉన్న ఒక క్రేజీ ప్రాజెక్ట్ స్క్రిప్ట్‌ను నిర్మాతకు ఇచ్చేందుకు అంగీకరించారు.
గతంలో బ్లాక్‌బస్టర్ హిట్టయిన, చిరంజీవి 'ఠాగూర్' సినిమాకు మాతృక అయిన 'రమణ' చిత్రానికి సీక్వెల్‌గా 'రమణ 2' కథను సిద్ధం చేశారు మురుగదాస్. ఇప్పుడు ఈ 'రమణ 2' తెలుగు వెర్షన్ కథను సదరు నిర్మాతకు ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఉచితంగా ఇచ్చేందుకు మురుగదాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మురుగదాస్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. 'రమణ' లాంటి పవర్ఫుల్ సోషల్ మెసేజ్ ఉన్న సినిమాకు సీక్వెల్ అంటే సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి. ఈ కథను ఏ తెలుగు హీరోతో చేస్తారు? అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది? అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.ఏది ఏమైనా, ఒక వివాదం వల్ల తెలుగు ప్రేక్షకులకు 'రమణ 2' లాంటి ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్ వచ్చే అవకాశం కలగడం విశేషం.